బుధవారం 28 అక్టోబర్ 2020
Business - Sep 29, 2020 , 01:05:17

ఎస్బీఐ బంపర్‌ ఆఫర్‌

ఎస్బీఐ బంపర్‌ ఆఫర్‌

ముంబై: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారులకు తీపి కబురు అందించింది. రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రిటైల్‌ రుణ గ్రహీతలకు అనేక ఆఫర్లను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఎస్బీఐ మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌ యోనో (యూ ఓన్లీ నీడ్‌ వన్‌ యాప్‌) ద్వారా తీసుకునే వ్యక్తిగత, బంగారు, వాహన రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా అనుమతి పొందిన ప్రాజెక్టుల్లో ఇండ్లు కొనుగోలు చేయాలనుకునే వారికి గృహ రుణాలపై పూర్తిస్థాయిలో ప్రాసెసింగ్‌ ఫీజును తొలిగించింది. క్రెడిట్‌ స్కోరు, గృహ రుణ మొత్తం ఆధారంగా వినియోగదారులకు వడ్డీ రేటుపై 10 బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. యోనో యాప్‌ ద్వారా గృహ రుణాలు తీసుకునే వారికి వడ్డీపై మరో 5 బేసిస్‌ పాయింట్ల రాయితీ లభిస్తుందని పేర్కొన్నది. అలాగే కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి అతితక్కువ వడ్డీ రేటుతో రుణాలను అందజేయనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ వడ్డీ రేటు 7.5 శాతం నుంచి మొదలవుతుందని, ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై 100 శాతం ఆన్‌రోడ్‌ ఫైనాన్స్‌ సదుపాయాన్ని కల్పించనున్నామని స్పష్టం చేసింది. బంగారం తనఖాపై 7.5 శాతం వడ్డీ రేటుతో రుణాలను అందజేస్తున్న ఎస్బీఐ.. ఈ రుణాలను మూడేండ్లలో తిరిగి చెల్లించే అవకాశం కల్పిస్తున్నది. మరోవైపు వ్యక్తిగత రుణాలను 9.6 శాతం వడ్డీతో అందజేయనున్నట్టు ఎస్బీఐ తెలిపింది. 

యోనో వినియోగదార్లకు తొలి ప్రాధాన్యం..

కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నదని, ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యయం పెరుగుతుందని ఆశిస్తున్నామని ఎస్బీఐ రిటైల్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు ఎస్బీఐ చేయూతనిస్తుందన్నారు. యోనో యాప్‌ వినియోగదారులకు కారు, బంగారు రుణాల్లో తొలి ప్రాధాన్యమిస్తున్నామని, ఈ యాప్‌ ద్వారా ఖాతాదారులు ఇంటివద్ద నుంచే పేపర్‌లెస్‌ (కాగితరహిత) రుణాలను పొందవచ్చని ఆయన వివరించారు.logo