బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Mar 21, 2020 , 23:26:25

ఎమర్జెన్సీ లోన్లు

ఎమర్జెన్సీ  లోన్లు

-వ్యాపారుల కోసం ఎస్బీఐ ప్రారంభం

-రూ.200 కోట్లదాకా అత్యవసర రుణ సదుపాయం 

-జూన్‌ 30 వరకు అందుబాటులో

ముంబై, మార్చి 21: వ్యాపార, పారిశ్రామిక రంగాల కార్యకలాపాలపై కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో అత్యవసర రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఎస్బీఐ. కోవిడ్‌-19 ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ (సీఈసీఎల్‌) సదుపాయం ద్వారా రూ.200 కోట్ల వరకు రుణాలు అందజేస్తామని ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ప్రకటించింది. జూన్‌ 30 వరకు ఈ రుణాలను పొందే అవకాశం ఉంటుందని తమ అన్ని శాఖలకు ఎస్బీఐ ఓ సర్క్యులర్‌ ఇచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. భారత్‌నూ భయపెడుతున్నది. ఈ అంటువ్యాధి దెబ్బకు వ్యాపార, పారిశ్రామిక రంగాలు కుదేలవుతుండగా, దేశ ఆర్థిక వ్యవస్థ యావత్తూ కుంటుబడుతున్నది. ముఖ్యంగా వ్యాపారులకు నగదు కొరత సమస్య తలెత్తుతున్నది. ఈ క్రమంలో ఎస్బీఐ ఎమర్జన్సీ క్రెడిట్‌ లైన్‌ను ప్రారంభించింది.

12 నెలలు.. 7.25 శాతం వడ్డీరేటు

ఈ ప్రత్యేక రుణాల కాలపరిమితి 12 నెలలుగా ఉంటుందని ఎస్బీఐ స్పష్టం చేసింది. వడ్డీరేటు 7.25 శాతంగా ఉంటుందని వెల్లడించింది. ‘కోవిడ్‌-19తో వ్యాపారపరంగా ప్రభావితమైనవారికి ఈ రుణాలు ఊరటనిస్తాయని ఆశిస్తున్నాం. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో సీఈసీఎల్‌తో అదనపు నగదు లభ్యత పెరుగుతుంది. కాబట్టి అర్హులైన వారికి ఈ రుణ సదుపాయాన్ని అందించండి’ అని ఎస్బీఐ తమ శాఖలకు విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నది. కాగా, ఈ నెల 16 నాటికి స్పెషల్‌ మెన్షన్‌ అకౌంట్స్‌ (ఎస్‌ఎంఏ) 1 లేదా 2గా వర్గీకరించని అన్ని ఖాతాలకు ఈ రుణ సదుపాయం పొందే వీలుందని ఎస్బీఐ స్పష్టం చేసింది. మొండి బకాయి (ఎన్‌పీఏ లేదా నిరర్థక ఆస్తులు)లుగా మారడానికి అవకాశమున్న ఖాతాలను గుర్తించేందుకే ఈ ఎస్‌ఎంఏలను ప్రవేశపెట్టారు. దేశంలో 50 శాతానికిపైగా సంస్థలు తమ కార్యకలాపాలపై వైరస్‌ ప్రభావాన్ని చూస్తున్నాయని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ చెబుతున్నది. సుమారు 80 శాతం సంస్థలకు నగదు కొరత సమస్య ఎదురవుతున్నదని అంటున్నది. 


ఆన్‌లైన్‌ పేమెంట్లు ఉత్తమం

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌ చెల్లింపులకు దిగాలని కస్టమర్లకు ఎస్బీఐ కార్డ్‌ సూచిస్తున్నది. అన్ని అత్యవసర సేవలకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నగదు లావాదేవీల కంటే డిజిటల్‌ లావాదేవీలు రక్షణాత్మకంగా ఉంటాయని వెల్లడించింది. మరోవైపు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ కూడా ప్రీమియం చెల్లింపుల కోసం ఆన్‌లైన్‌ సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది. బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, యెస్‌ బ్యాంక్‌లు సైతం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తూ తగు నిర్ణయాలు తీసుకున్నాయి. పీఎన్‌బీ హౌజిం గ్‌ ఫైనాన్స్‌ సిబ్బందిని దాదాపుగా తగ్గించి కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. కరో నా వైరస్‌కు మందు లేకపోవడం, అంటువ్యాధి కావడంతో భౌతికంగా కాకుండా డిజిటల్‌ సదుపాయాలను వాడాలని ఆర్థిక సంస్థలు కోరుతున్నాయి.


logo
>>>>>>