బెంబేలెత్తిన మార్కెట్లు

- సెన్సెక్స్ 1,145, నిఫ్టీ 306 పాయింట్లు పతనం
- తీవ్ర అమ్మకాల ఒత్తిడిలో మదుపరులు
- కరిగిపోయిన రూ. 3.7 లక్షల కోట్ల సంపద
- వెంటాడిన కరోనా భయాలు, గ్లోబల్ మార్కెట్ల క్షీణత
- ఈ ఏడాది సెన్సెక్స్‌కు ఇదే అత్యంత భారీ నష్టం
ముంబై, ఫిబ్రవరి 22: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలు.. సోమవారం భీకర స్థాయికి చేరాయి. మదుపరుల తీవ్ర అమ్మకాల ఒత్తిడితో బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,145.44 పాయింట్లు క్షీణించి 49,744.32 వద్ద ముగిసింది. ఒక్కరోజే సెన్సెక్స్ ఈ స్థాయిలో నష్టపోవడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 306.05 పాయింట్లు కోల్పోయి 14,700 మార్కుకు దిగువన 14,675.70 వద్ద నిలిచింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలపడినా.. మార్కెట్ సెంటిమెంట్ మాత్రం పుంజుకోలేకపోయింది. నిజానికి ఉదయం ఆరంభం నుంచే సూచీలు నష్టాల్లో కదలాడాయి. సమయం గడుస్తున్నకొద్దీ పెరుగుతూపోయాయి. కాగా, గత ఐదు రోజులుగా సెన్సెక్స్ 2,409.81 పాయింట్లు, నిఫ్టీ 639 పాయింట్లు పతనమయ్యాయి.
రియల్టీ, ఐటీ షేర్లు ఢమాల్
ఎనర్జీ, రియల్టీ, ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు భారీగా నష్టాలను చవిచూశాయి. ఈ రంగాల షేర్లు 2.92 శాతం మేర పడిపోయాయి. ఇక సెన్సెక్స్‌లో డాక్టర్ రెడ్డీస్ షేర్ విలువ అత్యధికంగా 4.77 శాతం దిగజారింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.34 శాతం మేర నష్టపోయాయి. కాగా, మెటల్, బేసిక్ మేటీరియల్స్ షేర్లూ లాభాలను అందుకున్నాయి.
నిమిషానికి రూ.1,000 కోట్లకుపైగా ఆవిరి
స్టాక్ మార్కెట్ల భారీ నష్టంతో మదుపరుల సంపద పెద్ద ఎత్తున తరిగిపోయింది. మదుపరులు ఎడాపెడా అమ్మకాలకు దిగడంతో నిమిషానికి వెయ్యి కోట్ల రూపాయలకుపైగా సంపద ఆవిరైపోయింది.బీఎస్ఈలో నమోదైన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సొమ్ము సోమవారం ఒక్కరోజే రూ.3,71,883.82 కోట్లు హరించుకుపోయింది. దీంతో ఆయా సంస్థల మార్కెట్ విలువ రూ.200 లక్షల కోట్ల దరిదాపుల్లోకి దిగజారింది. గత శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.2,03,98,381.96 కోట్లుగా ఉంటే, సోమవారం రూ.2,00,26,498.14 కోట్లకు పడిపోయింది.
నష్టాలకు కారణాలు
మదుపరుల లాభాల స్వీకరణ
స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలకు చేరడంతో చాలామంది మదుపరులు లాభాల స్వీకరణకు దిగుతున్నారు. ఇది కూడా మార్కెట్ వరుస నష్టాలకు కారణమవుతున్నది. మదుపరులలో పెట్టుబడులపై మళ్లీ కొత్త ఆశలు, అంచనాలు నెలకొంటేనే.. సూచీలు పెరిగే వీలున్నది. ముగుస్తున్న ఎఫ్‌అండ్‌వో గడువు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) కాంట్రాక్టుల ఫిబ్రవరి గడువు గురువారంతో ముగిసిపోతున్నది. దీంతో మదుపరులు అమ్మకాలకు దిగుతున్నారు. ఇప్పటిదాకా వచ్చిన లాభాలను ఒడిసి పట్టుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల క్షీణత
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు దేశీయ మార్కెట్ల నష్టాలను పెంచేశాయి. ఆసియా మార్కెట్లలో ప్రధానమైన చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు, ఐరోపా మార్కెట్లలో కీలకమైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు నష్టాల్లోనే కదలాడాయి.
ఆకర్షణీయంగా బాండ్ల రాబడి
ప్రభుత్వ బాండ్లపై పెట్టుబడులు ఆకర్షణీయమైన లాభాలను అందిస్తుండటం.. ఈక్విటీ పెట్టుబడులపై నుంచి మదుపరుల దృష్టిని మరల్చింది. ఇప్పటికే పదేండ్ల కాలపరిమితి కలిగిన బాండ్లపై ప్రతిఫలం 1.38 శాతానికి చేరుకోవడం గమనార్హం.
పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం కూడా మార్కెట్ల ఉసురు తీసేసింది. మొత్తం కేసులు 1.10 కోట్లకు చేరడం, ఈ ఒక్కరోజే 15వేల కొత్త కేసులు రావడం సర్వత్రా ఆందోళనకు దారితీసింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కొవిడ్-19 విజృంభణ.. మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేస్తున్నది.
ఎగబాకుతున్న చమురు ధరలు
ముడి చమురు ధరలు మళ్లీ ఎగిసిపడుతుండటం కూడా మార్కెట్ నష్టాలకు ఓ కారణంగానే నిలిచింది. భారతీయ ఇంధన అవసరాల్లో అధికం దిగుమతుల ద్వారానే తీరుతున్న వేళ.. గ్లోబల్ క్రూడాయిల్ ధరలు మదుపరులలో కొత్త భయాలను రేకెత్తించాయి. ఇప్పటికే దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.100ను దాటేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ
- గోమాతలకు సీమంతం.. ప్రత్యేక పూజలు
- కూతురి కళ్లెదుటే.. తండ్రిని కత్తులతో పొడిచి చంపారు
- ‘పెట్రో’ ఎఫెక్ట్.. రూ.12 పెరగనున్న పాల ధర!