మంగళవారం 02 జూన్ 2020
Business - May 08, 2020 , 02:07:04

ఎస్బీఐ రుణాలు చౌక

ఎస్బీఐ రుణాలు చౌక

  • 15 బేసిస్‌ పాయింట్లు తగ్గిన వడ్డీరేట్లు 
  • డిపాజిట్లపై 20 బేసిస్‌ పాయింట్లు కుదింపు

న్యూఢిల్లీ, మే 7: దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారులకు మరోసారి తీపికబురు చెప్పింది. అన్ని రకాల రుణాలపై బెంచ్‌మార్క్‌ వడ్డీ రేటును 15 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం 7.40 శాతంగా ఉన్న ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు) తాజా సవరణతో 7.25 శాతానికి తగ్గిందని, ఇది ఈ నెల 10 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఎస్బీఐ తమ ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం ఇది వరుసగా 12వసారి. ఈ సవరణతో ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమైన గృహరుణాల వడ్డీ రేట్లతోపాటు నెలవారీ ఈఎంఐ కూడా తగ్గుతుంది. 30 ఏండ్ల కాలపరిమితితో రూ.25 లక్షల రుణం తీసుకొన్నవారికి ఈఎంఐ రూ.225 తగ్గుతుందని ఎస్బీఐ వివరించింది. అయితే మూడేండ్ల వరకు కాలపరిమితి గల రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నామని, ఇది ఈ నెల 12 నుంచి అమల్లోకి వస్తందని ఎస్బీఐ పేర్కొన్నది.

ఎన్‌బీఎఫ్‌సీలకు చేయూత

నగదు కొరతతో అల్లాడుతున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు మారటోరియంను వర్తింపచేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. 

‘ఎస్బీఐ వీకేర్‌'తో సీనియర్‌ సిటిజన్లకు లబ్ధి

సీనియర్‌ సిటిజన్లకు అధిక వడ్డీతో కూడిన ప్రత్యేక డిపాజిట్‌ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్ల విషయంలో వృద్ధుల ప్రయోజనాలను కాపాడేందుకు కొత్తగా ‘ఎస్బీఐ వీకేర్‌ డిపాజిట్‌' స్కీమ్‌ను తీసుకొస్తున్నట్టు ఆ బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పథకం కింద ఐదేండ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన సీనియర్‌ సిటిజన్ల టర్మ్‌ డిపాజిట్లపై అదనంగా 30 బేసిస్‌ పాయింట్ల ప్రీమియంను చెల్లించనున్నామని, సెప్టెంబర్‌ 30 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఐదేండ్లలోపు కాలవ్యవధి కలిగిన సీనియర్‌ సిటిజన్ల టర్మ్‌ డిపాజిట్లకు సాధారణ డిపాజిట్‌దారుల కంటే 50 బేసిస్‌ పాయింట్ల అధిక వడ్డీ లభిస్తుందని, అలాగే ఐదేండ్ల కంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన సీనియర్‌ సిటిజన్ల టర్మ్‌ డిపాజిట్లకు సాధారణ డిపాజిట్‌దారుల కంటే అదనంగా 80 బేసిస్‌ పాయింట్ల (30 బేసిస్‌ పాయింట్ల అదనపు ప్రీమియంతో కలిపి) వడ్డీ చెల్లిస్తామని ఎస్బీఐ వివరించింది. నిర్ణీత కాలవ్యవధి ముగియడానికి ముందే ఉపసంహరించుకొనే డిపాజిట్లకు అదనపు ప్రీమియం వర్తించదని ఎస్బీఐ స్పష్టం చేసింది.

రెపో ఆధారిత గృహరుణాలు ప్రియం

మరోవైపు ఎస్బీఐ రెపోరేట్‌ ఆధారిత గృహరుణాల వడ్డీరేట్లను 30 బేసిస్‌ పాయింట్లు పెంచింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రుణగ్రహీతలకు, రియాల్టీ సంస్థలకు రుణ సమస్యలు పెరుగవచ్చన్న మార్కెట్‌ నుంచి సంకేతాలు వస్తున్న తరుణంలో ఈ చర్య చేపట్టినట్టు ఆ బ్యాంకు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు ఆస్థి తనఖాపై ఇచ్చే వ్యక్తిగత రుణాల వడ్డీరేట్లను కూడా 30 బేసిస్‌ పాయింట్లు పెంచినట్టు ఎస్బీఐ ప్రకటించింది. దీంతో ఇతర బ్యాంకులు కూడా ఎస్బీఐ బాటలో నడిచే అవకాశమున్నది. ఎస్బీఐ ఎక్కువ గృహరుణాలను రెపోరేట్‌ లేదా ఎంసీఎల్‌ఆర్‌ ఆధారంగా ఇస్తున్నది. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆధారిత వడ్డీరేటును 7.05 శాతం వద్ద స్థిరంగా ఉంచినప్పటికీ వివిధ రకాల గృహరుణాలపై వడ్డీరేట్లను 30 బేసిస్‌ పాయింట్లు పెంచింది. కొత్త వడ్డీరేట్లను ఈ నెల 1 నుంచే అమల్లోకి తీసుకొచ్చినట్టు ఎస్బీఐ తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నది.


logo