శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Jan 22, 2021 , 00:37:37

సెన్సెక్స్ 50 వేలు

సెన్సెక్స్ 50 వేలు

 • 1,96,89,176 కోట్లుప్రస్తుతం బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్‌ విలువ
 • తొలిసారి చారిత్రక స్థాయిని తాకిన సెన్సెక్స్‌
 • ఇంట్రాడేలో 50,184 పాయింట్లకు చేరిక
 • మదుపరులలో కనిపించిన జో బైడెన్‌ విశ్వాసం
 • లాభాల స్వీకరణతో ఆఖరుదాకా నిలువని ఆనందం

కొత్త ఏడాదిలో సెన్సెక్స్‌ సరికొత్త రికార్డును సృష్టించింది.2021పై భారీ అంచనాలకు తెరలేపుతూ తొలిసారిగా 50,000 మార్కును తాకింది. లాభాల జోరు మీదున్న బుల్‌.. రంకెలు వేస్తూ అర లక్ష మైలురాయిని అధిగమించగా, కరోనా భయాల మధ్య పెట్టుబడులకు కొత్త ఊపిరిలు అందాయి.

ముంబై, జనవరి 21: బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ గురువారం తొలిసారిగా 50వేల మార్కును దాటింది. మదుపరుల కొనుగోళ్ల జోరుతో ఉదయం ఆరంభంలోనే ఈ రికార్డు సొంతం కావడం విశేషం. దేశ, విదేశీ సానుకూల సంకేతాల నడుమ పెట్టుబడులకు ప్రాధాన్యం పెరుగడంతో సూచీ ఒక్కసారిగా ఎగిసింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్‌ 300 పాయింట్లకుపైగా ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా  50,184.01 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ పాలనలో అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కాగలదన్న విశ్వాసం అంతర్జాతీయ మార్కెట్లను పరుగులు పెట్టించింది. భారత్‌లోనూ ఈ ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. దీనికితోడు దేశ జీడీపీపై ఆశాభావం మార్కెట్లను లాభాల్లో నడిపించింది. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్ల మద్దతుతో మార్కెట్లు దౌడు తీశాయి. సెబీ నుంచి ఫ్యూచర్‌ డీల్‌కు ఆమోదముద్ర లభించడం రిలయన్స్‌ షేర్లకు కిక్కునిచ్చింది. ఇక నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 85 పాయింట్లకుపైగా పెరిగి 14,753.55 స్థాయిని తాకింది. 

ఇప్పటిదాకా సెన్సెక్స్‌ను అత్యధికంగా ప్రభావితం చేసిన టాప్‌-10 అంశాలు

 1. కరోనా వైరస్‌
 2. జీఎస్టీ
 3. పెద్ద నోట్ల రద్దు
 4. కేంద్రంలో ఎన్డీయే, యూపీఏజయాపజయాలు
 5. పీఎన్‌బీ, కామన్‌వెల్త్‌,   2జీ, సత్యం, హర్షద్‌ మెహతా కుంభకోణాలు
 6. బడ్జెట్లు, సంస్కరణలు
 7. ముంబై పేలుళ్లు
 8. రాజీవ్‌ గాంధీ హత్య, పార్లమెంట్‌పై ఉగ్రదాడి
 9. కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ విజయం
 10. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు

మహా పతనం

కరోనా వైరస్‌ కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో గతేడాది మార్చి 23న సెన్సెక్స్‌ మునుపెన్నడూ లేనివిధంగా 3,934.72 పాయింట్లు నష్టపోయింది

భారీ లాభం

నిరుడు ఏప్రిల్‌ 7న సెన్సెక్స్‌ రికార్డు స్థాయిలో ఒక్కరోజే 2,476.26 పాయింట్లు ఎగబాకింది. కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతున్నదన్న సంకేతాలే ఇందుకు ప్రధాన కారణం

కారణాలివే

 • అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు
 • బైడెన్‌ పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్న విశ్వాసం
 • కార్పొరేట్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై ఆశాభావం
 • రాబోయే బడ్జెట్‌పై అంచనాలు
 • విదేశీ మదుపరుల నుంచి పోటెత్తిన పెట్టుబడులు
 • ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీవోకు విశేష స్పందన

అంతిమంగా నష్టాలే

ఆరంభంలో అదరగొట్టిన స్టాక్‌ మార్కెట్లు.. ఆఖర్లో మాత్రం నిరాశపరిచాయి. సూచీలు రికార్డు లాభాల్లో కదలాడుతున్న వేళ.. మదుపరులు లాభాల స్వీకరణ వైపు మళ్లారు. దీంతో సెన్సెక్స్‌ 167.36 పాయింట్లు లేదా 0.34 శాతం దిగజారి 49,624.76 వద్దకు పడిపోయింది. నిఫ్టీ సైతం 54.35 పాయింట్లు లేదా 0.37 శాతం కోల్పోయి 14,590.35 వద్ద నిలిచింది. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఓఎన్జీసీ షేర్‌ విలువ అత్యధికంగా 4 శాతం వరకు నష్టపోయింది. ఎయిర్‌టెల్‌, ఎస్బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, సన్‌ ఫార్మా, ఐటీసీ షేర్లూ మదుపరుల ఆదరణను పొందలేకపోయాయి. ఇక ఆసియా మార్కెట్లలో చైనా, దక్షిణ కొరియా, జపాన్‌ లాభాల్లో ముగియగా, హాంకాంగ్‌ సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా నడుస్తున్నాయి. 

VIDEOS

logo