శనివారం 30 మే 2020
Business - Apr 30, 2020 , 00:16:09

పడ్డ రేటుకే అమ్మండి

పడ్డ రేటుకే అమ్మండి

  • లాభనష్టాల్లేకుండా ఇండ్లను వదిలించుకోండి
  • నిర్మాణ రంగ సంస్థలతో కేంద్ర మంత్రి గడ్కరీ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వడ్డీ భారాన్ని తప్పించుకునేందుకు, నగదు లభ్యతను పెంచుకునేందుకు పడ్డ రేట్లకే ఇండ్లను అమ్మేసుకోవాలని నిర్మాణ రంగ సంస్థలకు కేంద్ర ఎంఎస్‌ఎంఈ, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఇప్పటిదాకా అమ్ముడుకాని ఫ్లాట్లను, గృహాలను డెవలపర్లు లాభనష్టాల్లేకుండా విక్రయించాలన్నారు. ఈ కష్టకాలంలో బిల్డర్లు అత్యాశకు పోరాదని, పెట్టిన పెట్టుబడి వస్తే చాలనుకోవాలని హితవు పలికారు. నరెడ్కో బుధవారం ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ.. అసలే మందగమనంలో ఉన్నామంటే.. కరోనా మరింత సంక్షోభంలోకి నెట్టేసిందన్నారు.

నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడానికి నిర్మాణ సంఘాలు తమ ప్రతినిధుల్ని గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖకు, ప్రధాన మంతి కార్యాలయానికి పంపించాలని సూచించారు. అయితే గిరాకీని పెంపొందించడానికి నిర్మాణ సంస్థలే సొంతంగా హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. దీనివల్ల తక్కువ వడ్డీకే రుణాల్ని అందించడంతోపాటు బ్యాం కుల మీద పూర్తిగా ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. చిన్న పట్టణాల్లో రూ.10 లక్షల కంటే లోపు రేటుగల ఫ్లాట్లను డెవలపర్లు నిర్మించాలని సూచించారు.  

ప్యాకేజీలను పరిశీలిస్తున్నాం

ఒత్తిడిలో ఉన్న రంగాలను ఆదుకునేందుకున్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, ప్యాకేజీలనూ ప్రకటించే వీలుందని గడ్కరీ తెలిపారు. త్వరలోనే ప్రధాన మంత్రి ఓ నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న రంగాలకు ఊతమిచ్చేలా మా తరఫున మేము తగిన సూచనలు ఇస్తూనే ఉన్నామని, అయితే ప్రధానిదే తుది నిర్ణయమని గడ్కరీ స్పష్టం చేశారు.


logo