సోమవారం 01 జూన్ 2020
Business - May 07, 2020 , 01:33:29

ఎస్బీఐ రేటింగ్‌ కోత

ఎస్బీఐ రేటింగ్‌ కోత

మరో 3 బ్యాంకుల రేటింగ్‌నూ తగ్గించిన బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌

ముంబై, మే 6: ఎస్బీఐ, మరో 3 బ్యాంకుల రేటింగ్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ తగ్గించింది.  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ల రేటింగ్‌కు కోత పెడుతున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐ రేటింగ్‌ను కొనుగోలు స్థాయి నుంచి నష్టాల స్థాయికి తీసుకురాగా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ల రేటింగ్‌ను కొనుగోలు నుంచి తటస్థ స్థాయికి తెచ్చింది. బీవోబీ రేటింగ్‌ను తటస్థం నుంచి నష్టాల శ్రేణికి మార్చింది. ఫలితంగా ఎస్బీఐ, బీవోబీ షేర్లకు దూరంగా ఉండాలని మదుపరులకు సూచించింది. బ్యాంకింగ్‌ రంగానికి మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ)ల ముప్పు ఉన్నదని విశ్వసించిన బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌.. కార్పొరేట్‌, రిటైల్‌ విభాగాల్లో ఇవి ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరించింది. ఈ క్రమంలోనే బ్యాంకుల ఆదాయం, లాభాలూ 90 శాతం వరకు పడిపోవచ్చని, స్టాక్‌ మార్కెట్లలో లక్ష్యిత ధరలు దాదాపు 60 శాతం క్షీణించవచ్చని పేర్కొన్నది. కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒక్కదానికే గత రేటింగ్‌ను కొనసాగించింది. ఇటీవల యూబీఎస్‌ సైతం వివిధ బ్యాంకుల లక్ష్యిత ధరలను 5-41 శాతం మేర తగ్గించింది. ఇక సీఎల్‌ఎస్‌ఏ 20-70 శాతం వరకు కోత పెట్టింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలు స్తంభించిపోగా, బ్యాంకింగ్‌ రుణాలు ప్రమాదంలో పడ్డాయి. దీంతో బ్యాంకింగ్‌ షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న విషయం తెలిసిందే.


logo