గురువారం 09 ఏప్రిల్ 2020
Business - Mar 12, 2020 , 00:15:05

ఎస్బీఐ రుణాలు చౌక

ఎస్బీఐ రుణాలు చౌక
  • 15 బేసిస్‌ పాయింట్ల వరకు దిగొచ్చిన వడ్డీరేట్లు
  • రుణాలు మరింత ఆకర్షణీయం
  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లపైనా అర శాతం వరకు కోతలు
  • ఈ నెల 10 నుంచే అమలు
  • నెలసరి మినిమం బ్యాలెన్స్‌లు రద్దు
  • ఎస్‌ఎంఎస్‌ చార్జీల తొలగింపు
  • ఖాతాదారులకు గొప్ప ఊరట

ముంబై, మార్చి 11: ఎస్బీఐ రుణాలపై వడ్డీరేట్లు మరింత తగ్గాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ) రేట్లపైనా అర శాతం వరకు కోతలు పెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం.. ఖాతాదారులకు గొప్ప ఊరటనిస్తూ నెలసరి మినిమం బ్యాలెన్స్‌ నిబంధనను రద్దు చేసింది. ఎస్‌ఎంఎస్‌ చార్జీలనూ తొలగించింది. ఈ మేరకు బుధవారం ఎస్బీఐ ప్రకటించింది. వివిధ కాల పరిమితుల్లో ఎఫ్‌డీ రేట్లను తగ్గించిన బ్యాంక్‌.. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేట్లను (ఎంసీఎల్‌ఆర్‌) 15 బేసిస్‌ పాయింట్ల వరకు దించింది. గడిచిన నెల రోజుల్లో ఇలా ఎఫ్‌డీ, రుణాలపై వడ్డీరేట్లను ఎస్బీఐ తగ్గించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఫిబ్రవరి 10న చివరిసారిగా తగ్గించింది. రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్ల (రూ.2 కోట్లలోపు)పై వడ్డీరేటును 10 నుంచి 50 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గించినట్లు ఈ సందర్భంగా ఎస్బీఐ తెలిపింది. 180 రోజుల నుంచి ఆపై కాల పరిమితుల కోసం రూ.2 కోట్లు అంతకుమించిన బల్క్‌ టర్మ్‌ డిపాజిట్ల వడ్డీరేటునూ 15 బేసిస్‌ పాయింట్లదాకా తగ్గించింది. సవరించిన వడ్డీరేట్లు ఈ నెల 10 నుంచే అమల్లోకి వస్తాయని ఎస్బీఐ స్పష్టం చేసింది.


రుణాలపై వడ్డీరేట్లు ఇలా..

ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 7.85 శాతం నుంచి 7.75 శాతానికి తెచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఎంసీఎల్‌ఆర్‌కు కోత పెట్టడం వరుసగా ఇది పదోసా రి కావడం గమనార్హం. రుణాలపై బ్యాంక్‌ వసూలు చేసే కనిష్ఠ వడ్డీరేటే ఎంసీఎల్‌ఆర్‌. రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతిస్తే తప్ప ఇంతకంటే తక్కువ వడ్డీరేటును బ్యాంక్‌ తమ ఖాతాదారులకు అందివ్వలేదు. కాగా, ఓవర్‌నైట్‌, నెల రోజుల ఎంసీఎల్‌ఆర్‌ 15 బేసిస్‌ పాయిం ట్లు దిగి 7.45 శాతం వద్ద స్థిరపడ్డాయి. అలాగే మూడు నెల ల ఎంసీఎల్‌ఆర్‌ను 7.65 శా తం నుంచి 7.50 శాతానికి దించిన ఎస్బీఐ.. రెండేండ్లు, మూడేండ్ల ఎంసీఎల్‌ఆర్‌లను 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 7.95 శాతం, 8.05 శాతం గా నిర్ణయించింది.


యూనియన్‌ బ్యాంక్‌ కూడా..

