మంగళవారం 14 జూలై 2020
Business - Jun 06, 2020 , 01:16:49

ఎస్బీఐ అదుర్స్‌

ఎస్బీఐ అదుర్స్‌

 • క్యూ4లో నాలుగింతలైన లాభం
 •  రూ.3,581 కోట్లుగా నమోదు
 • దన్నుగా క్రెడిట్‌ కార్డు వాటా విక్రయం
 •  రూ.76 వేల కోట్లు దాటిన ఆదాయం

న్యూఢిల్లీ/ముంబై, జూన్‌ 5: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించాయి. బ్యాంక్‌ అనుబంధ సంస్థయైన క్రెడిట్‌ కార్డులో వాటా విక్రయించడంతో ఒకేసారి భారీగా నిధులు సమకూరడం, మరోవైపు మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.3,581 కోట్ల ఏకీకృత లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నమోదైన రూ.838.44 కోట్ల లాభంతో పోలిస్తే నాలుగింతలు ఎగబాకినట్లు అయింది. కానీ, మూడో త్రైమాసికంలో నమోదైన రూ.5,583.36 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం 35 శాతానికి పైగా పడిపోయింది. బ్యాంక్‌ ఆదాయం గత త్రైమాసికం నాటికి రూ.76,027.51 కోట్లకు పెరిగినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 

గతేడాది రికార్డు స్థాయి లాభం

బ్యాంక్‌ మరో రికార్డును సృష్టించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికిగాను రూ.14,488 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. బ్యాంక్‌ చరిత్రలో ఒక ఏడాది ఇంతటి లాభాన్ని ఆర్జించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఎస్బీఐ కార్డు అండ్‌ పేమెంట్‌ సర్వీసులు, ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో వాటాలను విక్రయించడం ద్వారా ఒకేసారి భారీగా నిధులు సమకూరడంతో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించడానికి దోహదపడింది. ఆదాయం విషయానికి వస్తే రూ.2,78,082.99 కోట్ల నుంచి రూ.2,96,329.43 కోట్లకు పెరిగింది. 

భారీగా లాభపడ్డ బ్యాంక్‌ షేరు

బ్యాంక్‌ షేరు ధర భారీగా లాభపడింది. ఒక దశలో 9 శాతం వరకు ఎగబాకిన షేరు చివరకు  7.90 శాతం పెరిగి రూ.187.80 వద్ద ముగిసింది. దీంతో బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.12,272.20 కోట్లు అధికమై రూ.1,67,604.20 కోట్లకు చేరుకున్నది. 

ఫలితాల్లోని ముఖ్య అంశాలు..

 • ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయించడం ద్వారా రూ.3,484.30 కోట్ల నిధులు సమకూరాయి
 • ఎస్బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసుల్లో వాటాను తగ్గించుకోవడంతో రూ.2,731.34 కోట్లు లభించాయి. 
 • బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 6.15 శాతానికి పరిమితమయ్యాయి. ఏడాది క్రితం ఇది 7.53 శాతంగా ఉన్నది. వీటి విలువ రూ.1.72 లక్షల కోట్ల నుంచి రూ.1.49 లక్షల కోట్లకు తగ్గాయి. 
 • నికర ఎన్‌పీఏ 2.23 శాతానికి దిగొచ్చింది. అంతక్రితం ఏడాది ఇది 3.01 శాతంగా ఉన్నది. విలువ ఆధారంగా చూస్తే రూ.58,249 కోట్ల నుంచి రూ.51,871.30 కోట్లకు పరిమితమయ్యాయి. 
 • మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్‌ రూ.13,495.08 కోట్ల నిధులు వెచ్చించింది. ఏడాది క్రితం కేటాయించిన రూ.16,501.89 కోట్లతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి.
 • తాజాగా రూ.8,105 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయి. రూ.2,528 కోట్ల రుణాలను తిరిగి వసూలు చేయగలిగింది.
 • యెస్‌బ్యాంక్‌లో 48.21 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడానికి బ్యాంక్‌ రూ.6,050 కోట్ల నిధులను వెచ్చించింది. 
 • 21 శాతం మంది బ్యాంక్‌ రిటైల్‌ ఖాతాదారులు మూడు నెలల మారటోరియాన్ని ఎంచుకున్నారు. 
 • నికర వడ్డీ మార్జిన్‌ 3.02 శాతం నుంచి 2.94 శాతానికి తగ్గింది.
 • ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో ప్రస్తుతం 83.62 శాతంగా ఉన్నది. 
 • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల్లో వృద్ధి 7-8 శాతం మధ్యలో ఉండనున్నదని బ్యాంక్‌ అంచనావేస్తున్నది. 
 • కార్పొరేట్ల  మొండి బకాయిలు రూ.1,561 కోట్లు కాగా, వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాల్లో రూ.5,238 కోట్లు ఎన్‌పీఏలుగా మారాయి. 
 • బ్యాంక్‌ అడ్వాన్స్‌లు రూ.23.01 లక్షల కోట్ల నుంచి రూ.24.22 లక్షల కోట్లకు పెరిగాయి.

“కరోనా వైరస్‌తో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించడం మంచి పరిణామం. నిలకడగా బ్యాంక్‌ ఆస్తుల నాణ్యత ప్రమాణాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మారటోరియాన్ని ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 21 శాతం మంది మాత్రమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మార్చి నుంచి మే మధ్యకాలంలో 82 శాతం మంది రెండు లేదా మరిన్ని వాయిదాలు చెల్లించారు. 92 శాతం మంది ఒకటి లేదా మరిన్ని ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించారు. లాక్‌డౌన్‌తో నెలకొన్న పరిస్థితులు రెండో త్రైమాసికం నాటికి చక్కబడే అవకాశాలు ఉన్నాయి”

 - రజనీశ్‌ కుమార్‌, ఎస్బీఐ చైర్మన్‌


logo