ఆదివారం 31 మే 2020
Business - Apr 28, 2020 , 00:43:14

రివ్వున ఎగిసిన మార్కెట్లు

రివ్వున ఎగిసిన మార్కెట్లు

  • సెన్సెక్స్‌ 416, నిఫ్టీ 128 పాయింట్ల లాభం

ముంబై, ఏప్రిల్‌ 27: స్టాక్‌ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం స్టాక్‌  మార్కెట్లకు ఆక్సిజన్‌లా పనిచేసింది. ప్రారంభం నుంచి లాభాలబాట పట్టిన సూచీలకు ఆర్బీఐ నిర్ణయం.. మరిం త జోష్‌ పెంచింది. ఒక దశలో 32వేల పాయింట్లకు పైకి చేరుకున్న బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 415.86 పాయింట్లు లేదా 1.33 శాతం లాభపడి 31,743.08 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 127.90 పాయింట్లు(1.40 శాతం) అందుకొని 9,283.30 వద్ద స్థిరపడింది. 25 షేర్ల ఇండెక్స్‌లో అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగియడం విశేషం. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 6 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. గత త్రైమాసికానికిగాను ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నదన్న అంచనాలతో బ్యాంక్‌ షేరు భారీగా లాభపడింది. వీటితోపాటు యాక్సిస్‌ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లె, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటాన్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌, అల్ట్రాటెక్‌, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌లు ఒక్క శాతానికి పైగా షేరు బలపడింది. అలాగే సన్‌ఫార్మా, రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, ఎల్‌అండ్‌టీ, మారుతి, పవర్‌గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రాలు నష్టపోయాయి. 

ఆర్థిక రంగ షేర్ల దూకుడు

సెంట్రల్‌ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక రంగ షేర్లు భారీగా దూసుకుపోయాయి. ముఖ్యంగా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో నిప్పన్‌ లైఫ్‌ ఇండియా 11.38 శాతం లాభపడగా, హెచ్‌డీఎఫ్‌సీ 5.26 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 12.20 శాతం లాభపడింది. మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 8.32 శాతం, మణప్పురం ఫైనాన్స్‌ 6.86 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 6.64 శాతం, న్యూ ఇండియా అస్సూరెన్స్‌ కంపెనీ 6.53 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 2.28 శాతం ఎగబాకాయి.


logo