శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Feb 01, 2020 , 00:46:49

ప్రారంభ లాభాలు ఆవిరి

ప్రారంభ లాభాలు ఆవిరి

ముంబై, జనవరి 31: స్టాక్‌ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థిక సర్వే మార్కెట్లను ముంచింది. పదేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధికి ఊతమివ్వడంతోపాటు ద్రవ్యలోటును కట్టడి చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకోవాలని సర్వే సూచించడం మదుపరుల్లో ఆందోళనను రేకెత్తించింది. ప్రారంభంలో భారీగా కొనుగోళ్లు జరిపిన పెట్టుబడిదారులు చివరకు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు నష్టాలు మూటగట్టుకున్నాయి. ఆర్థిక సర్వేతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై మదుపరులు దృష్టి సారించడంతో అమ్మకాలకు మొగ్గుచూపారు. మధ్యాహ్నం వరకు లాభాల్లో కళకళలాడిన దలాల్‌స్ట్రీట్‌..ఆ తర్వాత కొనుగోళ్లు జరుగడంతో 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ 190.33 పాయింట్లు పతనం చెంది 40,723.49 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 12 వేల మార్క్‌ దిగువకు పడిపోయింది. చివరకు 73.70 పాయింట్లు క్షీణించి 11,962.10 వద్ద స్థిరపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతంగా వృద్ధి అంచనా వేసిన ఆర్థిక సర్వే..వచ్చే ఏడాదిలో మాత్రం 6-6.5 శాతం మధ్యలోకి చేరుకోనున్నదని పేర్కొంది. మార్కెట్లో అత్యధికంగా 5.80 శాతం పతనమైన ఓఎన్‌జీసీ టాప్‌ లూజర్‌గా నిలిచింది. వీటితోపాటు పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు రెండు శాతానికి పైగా మార్కెట్‌ను కోల్పోగా.. సన్‌ఫార్మా, మారుతి, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యునిలీవర్‌, నెస్లె, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు నష్టపోయాయి. కానీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 3.87 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. వీటితోపాటు ఎస్బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటో, టైటాన్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, మహీంద్రాలు లాభాల్లో ముగిశాయి. 

నేడు పనిచేయనున్న మార్కెట్లు 

వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌ నేపథ్యంలో శనివారం స్టాక్‌ మార్కెట్లు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ సార్వత్రిక బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని మదుపరులు ముందస్తు జాగ్రత్తలో భాగంగా శుక్రవారం అమ్మకాలకు మొగ్గుచూపినట్లు విశ్లేషకులు వెల్లడించారు. మరోవైపు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 23 పైసలు పెరిగి 71.35 వద్ద ముగిసింది. 


logo