ఆదివారం 29 మార్చి 2020
Business - Feb 02, 2020 , 00:13:47

మార్కెట్‌ ఢమాల్‌

మార్కెట్‌ ఢమాల్‌
  • మదుపరులను మెప్పించని బడ్జెట్‌.. భీకర నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు
  • సెన్సెక్స్‌ 988 పాయింట్లు పతనం.. 300 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ
  • ఒక్కరోజే ఈ స్థాయిలో నష్టపోవడం గత పదేండ్లలో ఇదే తొలిసారి

ముంబై, ఫిబ్రవరి 1 : దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బడ్జెట్‌ బాంబు పేలింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. మదుపరులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. దీంతో సూచీలు కుప్పకూలాయి. కేంద్ర బడ్జెట్‌ రోజున స్టాక్‌ మార్కెట్లు ట్రేడ్‌ అవడం సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారమైనప్పటికీ అటు బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ), ఇటు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)లలో ట్రేడింగ్‌ జరిగింది. అయితే ఉదయం ఆరంభమే నష్టాలతో మొదలైన సూచీలు.. చివరిదాకా అదే దారిలో పయనించాయి. 


ఆర్థిక క్రమశిక్షణ, వృద్ధిదాయక చర్యలను ఆశించిన మదుపరులకు భంగపాటే ఎదురైంది. దీంతో సమయం గడుస్తున్నకొద్దీ నష్టాలు తీవ్రరూపం దాల్చాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 987.96 పాయింట్లు లేదా 2.43 శాతం దిగజారి 40 వేల మార్కుకు దిగువన 39,735.53 వద్ద ముగిసింది. గడిచిన దశాబ్దానికిపైగా కాలంలో ఒక్కరోజే సెన్సెక్స్‌ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. చివరిసారిగా అక్టోబర్‌ 24, 2008న 1,070.63 పాయింట్లు పడిపోయింది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే. అదీ బడ్జెట్‌ రోజున కావడం గమనార్హం. ఇక ఒకానొక దశలో సెన్సెక్స్‌ దాదాపు 1,275 పాయింట్లు నష్టపోవడం బడ్జెట్‌పట్ల మదుపరుల్లో ఉన్న అసంతృప్తికి అద్దం పడుతున్నది. నిఫ్టీ కూడా 300.25 పాయింట్లు లేదా 2.51 శాతం కోల్పోయి 11,661.85 వద్ద నిలిచింది. 


నిజానికి నిరుడు బడ్జెట్‌ రోజున మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. జూలై, 2019న సెన్సెక్స్‌ 222.14 పాయింట్లు, నిఫ్టీ 149.30 పాయింట్లు పుంజుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను జీడీపీలో ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాన్ని 3.3 శాతం నుంచి 3.8 శాతానికి పెంచడంతో మార్కెట్‌ పతనం మొదలైంది. ఆ తర్వాత నిర్మలా సీతారామన్‌ ప్రకటనలన్నీ మార్కెట్‌ అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో క్రమేణా మదుపరులు విపరీతమైన అమ్మకాల ఒత్తిడిలోకి జారుకున్నారు. ఆదాయం పన్ను (ఐటీ) కోతలు కొంత అయోమయానికి గురిచేసినా.. డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ) ఎత్తివేత నిర్ణయం సైతం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరుచలేకపోయింది. కార్పొరేట్‌ బాండ్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులకున్న (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరిమితిని 9 శాతం నుంచి 15 శాతానికి పెంచుతామన్న నిర్ణయం కూడా మదుపరులను ఆకట్టుకోలేకపోయింది. కాగా, రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌, ఇండస్ట్రియల్స్‌, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, మెటల్‌ రంగాల షేర్లు 7.82 శాతం మేర నష్టపోగా, ఐటీ, టెక్నాలజీ రంగాల షేర్లు 1.41 శాతం మేర లాభపడ్డాయి. 


పొగాకు షేర్లకు బడ్జెట్‌ సెగ

పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం పెంపుతో సిగరెట్‌ తయారీ సంస్థల షేర్లు భారీ నష్టాలకు లోనైయ్యాయి. ఐటీసీ షేర్‌ విలువ అత్యధికంగా పడిపోయింది. బీఎస్‌ఈలో 6.97 శాతం పతనమై రూ.218.85 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 8.31 శాతం క్షీణించి 52 వారాల కనిష్ఠాన్ని తాకుతూ రూ.215.70 స్థాయిని చేరింది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా 6.82 శాతం, వీఎస్టీ ఇండస్ట్రీస్‌ 5.40 శాతం, గోల్డెన్‌ టొబాకో 0.18 శాతం చొప్పున నష్టపోయాయి. ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీ ఐ, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 5.98 శాతం మేర నష్టపోయాయి. అయితే ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ విలువ 10 శాతానికిపైగా పెరిగింది. బ్యాంక్‌లోని మిగతా వాటానూ ప్రభుత్వం అమ్మనుందన్న బడ్జెట్‌ ప్రకటన మదుపరులను మెప్పించింది. దీంతో బీఎస్‌ఈలో 10.03 శాతం పుంజుకుని రూ.37.30 వద్ద ము గిస్తే.. ఎన్‌ఎస్‌ఈలో 10.20 శాతం ఎగబాకి రూ.37.25 వద్ద నిలిచింది. టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లూ లాభపడ్డాయి.


రూ.3.46 లక్షల కోట్లు ఆవిరి


స్టాక్‌ మార్కెట్లకు బడ్జెట్‌ మింగుడుపడకపోవడంతో ఏరులైపారిన నష్టాలు.. లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపదను ఆవిరి చేశాయి. శనివారం ఒక్కరోజే బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్‌ విలువ రూ.3.46 లక్షల కోట్లు కరిగిపోయింది. బీఎస్‌ఈ ప్రధాన సూచీ 988 పాయింట్లు పతనమైన నేపథ్యంలో రూ.3,46,256.76 కోట్ల మదుపరుల సంపద చేజారిపోయింది. ప్రస్తుతం బీఎస్‌ఈ సంస్థల మార్కెట్‌ విలువ రూ.1,53,04,724.97 కోట్లుగా ఉన్నది. నిర్మలమ్మ పద్దులో వృద్ధిదాయక చర్యలు ఆశించిన స్థాయిలో లేకపోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ ప్రధాన ఆర్థికవేత్త ఆనంద్‌ రాఠీ అన్నారు. కాగా, డీడీటీ రద్దు, పన్ను కోతలు మార్కెట్లకు ఊతమిచ్చేవేనని, నెమ్మదిగా మదుపరులు అర్థం చేసుకుంటారన్న అభిప్రాయాన్ని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎండీ మోతీలాల్‌ ఓస్వాల్‌ వ్యక్తం చేశారు. బీఎస్‌ఈలో 1,724 షేర్లు నష్టపోగా, 611 షేర్లు లాభపడ్డాయి. 126 షేర్ల విలువ యథాతథంగా ఉన్నది.


బీమా షేర్లకు దెబ్బ

ఐటీ శ్లాబుల్లో మార్పులు, కొత్త ఐటీ విధానంతో బీమా షేర్లు ప్రభావితమైయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బీమా సంస్థల షేర్లు గరిష్ఠంగా 13 శాతం నష్టాలను చవిచూశాయి. బీఎస్‌ఈలో మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 12.78 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 10.93 శాతం, ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 10.02 శాతం, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ 7.16 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 6.06 శాతం చొప్పున నష్టపోయాయి. కొత్త ఐటీ శ్లాబులు, రేట్లను పన్ను చెల్లింపుదారులు ఎంచుకుంటే రూ.50 వేల స్టాండర్డ్‌ డిడక్షన్‌, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, బీమా ప్రీమియం, ప్రావిడెంట్‌ ఫండ్‌లపై పన్ను మినహాయింపులను కోల్పోవాల్సి వస్తున్నది. దీంతో ఈ నిర్ణయం మదుపరులను నిరాశపరుచగా, బీమా షేర్లను దెబ్బతీసింది.


37,000 కోట్లు


ప్రభుత్వరంగ టెలికం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లలోకి రూ.37,640 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులను 4జీ స్పెక్ట్రం, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలు చేయడంలో భాగంగా ఈ నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపింది. వీటిలో 4జీ స్పెక్ట్రం కోసం

బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.14,115 కోట్లు కేటాయించనుండగా,ఎంటీఎన్‌ఎల్‌కు రూ.6,295 కోట్ల నిధులను వెచ్చించనున్నది.


పన్ను బకాయిలు మార్చి 31 వరకు చెల్లించవచ్చు..