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా అన్ని కాలవ్యవధిలపై 10 బేసిస్‌ పాయింట్ల వరకు ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. కొత్త రేట్లు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. బ్యాంక్‌ ఇలా తగ్గించడం వరుసగా ఇది తొమ్మిదోసారి. జూలై 2019 నుంచి క్రమక్రమంగా కోతలు పెడుతున్నది. తాజా నిర్ణయంతో ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 8.10 శాతం నుంచి 8 శాతానికి దిగింది. ఓవర్‌నైట్‌ ఎంసీఎల్‌ఆర్‌ 7.55 శాతంగా, నెల రోజులది 7.60 శాతంగా ఉన్నాయి.


పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఉండాలన్న నిబంధనను ఎస్బీఐ తొలగించడం వల్ల ఎందరో పేద, మధ్యతరగతి ఖాతాదారులకు గొప్ప ఊరట లభించినైట్లెంది. వారి జీవన ప్రమాణాల మెరుగుదలకూ ఈ నిర్ణయం దోహదపడుతుంది

నిర్మలా సీతారామన్‌,కేంద్ర ఆర్థిక మంత్రి


పొదుపు ఖాతాల వడ్డీరేటు 3 శాతమే

సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్ల (పొదుపు ఖాతాలు)లోని డిపాజిట్లపై వడ్డీరేట్లను ఎస్బీఐ హేతుబద్ధం చేసింది. అన్ని మొత్తాల డిపాజిట్లపైనా వార్షికంగా 3 శాతానికి పరిమితం చేసింది. ఇప్పటిదాకా రూ.లక్ష వరకు 3.25 శాతంగా, ఆపైన 3 శాతంగా చెల్లించిన ఎస్బీఐ.. ఇప్పుడు అన్నింటికీ 3 శాతమే ఇవ్వనున్నది. కాగా, మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగాలంటే, కొనుగోలుదారుల వినియోగ సామర్థ్యం బలపడాలంటే బ్యాంకుల రుణాలపై వడ్డీరేట్లు తగ్గితే కాదని, పన్నుల భారం దిగితే సాధ్యమని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. మరోవైపు కరోనా వైరస్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ నీరసించిన నేపథ్యంలో ఎస్బీఐ వడ్డీరేట్ల కోతలు నిర్మాణ, ఆటో రంగాలకు చేయూతనిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ సైతం వడ్డీరేట్లను తగ్గించాలని కోరుతున్నారు.


ఖాతాల్లో కనీస నగదు నిల్వలు అక్కర్లేదు

సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలన్నింటిలో కనీస నగదు నిల్వలు ఉండనక్కర్లేదని ఎస్బీఐ నిర్ణయించింది. కస్టమర్ల సౌకర్యార్థం ఎస్‌ఎంఎస్‌ చార్జీలనూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఖాతాల్లో నగదు వేసినా, ఏటీఎంల నుంచి నగదు తీసినా కస్టమర్లకు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో బ్యాంక్‌ సందేశాలిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకుగాను సాధారణంగా మూడు నెలలకోసారి బ్యాంక్‌ చార్జీలను వేస్తుంది. అయితే ఇకపై ఈ భారం కస్టమర్లపై బ్యాంక్‌ మోపదు. ఇవి ఎస్బీఐ 44.51 కోట్ల ఖాతాదారులకు ప్రయోజనం కలిగించనున్నాయి. ప్రస్తుతం మెట్రో నగరాల్లోని ఎస్బీఐ ఖాతాదారులు తమ ఖాతాల్లో సగటు నెలసరి మొత్తంగా కనీసం రూ.3వేలు ఉంచాల్సి వస్తున్నది. పట్టణ ప్రాంతాల్లోని ఖాతాదారులైతే రూ.2వేలు, గ్రామీణ ప్రాంతాల్లోనివారు వెయ్యి రూపాయలు తమతమ ఖాతాల్లో ఎప్పటికీ ఉంచాల్సి వస్తున్నది. ఈ మేరకు నగదు ఖాతాల్లో లేనైట్లెతే రూ.5 నుంచి 15 వరకు జరిమానా, పన్నులు పడుతున్నాయి. 2012 తర్వాత విరామమిచ్చిన ఎస్బీఐ.. ఏప్రిల్‌ 2017లో మళ్లీ మినిమం బ్యాలెన్స్‌ నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు దాన్ని తొలగించింది.logo