బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 14, 2020 , 01:13:49

రెండేండ్లు వాయిదా

రెండేండ్లు వాయిదా
  • సీఎండీ పదవుల విభజన గడువును 2022 వరకు పెంచిన సెబీ

న్యూఢిల్లీ, జనవరి 13: కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన డిమాండ్లకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ తలొగ్గింది. స్టాక్ మార్కెట్లో లిైస్టెన సంస్థలు కచ్ఛితంగా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ల పదవులను విడగొట్టాలనే గడువును ఏప్రిల్ 2022 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం దేశ ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో సంస్థలపై పడుతున్న భారం దృష్ట్యా ఈ గడువును పెంచాలని కార్పొరేట్ల విజ్ఞప్తుల నేపథ్యంలో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. సెబీ నూతన మార్గదర్శకాల ప్రకారం టాప్-500 లిైస్టెన కార్పొరేట్ సంస్థలు కచ్ఛితంగా చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)లను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి విడగొట్టాలని గతంలో ఆదేశించింది. స్టాక్ మార్కెట్లో లిైస్టెన సంస్థల్లో కార్పొరేట్ పరిపాలన పనితీరును మెరుగుపరుచాలనే ఉద్దేశంతో ఈ రెండు కీలక పోస్ట్‌లను విడగొట్టాలని సెబీ భావించింది. ఈ నూతన మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని చూసినప్పటికీ..సంస్థల నుంచి వచ్చిన సూచనల మేరకు దీనిని ఏప్రిల్ 1, 2022 వరకు పొడిగిస్తున్నట్లు ఈ నెల 10న విడుదల చేసిన గెజిటెడ్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నోటిసును ఎప్పుడు విడుదల చేసిందో మాత్రం వెల్లడించకపోయినప్పటికీ, ఈ మార్గదర్శకాల అమలును మాత్రం రెండెండ్లపాటు వాయిదావేస్తున్నట్లు సెబీ వర్గాలు వెల్లడించాయి. పారిశ్రామిక సంఘాలైన ఫిక్కీ, సీఐఐలతోపాటు ఇతర కార్పొరేట్ సంస్థల ఈ గడువును పెంచాలని సెబీని కోరిన విషయం తెలిసిందే.

కేవలం సగం సంస్థలే..

గడువు సమీపిస్తున్నప్పటికీ కార్పొరేట్ సంస్థలు మాత్రం సీఎండీ పదవులను వేరు చేయడం లేదు. ఇప్పటి వరకు కేవలం 50 శాతం సంస్థలు మాత్రమే ఈ రెండు పదవులను విడగొట్టాయి. మరికొన్ని సంస్థలైతే రెండు పదవులను విలీనం చేశాయి కూడా. సంస్థల్లో కార్పొరేట్ పాలనను మెరుగు పరుచడానికి సెబీ నియమించిన కొటక్ కమిటీ ఈ సూచనలు చేసింది. దేశంలో అతిపెద్ద సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, విప్రో, హీరో మోటోకార్ప్‌లలో ఒకే వ్యక్తి రెండు పోస్టులైన సీఎండీ పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

స్వాగతించిన ఫిక్కీ..

సెబీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇండస్ట్రీ వర్గాలు స్వాగతించాయి. సీఎండీల పదవుల విభజన గడువును మరో రెండేండ్లు పొడగించడం మంచి పరిణామమని, కుటుంబ సభ్యుల వ్యాపారాలు మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ నిర్ణయం దోహదం చేయనున్నదని ఫిక్కీ ప్రెసిడెంట్ సంగీతా రెడ్డి తెలిపారు. సెబీకి పలుసార్లు విజ్ఞప్తి చేయడం వల్లనే ఈ కాలపరిమితిని పెంచినట్లు ఆమె చెప్పారు. అలాగే అనేక కుటుంబ సభ్యుల నడుపుతున్న సంస్థలకు ఈ నిర్ణయం కాస్త ఊరటనిచ్చినట్లు అయిందని, వీటితోపాటు ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న సంస్థలకూ కూడా వర్తించనున్నదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు కీలక వ్యక్తులతో కంపెనీలను నడుపడం చాలా కష్టమని, కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. 


logo