గురువారం 26 నవంబర్ 2020
Business - Oct 06, 2020 , 15:44:08

డిసెంబర్‌ కల్లా టీవీ సెట్ల తయారీ ప్రారంభించనున్న శామ్‌సంగ్‌

డిసెంబర్‌ కల్లా టీవీ సెట్ల తయారీ ప్రారంభించనున్న శామ్‌సంగ్‌

న్యూఢిల్లీ : మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహకరంగా శామ్‌సంగ్ ఇండియా వచ్చే డిసెంబర్ కల్లా టీవీ సెట్ల స్థానిక తయారీని ప్రారంభించనున్నది. పండుగ సీజన్లో 'వ్యాపార కొనసాగింపు' కొరకు వచ్చే డిసెంబర్ వరకు టీవీ సెట్లను దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి గత నెల 28న సదరు సంస్థ ఒక లేఖ రాసింది. ఇక్కడ ప్రస్తావించదగిన విషయం ఏమిటంటే, చైనా నుంచి దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు, స్థానిక తయారీని పెంచే వ్యూహంలో భాగంగా జూలై 30 న కేంద్ర ప్రభుత్వం 20 సంవత్సరాలలో మొదటిసారిగా టెలివిజన్ సెట్లను పరిమితం చేయబడిన దిగుమతుల జాబితాలో ఉంచింది. కంపెనీలకు ఇప్పుడు టీవీ సెట్లను దిగుమతి చేసుకోవడానికి లైసెన్సులు అవసరం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అలాంటి అనుమతి ఇవ్వలేదు.

" 2020 డిసెంబర్ నాటికి టీవీ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నందున, సున్నితమైన కార్యకలాపాలు, వ్యాపార కొనసాగింపు కోసం అప్పటివరకు టీవీ సెట్లను దిగుమతి చేసుకునేందుకు  అనుమతించాలని అభ్యర్థిస్తున్నాం" అని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు రాసిన లేఖలో శామ్‌సంగ్ సంస్థ విజ్ఞప్తిచేసింది. ప్రధానమంత్రి కార్యాలయంతోపాటు ఫారిన్ ట్రేడ్ డైరెక్టరేట్ జనరల్‌కు కూడా లేఖ రాసినట్లు తెలుస్తున్నది. గతంలో చెన్నైలో తయారీ కర్మాగారాన్ని కలిగి ఉన్న శామ్‌సంగ్‌.. ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానెళ్లపై ప్రభుత్వం దిగుమతి సుంకాలను విధించిన తరువాత 2018 లో దానిని మూసివేసింది. ఇది మొత్తం ఉత్పాదక వ్యయంలో 65-70 శాతం వాటాను కలిగి ఉంది. భారతదేశంలో టీవీలను తయారు చేయడం ఖరీదైనందున కొరియా సంస్థ వియత్నాం నుంచి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద మార్గం ద్వారా సున్నా సుంకం వద్ద టెలివిజన్లను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. శామ్‌సంగ్‌ సంస్థ తన టెలివిజన్ ప్లాంటును చెన్నైలో తిరిగి స్థాపించనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలిపారు.