బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jul 14, 2020 , 23:47:17

చుట్టుముట్టిన భయాలు

చుట్టుముట్టిన భయాలు

  • భారీగా పతనమైన స్టాక్‌ మార్కెట్లు 
  • సెన్సెక్స్‌ 660, నిఫ్టీ 190 పాయింట్ల పతనం

ముంబై, జూలై 14: స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లు అనూహ్యంగా పడిపోవడం, అమెరికా-చైనా దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం, మరోవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో గత ఐదు వారాల్లో ఒకేరోజు రెండు శాతం వరకు మార్కెట్‌ను కోల్పోవడం ఇదే తొలిసారి. ప్రారంభం నుంచే నష్టాల బాట పట్టిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. చివరకు 660.63 పాయింట్లు (1.80 శాతం) కోల్పోయి 36,033.06 వద్దకు పడిపోగా, నిఫ్టీ 195.35 పాయింట్లు(1.81 శాతం) నష్టపోయి 10,607.35 వద్ద ముగిసింది.  బ్యాంకింగ్‌ రంగ షేర్లు మూడు శాతం వరకు పతనమవగా, మెటల్‌, ఆటో రంగ షేర్లు రెండు శాతానికి పైగా కోల్పోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్బీఐల షేర్లు పతనమవగా, టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో లాభాల్లో ముగిశాయి. 

వాహన రంగ షేర్లు డమాల్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 80 శాతం వరకు పతనమైనట్లు సియామ్‌ విడుదల చేసిన నివేదిక ఈ రంగ షేర్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపింది. మారుతి సుజుకీ 3.69 శాతం, హీరో మోటో కార్ప్‌ 2.88 శాతం, టాటా మోటర్స్‌ 2.59 శాతం, మహీంద్రా 1.97 శాతం, టీవీఎస్‌ మోటార్‌ 1.81 శాతం, మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. 

మార్కెట్ల పతనానికి కారణాలు

  • కరోనా బాదితులు రోజురోజుకు పెరుగుతుండటంతో మదుపరుల్లో ఆందోళన పెంచింది. 
  • అంతర్జాతీయ మార్కెట్లు ఈ పతనానికి ఆజ్యం పోశాయి. 
  • కరోనా వైరస్‌తో ప్రపంచ, భారత వృద్ధిరేటు ప్రతికూలానికి పడిపోతున్నదన్న అంచనాలు పెట్టుబడిదారుల్లో ఆందోళనకు కారణమైంది. 
  • ఆర్థిక ఫలితాల్లో కార్పొరేట్లు విశ్లేషకుల అంచనాలకు చేరుకోకపోవడం కూడా కారణమైంది.


logo