శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 01, 2021 , 02:03:05

ఆర్థిక లక్ష్యాల సాధనకు పొదుపు-మదుపు

ఆర్థిక లక్ష్యాల సాధనకు పొదుపు-మదుపు

జీవితంలో ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మనీ మేనేజ్‌మెంట్‌ వ్యూహాలను కాలానుగుణంగా రూపొందించుకోవడం, వాటిని తరచుగా సమీక్షించుకోవడం, అవసరమైతే ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవడం అవసరం. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రపంచ ఆలోచనా సరళిని, ఆర్థిక ప్రణాళికా ధృక్పథాన్నే మార్చేసింది. భవిష్యత్తును మనం నిర్దేశించలేం. కానీ ఇలాంటి అనిశ్చితుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి ముందుగానే చర్యలను తీసుకోవచ్చు. ఆపత్కాలంలో సహాయపడే మనీ మేనేజ్‌మెంట్‌ చిట్కాలను మనమిప్పుడు తెలుసుకుందాం.

పెట్టుబడులు పెట్టండి

సంపదను సృష్టించడంతోపాటు ఆర్థిక లక్ష్యాలను సకాలంలో సాధించడానికి పెట్టుబడులు కీలకం. సమయానుగుణ మదుపు నిర్ణయాలు.. మార్గనిర్దేశం చేయడంతోపాటు రాబడుల అంచనాలు, ఎంపిక చేసుకోవాల్సిన సాధనాలు, లిక్విడిటీ అవసరాల వంటి అంశాలపై లోతైన అవగాహన కల్పిస్తాయి. అయితే ఈ నిర్ణయాలకు ముందు లక్ష్యాలను నిర్దేశించుకోండి. పన్ను మినహాయింపులను గరిష్ఠంగా పొందడానికి తీసుకోవాల్సిన చర్యలు, సమీప భవిష్యత్తులో కొనాలనుకుంటున్న ఇంటి కోసం కొంత నిధిని సమకూర్చుకోవడం, రిటైర్మెంట్‌ నిధిని ఏర్పాటు చేసుకోవడం లాంటివన్నీ మదుపు ప్రయాణంలో తీసుకోవాల్సిన ప్రణాళికబద్దమైన నిర్ణయాలే. కాగా, మదుపు సాధనాలు ఎంచుకునేటప్పుడు మీరు తప్పనిసరిగా రిస్క్‌ భరించే స్థాయిని కూడా బేరీజు వేసుకోవాలి. 

సమీక్షలు అవసరం

మీ మదుపు సాధనాలను తరచుగా సమీక్షించుకోవడం వల్ల అవి మీ లక్ష్యాలకు అనుగుణంగా రాబడులను ఇస్తున్నాయా? లేదా? తెలుసుకోవచ్చు. గతేడాది చాలామంది ఆదాయాల్లో కోత పడటంతో మదుపు చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఒకవేళ ఇప్పుడు మీ ఆదాయాలు స్థిరపడినట్టయితే.. మళ్లీ మదుపు ప్రయాణాన్ని గాడిలో పెట్టండి. ఉదాహరణకు మీ మొత్తం పోర్టుఫోలియోలో డెట్‌ ఫండ్ల పనితీరు బాగా లేదనుకోండి. బంగారం, ఈక్విటీల వంటి సాధనాల్లో మదుపు చేయండి. 

