బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Mar 19, 2020 , 01:02:31

పట్టుబిగిస్తున్న బేర్‌

పట్టుబిగిస్తున్న బేర్‌

  • 29 వేల దిగువకు సెన్సెక్స్‌
  • 8,500 కిందికి పడిపోయిన నిఫ్టీ
  • సెన్సెక్స్‌  28,869.51, 1,709.58
  • నిఫ్టీ 8,468.80, 498.25

ముంబై, మార్చి 18: దేశీయ స్టాక్‌ మార్కెట్లో బేర్‌ పట్టుకొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కె ట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు వెనువెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. భారత్‌లో కరోనా వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మదుపరుల్లో ఆందోళనను మరింత పెంచింది. దేశీయ వృద్ధి అంచనాన్ని తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌అండ్‌ పీ ప్రకటించడం, టెలికం సంస్థల ఏజీఆర్‌ బకాయిలపై మళ్లీ సమీక్షించే అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేయడం పతనానికి ఆజ్యంపోసింది. 

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 29 వేల దిగువకు పడిపోగా, నిఫ్టీ కీలక స్థాయి 8,500 మార్క్‌ కిందకు పడిపోయింది. లాభాల్లో ప్రారంభమైన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ తీవ్ర ఊగిసలాటల మధ్య 2,488.72 పాయింట్ల శ్రేణిలో కదలాడి చివరకు 1,709.58 పాయింట్లు(5.59 శాతం) పతనం చెంది 28,869.51 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ కూడా 498.25 పాయింట్లు(5.56 శాతం) క్షీణించి 8,468.80కి చేరుకున్నది. 

మూడు రోజుల్లో 16 శాతం డౌన్‌

కరోనా వైరస్‌ భయాలు చుట్టుముట్టడంతో ఈవారం ప్రారంభం నుంచి  సెన్సెక్స్‌, నిఫ్టీలు 15 శాతానికి పైగా పతనం చెందాయి. గత మూడు సెషన్లలో నిఫ్టీ 1,548 పాయింట్లు(15.55 శాతం), సెన్సెక్స్‌ 5,234 పాయింట్లు(16 శాతం) చొప్పున నష్టపోయాయి. దీంతో మదుపరులు రూ.15.72 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. గత మూడు రోజుల్లో బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీలు రూ.15,72,913.52 కోట్లు కోల్పోయి రూ.1,13,53,329.30 కోట్లకు జారుకున్నది. కేవలం ఓఎన్‌జీసీ, ఐటీసీలు మాత్రమే లాభపడగా..మిగతా అన్ని సంస్థల షేర్లు కుదేలయ్యాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 24 శాతం పడిపోయి టాప్‌లూజర్‌గా నిలిచింది. పవర్‌గ్రిడ్‌, కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, మహీంద్రా, టైటన్‌, నెస్లె, ఏషియన్‌ పెయింట్స్‌, ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతి, బజాజ్‌ ఆటో, రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, టీసీఎస్‌, ఎస్బీఐలు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే బ్యాంకింగ్‌, టెలికం షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. 

టెలికం రంగ షేర్లకు సుప్రీం దెబ్బ

ఏజీఆర్‌ బకాయిలపై మళ్లీ సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేయడంతో ఈ రంగ షేర్లు కుదేలయ్యాయి. వొడాఫోన్‌ ఐడియా అయితే ఏకంగా 34.85 శాతం పడిపోయి రూ.3.16కి జారుకోగా, భారతీ ఎయిర్‌టెల్‌ 6.14 శాతం తగ్గి రూ.426.20కి పడిపోయాయి. బీఎస్‌ఈ టెలికం ఇండెక్స్‌ 9.48 శాతం పతనం చెందింది. 


logo
>>>>>>