సోమవారం 10 ఆగస్టు 2020
Business - Aug 01, 2020 , 03:30:57

అదరగొట్టిన ఎస్బీఐ

అదరగొట్టిన ఎస్బీఐ

  • క్యూ1లో రూ.4,189 కోట్ల లాభం  

న్యూఢిల్లీ, జూలై 31:  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను బ్యాంక్‌ రూ. 4,189.34 కోట్ల స్టాండ్‌లోన్‌ నికర లాభాన్ని ఆర్జించింది. వార్షికంగా చూస్తే 81 శాతం పెరుగడం గమనార్హం. ఏడాది క్రితం ఇది రూ.2,312.02 కోట్లుగా ఉన్నది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, అనుబంధ సంస్థయైన ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయించడం ద్వారా సమకూరిన రూ.1,539 కోట్ల నిధులు ఇందుకు దన్నుగా నిలిచాయని బ్యాంక్‌ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ ఈ సందర్భంగా తెలిపారు. దీంతో ఎస్బీఐ లైఫ్‌లో బ్యాంక్‌ వాటా 57.70 శాతం నుంచి 55.60 శాతానికి తగ్గింది. అలాగే సమీక్షకాలంలో బ్యాంక్‌ స్టాండ్‌లోన్‌ ప్రాతిపదికన ఆదాయం రూ.74,457.68 కోట్లకు చేరుకున్నది. ఏకీకృత ప్రాతిపదికన రూ.87,984.33 కోట్ల ఏకీకృత ఆదాయంపై రూ. 4,776.50 కోట్ల లాభాన్ని గడించింది.   

ఫలితాల్లో ముఖ్యాంశాలు..

  • ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ రూ.18,061 కోట్లుగా నమోదైంది. గతేడాది వచ్చిన రూ.13,246 కోట్లతో పోలిస్తే 36 శాతం పెరిగింది. 
  • ఏడాది క్రితం రూ.62,638 కోట్లుగా ఉన్న వడ్డీ ఆదాయం గత త్రైమాసికానికిగాను ఆరు శాతం పెరిగి రూ.66,500 కోట్లకు చేరుకున్నది. 
  • కానీ, నికర వడ్డీ మార్జిన్‌ 3.24 శాతం నుంచి 3.01 శాతానికి తగ్గింది. 
  • బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 7.53 శాతం నుంచి 5.44 శాతానికి దిగిరాగా, నికర ఎన్‌పీఏ కూడా 3.07 శాతం నుంచి 1.8 శాతానికి తగ్గింది. 
  • మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్‌ రూ.9,420 కోట్ల నిధులను కేటాయించింది.     
  • ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో బ్యాంక్‌ షేరు ధర 2.63 శాతం లాభపడి రూ.191.45 వద్ద ముగిసింది.  


logo