బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Mar 10, 2020 , 09:36:38

మార్కెట్లో ఉత్పాతం

మార్కెట్లో ఉత్పాతం
  • సౌదీ, రష్యా మధ్య ధరల యుద్ధం..7లక్షల కోట్లు ఆవిరి
  • మార్కెట్‌ ఉసురు తీసిన మదుపరుల భయాలు
  • కరోనా, క్రూడ్‌ ధరల పతనంతో చారిత్రక నష్టాలు.. ఆర్థిక మాంద్యం అంచనాలతోనూ అమ్మకాల ఒత్తిడి
  • సెన్సెక్స్‌ 1,942 పాయింట్ల క్షీణత.. నిఫ్టీ సైతం 538 పాయింట్లు డౌన్‌.. నెల రోజుల్లో 5వేల పాయింట్లు మటాష్‌

ముంబై, మార్చి 9: కరోనా వైరస్‌తో వణికిపోతున్న స్టాక్‌ మార్కెట్లను.. సౌదీ అరేబియా చమురు ధరల యుద్ధం చావుదెబ్బ తీసింది. అంతర్జాతీయ విపణిలో ఒక్కసారిగా పడిపోయిన క్రూడ్‌ ధరలు.. సోమవారం భారత్‌సహా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను కుప్పకూల్చాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు మదుపరులను వెంటాడటంతో దేశీయ మార్కెట్లు మునుపెన్నడూ లేని నష్టాలను చవిచూశాయి. ఉదయం ప్రారంభం నుంచే భారీ నష్టాలు మొదలైయ్యాయి. సమయం గడుస్తున్నకొద్దీ నష్టాల తీవ్రత అంతకంతకూ పెరుగుతూపోగా.. మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 1,941.67 పాయింట్లు లేదా 5.17 శాతం దిగజారి 35,634.95 వద్దకు చేరింది. దాదాపు 13 నెలల్లో ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ సైతం 538 పాయింట్లు లేదా 4.90 శాతం పతనమై 10,451.45 స్థాయికి దిగింది. 


ఒకానొక దశలో సెన్సెక్స్‌ 2,460 పాయింట్లు, నిఫ్టీ 695 పాయింట్లు పడిపోయాయి. ఇంట్రా-డేలో ఈ విధంగా నష్టపోవడం ఇదే ప్రథమం. ఫిబ్రవరి 1 నుంచి గమనిస్తే.. సెన్సెక్స్‌ 5,088.54 పాయింట్లు, నిఫ్టీ 1,510.65 పాయింట్లు పతనమైయ్యాయి. కాగా, గ్లోబల్‌ క్రూడ్‌ మార్కెట్‌ పరిణామాలతో చమురు రంగ షేర్లు పెద్ద ఎత్తున నష్టపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ అత్యధికంగా 16 శాతానికిపైగా క్షీణించగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేర్‌ విలువ 12 శాతానికిపైగా పతనమైంది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, టీసీఎస్‌, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో షేర్లూ మదుపరులను ఆకట్టుకోలేక చతికిలపడ్డాయి. యెస్‌ బ్యాంక్‌లో 49 శాతం వాటా కొంటామన్న ఎస్బీఐ షేర్‌ విలువ 6 శాతానికిపైగా హరించుకుపోయింది. మరోవైపు ఈ ప్రకటన యెస్‌ బ్యాంక్‌కు కలిసొచ్చింది. రంగాలవారీగా చూస్తే.. అత్యధికంగా ఇంధన రంగ షేర్ల విలువ 9.74 శాతం కోల్పోయింది. మెటల్‌, ఐటీ, చమురు, గ్యాస్‌, టెక్నాలజీ, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల షేర్లూ దిగజారాయి. బీఎస్‌ఈ మిడ్‌-క్యాప్‌, స్మాల్‌-క్యాప్‌ సూచీలు 4.73 శాతం మేర నష్టపోయాయి.


చరిత్రలో సెన్సెక్స్‌ భారీ పతనాలుబ్యాంక్‌ నిఫ్టీ 1,338 పాయింట్లు తగ్గి 26,462వద్దకు జారుకున్నాయి.   

మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ గత రెండేండ్లలో అతిపెద్ద పతనాన్ని మూటగట్టుకున్నది. 673 పాయింట్లు క్షీణించి 13,554 వద్ద స్థిరపడింది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర 14 శాతం పతనంతో తన మొదటి ర్యాంక్‌ కోల్పోయింది.

దీంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో టీసీఎస్‌ తొలిస్థానంలో నిలిచింది.

ఆర్‌ఐఎల్‌ విలువ రూ.7 లక్షల కోట్లకు, టీసీఎస్‌ విలువ రూ.7.31 లక్షల కోట్లకు చేరుకున్నది. 