పన్ను బకాయిలు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. మార్చి 31లోగా పన్ను  బకాయిలు చెల్లించిన వారికి వడ్డీ, జరిమానాలను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు ప్రకటించింది. బకాయిలకు సంబంధించి పేరుకుపోయిన 4.83 లక్షల ప్రత్యక్ష పన్ను వసూళ్లకు సంబంధించి వ్యాజ్యాలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నది కేంద్రం. ఇందుకోసం ‘వివాద్‌ సే విశ్వాస్‌' పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఆదాయం పనున అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌(ఐటీఏటీ), హైకోర్టు, సుప్రీంకోర్టుల వద్ద 4.83 లక్షల పన్నులకు సంబంధించి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జూన్‌ 30 వరకు అమలులో ఉండనున్న ఈ పథకం కింద మార్చి 31లోగా చెల్లించిన వారికి వడ్డీ, జరిమానాలను  ఎత్తివేసిన కేంద్రం..ఆ తర్వాత అదనంగా చెల్లింపులు జరుపాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన సబ్కా విశ్వాస్‌ స్కీంతో 1.89 లక్షల పన్ను వ్యాజ్యాలను పరిష్కరించినట్లు, వీటిద్వారా రూ.39 వేల కోట్లు పన్ను వసూలైనట్లు చెప్పారు.


284 బిలియన్‌ డాలర్లు

విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్‌ దూసుకుపోతున్నది. గడిచిన ఐదేండ్లకాలంలో భారత్‌లోకి 284 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో వెల్లడించారు. 


15 శాతానికి పెంపు

కార్పొరేట్‌ బాండ్లపై విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పరిమితిని పెంచేయోచనలో కేంద్రం ఉన్నది. ప్రస్తుతం ఈ బాండ్లపై 9 శాతం పరిమితి ఉండగా, దీనిని 15 శాతానికి పెంచాలనుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నది.  


4,375 కోట్లు

కేంద్ర సమాచార, ప్రసార శాఖకు బడ్జెట్‌లో రూ.4,375 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ.310 కోట్లు అధికం. ప్రసారభారతికి కేటాయింపులు 2019-20 సవరించిన అంచనాల మాదిరిగానే రూ.2,889.36 కోట్లనే కొనసాగించారు. సమాచారం, పబ్లిసిటీకి రూ.967.29 కోట్లు కేటాయించారు. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీటీఐ)కి రూ.49.4 కోట్లు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యునికేషన్‌కు రూ.61.30 కోట్లు కేటాయించారు.


ద్రవ్యలోటు 3.3 % కాదు.. 3.8%

జీడీపీలో ద్రవ్యలోటు అంచనాలు మరోసారి పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) దేశ వృద్ధిరేటులో ద్రవ్యలోటును 3.3 శాతానికి కట్టడి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక మందగమన పరిస్థితులు, పన్ను వసూళ్ల క్షీణత మధ్య ఇది అసాధ్యంగా పరిణమించింది. ఈ క్రమంలోనే తాజా బడ్జెట్‌లో ఈ లక్ష్యాన్ని 3.8 శాతానికి సవరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. పడిపోయిన ప్రభుత్వ రాబడుల దృష్ట్యా ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాలను 0.5 శాతం పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాన్ని 3.5 శాతంగా పేర్కొన్నారు. 


డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌కు గుడ్‌బై

ఆర్థిక మందగమనం, మార్కెట్‌ స్తబ్ధత మధ్య కంపెనీల మొరను కేంద్రం ఆలకించింది. డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ)ను రద్దు చేస్తామని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనలు చేసిన మంత్రి.. ఈ నిర్ణయం వల్ల ఖజానాకు రూ.25 వేల కోట్ల వార్షిక ఆదాయం దూరం కానుందని తెలిపారు. ప్రస్తుతం తమ వాటాదారులకు చెల్లిస్తున్న డివిడెండ్‌పై 15 శాతం డీడీటీని కంపెనీలు చెల్లించాల్సి వస్తున్నది. దీనికి సర్‌చార్జీ, సెస్సు అదనం. లాభాలపై ఆయా సంస్థలు చెల్లిస్తున్న పన్నులు కాకుండా ఈ డీడీటీ, సర్‌చార్జీ, సెస్సు.. డివిడెండ్ల కోసం ప్రత్యేకంగా సర్కారుకు కంపెనీలు ఇవ్వాల్సి వస్తున్నది. అయితే డివిడెండ్‌ అందుకున్న భాగస్వాములపై వారికి వర్తించే శ్రేణిలో డీడీటీని వేస్తామన్నారు. స్టార్టప్‌ల కోసం పన్ను చెల్లింపులను సులభతరం చేస్తామని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.


