బుధవారం 03 జూన్ 2020
Business - Apr 28, 2020 , 23:55:38

చైనాకు ఎగుమతులపై ఆంక్షలు

చైనాకు ఎగుమతులపై ఆంక్షలు

  • కొత్త నిబంధనల్ని తెచ్చిన అమెరికా

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 28: అమెరికా నుంచి చైనాకు జరుగుతున్న ఎగుమతులపై ట్రంప్‌ సర్కారు మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా సివిల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ విడిభాగాలు, సెమీకండక్టర్లకు సంబంధించిన ఉత్పత్తుల ఎగుమతిపై నిఘా పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం చైనాలోని సైనిక సంస్థలకు ఈ ఉత్పత్తులను అమ్మాలనుకుంటే అమెరికా సంస్థలు ప్రభుత్వం నుంచి లైసెన్సులు పొందాల్సిందే. ఒకవేళ ఈ ఉత్పత్తులను సైనిక అవసరాలకు కాకుండా పౌర అవసరాల కోసం విక్రయించినా అనుమతులు తప్పనిసరి.

 ‘సైనిక అవసరాల కోసం అమెరికా సంస్థల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను దుర్వినియోగం చేసిన చరిత్రలున్న దేశాలతో వ్యాపార సంబంధాలను నిశితంగా గమనించాల్సిన అవసరం చాలా ఉన్నది’ అని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్‌ రాస్‌ మంగళవారం ఓ ప్రకటనలో అన్నారు. చైనా, రష్యా, వెనిజులాల్లోని కొన్ని సంస్థలు అమెరికా ప్రయోజనాలకు ముప్పు తెచ్చేలా నడుచుకుంటున్నాయని, అందుకే అమెరికా టెక్నాలజీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కాగా, అమెరికాలోని విదేశీ సంస్థలు సైతం సదరు ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేయాలంటే తమతమ దేశాల అనుమతులతోపాటు అమెరికా అనుమతి కూడా తప్పనిసరి చేసే యోచనలో ఉన్నట్లు ఈ సందర్భంగా రాస్‌ తెలియజేశారు. 


logo