బీఎస్‌ఈ బ్యాంకెక్స్‌ 1,604 పాయింట్లు(5.01 శాతం) క్షీణించి 30,384లకు పడిపోయింది. 

స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 559 పాయింట్లు కోల్పోయి 12,770 వద్ద పరిమితమైంది.

గత నెల రోజుల్లో సెన్సెక్స్‌ 5 వేల పాయింట్లు లేదా 12.13 శాతం పతనం చెందింది. నిఫ్టీ 1,512 పాయింట్లు లేదా 12.51 శాతం క్షీణించింది. కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నదన్న అంచనాలు మార్కెట్లలో అలజడి సృష్టించాయి. 

2,199 స్టాకులు పడిపోగా, 357 స్టాకులు లాభల్లో ముగిశాయి. కానీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఇండియన్‌ ఆయిల్‌ షేర్లు 13 శాతం వరకు లాభపడటం విశేషం.

సోమవారం ఆల్‌టైమ్‌ ఇంట్రా-డే నష్టాలుసెన్సెక్స్‌2,467 పాయింట్లు నిఫ్టీ 695 

పాయింట్లు ఒక్కరోజే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ)లు ఏకంగా 6,595.56 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. 

బ్యారెల్‌ ముడి చమురు ధర డాలర్‌ తగ్గితే  భారత్‌కు రూ. 3వేల కోట్ల మేర లాభం


ప్రపంచ మార్కెట్‌ విలవిల

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ సోమవారం నేలచూపులే చూశాయి. ఆసియా, ఐరోపా, అమెరికా ఇలా ఏ ఖండం, ఏ దేశ మార్కైట్లెనా నష్టాలకే పరిమితమైయ్యాయి. చైనా, హాంకాంగ్‌, దక్షిణ కొరియా, జపాన్‌ సూచీలు 5 శాతం వరకు నష్టపోగా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ సూచీలు 9 శాతం వరకు పడిపోయాయి. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ సైతం వణికిపోయింది. ప్రారంభంలోనే 1,400 పాయింట్లు పతనమై డౌజోన్స్‌ 24,463.37 వద్దకు, నాస్‌డాక్‌ 5.2 శాతం క్షీణించి 8,133.67 వద్దకు దిగజారాయి.


ఆగిన అమెరికా మార్కెట్‌

కరోనా వైరస్‌, చమురు ధరల పతనం మధ్య సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలకు లోనైయ్యాయి. భీకర అమ్మకాల ఒత్తిడిలో ఉన్న మదుపరులను శాంతింపజేయడానికి ట్రేడింగ్‌ను 15 నిమిషాలపాటు నిలిపివేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. 


రూపాయే...!17 నెలల కనిష్ఠానికి మారకం

స్టాక్‌ మార్కెట్లతోపాటు దేశీయ కరెన్సీ విలువ కూడా భారీగా పతనం చెందింది. కరోనా వైరస్‌ దెబ్బకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలనుండటంతో అటు ఈక్విటీలు, మరోవైపు ఫారెక్స్‌ మార్కెట్లు పాతాళం వైపు పడిపోయాయి. ఎన్నడు లేనంత స్థాయిలో రూపాయి బక్కచిక్కింది. డాలర్‌ను కొనుగోలు చేయడానికి బ్యాంకర్లు, ఎగుమతిదారులు ఎగబడటంతో రూపాయి మారకం విలువ 17 నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. సోమవారం ఫారెక్స్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 30 పైసలు తగ్గి 74.17 స్థాయికి జారుకున్నది. 73.99 వద్ద ప్రారంభమైన కరెన్సీ విలువ ఒక దశలో 73.85 గరిష్ఠ స్థాయిని తాకింది. మార్కెట్ల నిరాశాజనక పనితీరుతో సెంటిమెంట్‌ బలహీనపడింది. ఫలితంగా చివరకు 30 పైసలు కోల్పోయి 74.17 వద్ద ముగిసింది.  కరోనా వైరస్‌ నేపథ్యంలో క్రమేణా క్షీణిస్తున్న ముడి చమురు ధరలను నియంత్రించేందుకు ఉత్పత్తిని మరింత తగ్గించాలన్న ప్రతిపాదనపై ఒపెక్‌, దాని భాగస్వామ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సౌదీ అరేబియా ధరల యుద్ధానికి తెరతీయడంతో గ్లోబల్‌ మార్కెట్లో ఇంధన ధరలు కుదేలయ్యాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లతోపాటు  కరెన్సీలు నేలచూపులు చేశాయి. డాలర్‌తోపాటు పౌండ్‌, యూరో విలువ భారీగా పడిపోయింది.  


147 డాలర్ల నుంచి.. 

ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన క్రూడాయిల్‌ ధరలు అంతే వేగంతో కిందకు పడిపోయాయి. 2008లో 147 డాలర్ల రికార్డు స్థాయి పలికిన బ్యారెల్‌ క్రూడాయిల్‌..ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ తొలిసారి అధికారంలోకి వచ్చిన ఏడాది 2014లో 100 డాలర్లకు పడిపోయింది. ఆ తర్వాతి రెండేండ్లలో 27 డాలర్లకు పడిపోయినప్పటికీ సామాన్యుడికి ఊరటనిచ్చింది మాత్రం స్వల్పమే.   అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా తగ్గుతున్నప్పటికీ ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు చేరవేయడం లేదు. ఇంధన ధరలు భారీగా తగ్గడంతో ద్రవ్యలోటును కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి లైన్‌ క్లియర్‌ అవుతున్నది. గడిచిన కొన్ని నెలలుగా జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం పడటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్రానికి చమురు ధరల రూపంలో భారీ ఊరట లభించినట్లు అయింది. 2020-21లో దేశ జీడీపీలో ద్రవ్యలోటును 3.5 శాతానికి కట్టడి చేస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పునరుద్ఘాటించారు. 


చమురు వదిలింది

రష్యా-సౌదీ అరేబియా మధ్య రాజుకున్న ధరల యుద్ధం

31 డాలర్ల దరిదాపుల్లోకి బ్యారెల్‌ క్రూడ్‌

గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఇదే అత్యంత పతనం

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. సోమవారం ఏకంగా 20 శాతానికిపైగా పడిపోయాయి. ప్రపంచ ప్రామాణిక బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర ఈ ఒక్కరోజే బ్యారెల్‌కు 9.74 డాలర్లు లేదా 21 శాతం దిగజారింది. 35.52 డాలర్ల వద్ద ట్రేడైంది. ఒకానొక దశలో ధరలు 30 శాతానికిపైగా పడిపోయి బ్యారెల్‌ 31.02 డాలర్లే పలికింది. గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో ధరల క్షీణత ఇదే కావడం గమనార్హం. అటు అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ (డబ్ల్యూటీఐ) క్రూడ్‌ బ్యారెల్‌ విలువ సైతం 32.13 డాలర్లకు పరిమితమైంది. ఒక్కరోజే 9.15 డాలర్లు లేదా 22 శాతం తగ్గింది. 1991 జనవరి తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ట్రేడింగ్‌లో 27.34 డాలర్ల కనిష్ఠాన్నీ తాకింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో క్రమేణా క్షీణిస్తున్న ముడి చమురు ధరలను నియంత్రించేందుకు ఉత్పత్తిని మరింత తగ్గించాలన్న ప్రతిపాదనపై ఒపెక్‌, దాని భాగస్వామ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సౌదీ అరేబియా ధరల యుద్ధానికి తెరతీసింది. ఏప్రిల్‌కుగాను విక్రయించే బ్యారెల్‌ చమురు ధరలపై 6-8 డాలర్ల రాయితీలను సౌదీ ఇటీవల ప్రకటించింది. ఇందుకు తగ్గట్లే ఉత్పత్తినీ పెంచాలని తీర్మానించింది. ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది.


భారత్‌కు ఆయిల్‌ బొనాంజా?

గత 20 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా చమురు ధరలను భారీగా తగ్గిస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకోవడం.. భారత్‌, చైనాలకు కలిసిరానున్నది. దేశీయ చమురు అవసరాలు దాదాపు 84 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో ఐదోవంతు సౌదీ అరేబియా నుంచే భారత్‌కు వస్తున్నాయి. ఆర్థిక మాంద్యం, వాణిజ్య లోటును ఎదుర్కొంటున్న భారత్‌కు ఆయిల్‌ ధరలు దిగిరావడం ఊరటనిచ్చే అంశం. దీనివల్ల విదేశీ మారక నిల్వలు ఆదా కావడంతోపాటు చమురు అవసరాలు కూడా తీరుతాయి. అలాగే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి. వినియోగదారుల ఖర్చులు పెరుగడం, తద్వారా ఎక్సైజ్‌ సుంకం రూపేణా ప్రభుత్వ ఆదాయమూ అధికమవనున్నది. కొటక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో ఉదయ్‌ కొటక్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘అల్లర్లు, వైరస్‌ పరిణామాల నడుమ ఒక శుభవార్త. ఆయిల్‌ ధరలు తగ్గడం ద్వారా భారత్‌కు ఏడాదికి 30 బిలియన్‌ డాలర్లు మిగులుతుంది’ అని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వృద్ధి పుంజుకోవడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. 


