బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Feb 01, 2020 , 00:35:35

ఎస్బీఐ రికార్డు లాభం

ఎస్బీఐ రికార్డు లాభం
  • క్యూ3లో రూ.6,797 కోట్లుగా నమోదు
  • మొండి బకాయిల వసూళ్ళలో భారీ వృద్ధి

న్యూఢిల్లీ, జనవరి 31: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్‌ రూ.6,797.25 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.4,823.29 కోట్ల లాభంతో పోలిస్తే 41 శాతం ఎగబాకినట్లు బ్యాంక్‌ బీఎస్‌ఈకి సమాచారం అందించింది.  బ్యాంక్‌ కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ. 84,390.14 కోట్ల నుంచి రూ.95,384. 28 కోట్లకు చేరుకున్నది. స్థూల నిరర్థక ఆస్తుల విలువ తగ్గుముఖం పట్టడం బ్యాంకు రికార్డు స్థాయి లాభాలను ఆర్జించడానికి దోహదం చేసింది. గత త్రైమాసికంలో బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 6.94 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. క్రితం ఏడాది ఇవి 8.71 శాతంగా ఉండేది. అలాగే నికర ఎన్‌పీఏ కూడా 3.95 శాతం నుంచి 2.65 శాతానికి దిగొచ్చినట్లు బ్యాంక్‌ వర్గాలు వెల్లడించాయి. ఏకీకృత విషయానికి వస్తే బ్యాంక్‌ నికర లాభం 41.2 శాతం ఎగబాకి రూ.5,583.36 కోట్లకు చేరుకున్నది. ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి. ఆస్తుల నాణ్యత పెరుగడం, వడ్డీల ద్వారా అధిక ఆదాయం సమకూరడం బ్యాంక్‌కు కలిసొచ్చింది. గతేడాది ఇది రూ.3,954.81 కోట్లుగా ఉన్నది. ఆదాయం కూడా రూ. 70,311.84 కోట్ల నుంచి రూ.76,797.91 కోట్లకు ఎగబాకినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అటు లాభాల్లోనూ, ఆస్తుల నాణ్యతలోను, కేటాయింపులు తగ్గుముఖం పట్టినట్లు ఎస్బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ తెలిపారు. డిపాజిట్లు, రిటైల్‌ అడ్వాన్స్‌ల్లో ముఖ్యంగా వ్యక్తిగత, వ్యవసాయం, హౌజింగ్‌, చిన్న స్థాయి వ్యాపారాలు ఆశాజనక పనితీరు కనబరిచినట్లు ఆయన చెప్పారు. 

ఆర్థిక ఫలితాల్లో ముఖ్య అంశాలు..

  • మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్‌ రూ.8,193.06 కోట్ల నిధులు కేటాయించింది. అంతక్రితం ఏడాది రూ.13,970.82 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గాయి. 
  • నికర వడ్డీ ఆదాయం 22.42 శాతం పెరిగి రూ.27,779 కోట్లకు చేరాయి. గతేడాది ఇది రూ.22,691 కోట్లుగా ఉన్నాయి. ఎస్సార్‌ స్టీల్‌ నుంచి రూ.11 వేల రుణాలు వసూలు చేయడం ఎన్‌ఐఐ పెరుగడానికి దోహదం చేశాయి. 
  • దేశీయ నికర వడ్డీ మార్జిన్‌ 62 పాయింట్లు పెరిగి 2.97 శాతం నుంచి 3.59 శాతానికి చేరుకున్నాయి.
  • స్థూల నిరర్థక ఆస్తుల విలువ 8.71 శాతం నుంచి 6.74 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏ 3.95 శాతం నుంచి 2.65 శాతానికి దిగొచ్చింది.
  • గత త్రైమాసికంలో రూ.16,525 కోట్ల రుణాలు తాజాగా మొండి బకాయిల జాబితాలోకి చేరాయి. దివాన్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌కు ఇచ్చిన రూ. 7,100 కోట్ల రుణంతోపాటు రూ.2,900 కోట్ల పెట్టుబడులు తాజాగా ఎన్‌పీఏలోకి చేరుకున్నాయి. 
  • రూ.13,553 కోట్ల మొండి బకాయిలను వసూలు చేసిన బ్యాంక్‌..ప్రస్తుత త్రైమాసికంలో రూ.7 వేల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. రూ.960 కోట్ల ఎన్‌పీఏ ఆస్తులను విక్రయించింది. 
  • స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి బ్యాంక్‌ షేరు ధర 2.53 శాతం బలపడి రూ.318.55 వద్ద నిలిచింది. 


logo
>>>>>>