పన్నుల నిర్వహణ

పన్ను ఆదా చేయడానికే మదుపు లేదా బీమా చేయకండి. చాలామంది కేవ లం పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి గుడ్డిగా ఇన్సూరెన్స్‌ పాలసీలను కొంటూ ఉంటారు. అలాగే పన్ను ఆదా కోసం కొన్ని మదుపులూ చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా మీరు కొనుగోలు చేసే సాధనాల్లో పన్నులను ఎంత సమర్థవంతంగా నియంత్రించగలమో అంచనా వేయండి. అలాగే ఎన్‌పీఎస్‌ పెట్టుబడులు కూడా ఆదాయం పన్ను మినహాయింపులను చాలానే ఇస్తాయి. కొత్త, పాత పన్ను నిబంధనలకు సంబంధించి మీరు తికమక పడుతున్నట్టయితే మీకో చిట్కా. మీ వార్షిక ఆదాయంలో 20 శాతం పన్ను ఆదా చేసే సాధనాల్లో మదుపు చేస్తున్నట్టయితే, పాత ఆదాయం పన్ను నిబంధనలను అనుసరించడం వల్లనే మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. 

అత్యవసర నిధిని పెంచుకోండి

అత్యవసర సమయంలో మొదటగా ఆదుకునేది పొదుపే. కొవిడ్‌-19 కారణంగా గతేడాది అనేక మంది ఆదాయ మార్గాలను కోల్పోయారు. అయితే అత్యవసర నిధి ఉన్నవారు నెట్టుకు రాగలిగారు.  ఒకవేళ మీకు ఇప్పటివరకు అలాంటి నిధి అంటూ లేకపోతే వెంటనే ప్రారంభించండి. ఆపద సమయంలో మిమ్మల్ని, మీ మీద ఆధారపడిన వారికి అదే ఆసరా. కనీసం మూడు నుంచి ఆరు నెలలకు సరిపడేలా ఈ నిధి ఉండాలి. అందుకోసం సరదా ఖర్చులను తగ్గించుకుని పొదుపు ప్రణాళికను రూపొందించుకోవాలి.

ఆరోగ్య, జీవిత బీమాలు తీసుకోండి

ఆర్థికంగా సవాళ్లు ఎదురవుతున్న కాలంలో అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొవలసి వస్తే మానసికంగా మరింత కుంగిపోవాల్సి వస్తుంది. అసలే హాస్పిటల్‌ ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. అందుకని మీ కుటుంబం కోసం రూ.5-10 లక్షల కవరేజీతో సమగ్ర వైద్య బీమా పాలసీని తీసుకోవడం ఉత్తమం. టాప్‌ అప్‌, సూపర్‌ టాప్‌ అప్‌లతో బీమా కవరేజిని మరింతగా పెంచుకోవచ్చు కూడా. మీరు పనిచేసే కంపెనీ గ్రూపు ఆరోగ్య బీమాకు అదనంగా ఓ వ్యక్తిగత ఆరోగ్య బీమా ఉండటం ఎంతైనా బెటర్‌. అలాగే అవాంఛనీయ ఘటనలు జరిగితే మీ మీద ఆధారపడినవారు అనాథలైపోతారు. కాబట్టి జీవిత బీమా అవసరం ఎంతో ఉన్నది. మీ వయసు ఎక్కువయ్యే కొద్దీ ప్రీమియంలు పెరుగుతూ ఉంటాయి. తక్కువ వయసులో ఉన్నప్పుడే బీమా కవరేజి తీసుకుంటే లాభదాయకం.

రుణాల భారం నియంత్రణ

క్రెడిట్‌ కార్డులను విచ్చలవిడిగా వినియోగిస్తే అధిక వడ్డీ భారం తలమీదకొస్తుంది. మీ క్రెడిట్‌ స్కోరూ దెబ్బతింటుంది. నికర ఆదాయంలో 40 శాతానికి మించకుండా అప్పులుండాలి. ఆదాయం పెరుగుతుందన్న అంచనాలతో చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయన్న విషయాన్ని మరిచిపోతారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఇక అధిక వడ్డీ రుణాలను వదిలించుకోండి. అన్‌ సెక్యూర్డ్‌ రుణాలు, వ్యక్తిగత రుణాలను త్వరగా తీర్చేయండి. ఆ తర్వాత గోల్డ్‌ లోన్‌, ఆటో లోన్లను చెల్లించండి. 

VIDEOS

logo