7లక్షల కోట్లు ఆవిరి

స్టాక్‌ మార్కెట్లలో చోటుచేసుకున్న భారీ నష్టాలు లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపదను ఆవిరి చేశాయి. సోమవారం ఒక్కరోజే దాదాపు రూ.7 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద కరిగిపోయింది. మదుపరులను చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం భయాలు.. సూచీల ఊపిరిని తీసేశాయి. ముఖ్యంగా సెన్సెక్స్‌ మునుపెన్నడూ లేనివిధంగా 1,941.67 పాయింట్లు నష్టపోవడంతో బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ రూ.6,84,277.65 కోట్లు తరిగిపోయింది. ఫలితంగా స్థూల విలువ రూ.1,37,46,946.76 కోట్లకు దిగజారింది. శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్‌ విలువ రూ.1,44,31,224.41 కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, సోమవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 2,199 షేర్లు నష్టపోగా, 357 షేర్లు పెరిగాయి. 169 షేర్లు మాత్రం యథాతథంగా ఉన్నాయి.


ఎందుకీ పతనం

స్టాక్‌ మార్కెట్ల భీకర నష్టాలకు ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ల పంచ ప్రాణాలను హరించి, మదుపరుల ఆశల్ని ఆవిరి చేసిన అవేమిటంటే..


ముడి చమురు ధరలు

ముడి చమురు ధరల్ని తగ్గించాలని, ఉత్పత్తిని పెంచాలని సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ క్రూడ్‌ మార్కెట్‌ను షేక్‌ చేసింది. 30 శాతానికిపైగా ధరలు పడిపోయాయి. గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఒక్కరోజే ఈ స్థాయిలో ముడి చమురు ధర క్షీణించడం ఇదే తొలిసారి. ఒపెక్‌ సభ్య దేశాలతో చర్చలు విఫలమైన నేపథ్యంలో సౌదీ ఈ నిర్ణయానికి రాగా.. చమురు రంగ షేర్లు కుప్పకూలాయి.


కరోనా వైరస్‌

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌.. మదుపరులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే దాదాపు 3,500 మంది ప్రాణాలను కోల్పోగా, లక్ష మందికిపైగా ఈ అంటువ్యాధి బారినపడ్డారు. భారత్‌లోనూ కేసులు పెరుగుతుండటం మదుపరులను అమ్మకాల ఒత్తిడికి లోనుచేసింది. ఈ ప్రభావం అన్ని రంగాలపై కనిపించింది.


బ్యాంకింగ్‌పై భయాలు

యెస్‌ బ్యాంక్‌ సంక్షోభం.. మొత్తం భారతీయ బ్యాంకింగ్‌ రంగ సుస్థిరతపైనే అనుమానాల్ని కలుగజేసింది. మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకింగ్‌ రంగంలో వెలుగుచూస్తున్న వరుస మోసాలు మదుపరులను నొప్పిస్తున్నాయి. దీంతో చోటుచేసుకున్న పెట్టుబడుల ఉపసంహరణ.. బ్యాంకింగ్‌ షేర్లను తీవ్రంగా నష్టపరిచాయి. బ్యాంకింగేతర ఆర్థిక రంగ షేర్లూ చతికిలపడ్డాయి.


పెట్టుబడుల వాపస్‌

విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ).. భారతీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. ఆగని ఈ పెట్టుబడుల పోకడ.. మార్కెట్లను నిట్టనిలువునా ముంచేసింది. గడిచిన 15 రోజుల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.21,937 కోట్ల పెట్టుబడులను ఎఫ్‌ఐఐలు వెనక్కి తీసుకున్నారు. దేశ ఆర్థిక మందగమన ప్రభావం ఎఫ్‌ఐఐలపై స్పష్టంగా కనిపిస్తున్నది.


గ్లోబల్‌ గోవింద!

అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్ల నష్టాలు కూడా భారతీయ స్టాక్‌ మార్కెట్ల ఉసురు తీశాయి. ఆసియా-పసిఫిక్‌ షేర్ల పతనం.. దేశీయ స్టాక్‌ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. జపాన్‌, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, హాంకాంగ్‌, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, దుబాయ్‌, కువైట్‌ స్టాక్‌ మార్కెట్లన్నీ కూడా భారీ నష్టాలకే పరిమితమైయ్యాయి. ఇదే దారిలో భారతీయ స్టాక్‌ మార్కెట్లూ పయనించాయి.

ప్రపంచ మార్కెట్ల  పతనం 

(పాయింట్లలో)

డౌజోన్స్‌ 1976

ఎస్‌ అండ్‌ పీ 218

నాస్‌డాక్‌  566

డీఏఎక్స్‌ 916 

నిక్కీ 1050


logo
>>>>>>