విత్‌ హోల్డింగ్‌ ట్యాక్స్‌ తగ్గింపు 

విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు విత్‌ హోల్డింగ్‌ ట్యాక్స్‌ను ఒక శాతం తగ్గిస్తున్నట్టు ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు. అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాల (ఐఎఫ్‌ఎస్‌సీ) వద్ద బాండ్ల లిస్టింగ్‌ను పెంచేందుకు ప్రస్తుతం ఐదు శాతంగా ఉన్న పన్నును నాలుగు శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు.  మరోవైపు దేశ స్వేచ్ఛా వాణిజ్య విధానంపై (ఎఫ్‌టీఏ) సమీక్షిస్తామని నిర్మల పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలు వంటి ఉత్పత్తుల విషయంలో ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలను, అందులోని నిబంధనలను సడలిస్తామని నిర్మల పేర్కొన్నారు.


వైమానికరంగానికి రూ.3,797 కోట్లు 

వైమానిక రంగానికి 2020-21 బడ్జెట్‌లో రూ3,797 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది బడ్జెట్‌తో పోల్చితే 2.62 శాతం అధికం. 2019-20 బడ్జెట్‌లో వైమానిక రంగానికి రూ.3,700 కోట్లు కేటాయించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణించేందుకు రెండు ‘బీ777’ విమానాలను కొనుగోలు చేసేందుకు రూ.810 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో (రూ.272 కోట్లు) పోల్చితే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ప్రస్తుతం వీరు ఎయిర్‌ ఇండియాకు చెందిన బీ747 విమానాలను వినియోగిస్తున్నారు. వీటినే ‘ఎయిర్‌ ఇండియా వన్‌'గా పిలుస్తున్నారు. దీంతోపాటు ఉడాన్‌ కింద ద్వితీయ శ్రేణి నగరాలకు వైమానిక సేవలను అందించేందుకు బడ్జెట్‌లో రూ.465 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాదితో పోల్చితే 3.1 శాతం అదనం. ఎయిర్‌ఇండియా నుంచి వందశాతం ప్రభుత్వ వాటాను వెనక్కి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 


జీఎస్టీ మరింత సరళం

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను మరింత సరళతరం చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. సరళీకరించిన జీఎస్టీ రిటర్నుల విధానం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానున్నది. ఈ మేరకు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పన్ను వసూళ్లను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు వస్తున్నాయి. కాగా, జీఎస్టీ అమలుతో వినియోగదారులకు లక్ష కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరిందని, ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌ విధానం పోయిందని, రవాణా రంగానికీ మేలు జరిగిందని చెప్పారు. జీఎస్టీ రాకతో గృహస్తుడి నెలసరి సగటు వ్యయం 4 శాతం తగ్గిందన్నారు. తమ ఈ బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని తెలిపారు. జనవరిలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయల మార్కును దాటగా, రూ.1.1 లక్షల కోట్లుగా నమోదైయ్యాయి. 2017 జూలైలో దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన దగ్గర్నుంచి ఈ స్థాయిలో వసూళ్లు జరుగడం ఇది రెండోసారి.


ఎంఎస్‌ఎంఈలకు ఊతం

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల వృద్ధికి ఊతమిచ్చే నిర్ణయాలను బడ్జెట్‌లో ప్రకటించింది కేంద్రం. ఎంఎస్‌ఎంఈల ఖాతాల ఆడిటింగ్‌ కోసం నిర్దేశించిన టర్నోవర్‌ పరిమితిని రూ.5 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అలాగే ఎంఎస్‌ఎంఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇతోధిక రుణాలను కల్పించాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం కోటి రూపాయలకు మించి వార్షిక టర్నోవర్‌ ఉన్న సంస్థలు.. అకౌంటెంట్లచే తమ ఖాతాలను ఆడిటింగ్‌ చేయాల్సి ఉన్నది. ఇది చిన్న రిటైలర్లు, ట్రేడర్లు, దుకాణదారులకు భారంగా పరిణమిస్తున్నది. దీంతో ఈ పరిమితిని రూ.5 కోట్లకు పెంచుతున్నట్లు తన బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి వెల్లడించారు. అంతేగాక ఎంఎస్‌ఎంఈల రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి 31దాకా పొడిగించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)ను కోరారు.


ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

ప్రస్తుతం ప్రపంచంలో భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2014 మార్చిలో దేశ జీడీపీలో 52.2 శాతంగా ఉన్న ప్రభుత్వ రుణ భారం.. ఇప్పుడు 48.7 శాతానికి తగ్గిందని చెప్పారు. 2014-19లో దేశ వృద్ధిరేటు 7.4 శాతాన్ని అధిగమించిందని వివరించారు. ద్రవ్యోల్బణ సగటు 4.5 శాతంగా ఉందని స్పష్టం చేశారు. చౌక గృహాలు, నగదు బదిలీ, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచాయన్నారు. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం నుంచి బయటపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని మంత్రి చెప్పారు. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను నామినల్‌ జీడీపీని 10 శాతంగా అంచనా వేశారు. ఆదాయం రూ.22.46 లక్షల కోట్లుగా, వ్యయం రూ.30.42 లక్షల కోట్లుగా ఉండొచ్చన్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధరల్లో జీడీపీ గణనే ఈ నామినల్‌ జీడీపీ. ప్రస్తుతం త్రైమాసిక, వార్షిక జీడీపీ గణాంకాలను 2011-12 ఆర్థిక సంవత్సరం ధరల ఆధారంగా లెక్కిస్తున్న విషయం తెలిసిందే. గతంలో 2004-05 ధరల ప్రకారం జీడీపీ గణన జరిగేది. 


టెలికం రంగంపై ఆశలు

అప్పులు పెరిగి.. ఆదాయం తరిగి.. జరిమానాల భారంతో సతమతమవుతున్న దేశీయ టెలికం రంగం.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) కోలుకుంటుందన్న ఆశాభావాన్ని కేంద్రం ఈ బడ్జెట్‌లో వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే 2020-21లో టెలికం రంగం ఆదాయాన్ని రూ.1.33 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో టెలికం రంగ ఆదాయం రూ.50,519.8 కోట్లుగా ఉండొచ్చని గత బడ్జెట్‌లో అంచనా వేశారు. అయితే రూ.58,686.64 కోట్లకు చేరవచ్చన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.1,33,027.2 కోట్ల ఆదాయాన్ని టెలికం సంస్థలు అందుకోవచ్చని తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. 


డిపాజిట్లపై 5 లక్షల బీమా

చిన్న స్థాయి డిపాజిట్‌దారుల ఆందోళనలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న లక్ష రూపాయల  బీమా కవరేజ్‌ను రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగా ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ముంబైకి చెందిన పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర సహాకార బ్యాంక్‌ మూతపడటంతో డిపాజిటర్ల తమ నగదు ఉపసంహరణపై పరిమితులు విధించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నయని, డిపాజిట్‌ దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్మలా సీతారామన్‌ భరోసానిచ్చారు. 


బడ్జెట్‌కీ బాత్‌

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే బడ్జెట్‌ ఇది. హెల్త్‌కేర్‌ రంగానికి భారీగా నిధులు కేటాయించడం సంతోషదాయకం. ద్వి, తృతీయ నగరాల్లో సైతం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అదనపు ఆసుపత్రులను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. సులభతర వాణిజ్యం, నియంత్రణ సరళతరం, విధాన స్థిరత్వంతో ఫార్మా రంగం వృద్ధి బాట పట్టనున్నది 

-సతీష్‌ రెడ్డి, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌ చైర్మన్‌


వ్యక్తిగతంగా, పారిశ్రామికంగా మరింత బలోపేతం అవడానికి ఈ బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది ద్రవ్యలోటును 3.8 శాతం కట్టడి చేయనుండగా, వచ్చే ఏడాది 3.5 శాతం లక్ష్యంగా పెట్టుకున్నారు. 

- సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్‌


హెల్త్‌కేర్‌ రంగానికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించడం శుభసూచికం. ఆయుష్మాన్‌ భారత్‌ను ద్వి, తృతీయ నగరాలకు విస్తరించడంతో సామాన్యులకు సైతం నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి వీలు పడనున్నది

- భాస్కర్‌ రావు, కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఎండీ


గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం దిశగా బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాల దిగుమతులపై సుంకాన్ని మరింత పెంచింది. ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ సెల్‌, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ను ఎత్తివేయడం వంటి కీలక నిర్ణయాలు పెట్టుబడులకు ఊతమివ్వనున్నాయి. 

- డీ రాజు, సీఐఐ తెలంగాణ చైర్మన్‌


logo