ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 24, 2020 , 02:21:32

‘రెరా’ దరఖాస్తులకు మోక్షం

‘రెరా’ దరఖాస్తులకు మోక్షం

  • మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో పెండింగ్‌ ఫైల్స్‌ క్లియర్‌
  • ఇక కొత్త నిర్మాణాలు షురూ.. కూలీలకు ఉపాధి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గత కొంత కాలంగా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు మోక్షం లభించింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో అథారిటీ ఈ దరఖాస్తులను క్లియర్‌ చేసింది. దరఖాస్తులకు రెరా అనుమతులు రావడంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక పట్టణాలలో భవన నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. కాగా, కరోనా కష్ట కాలంలో నిర్మాణ రంగ పనులు మొదలైతే అనేక మందికి ఉపాధి లభించనున్నది. 

తెలంగాణలో భవన నిర్మాణ రంగాన్ని పోత్సహించే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో అక్రమ కట్టడాలపైనా ఉక్కుపాదం మోపింది. ప్రతి ఒక్కరు రెరా అనుమతులు తీసుకునే విధంగా అవగాహన కలిగించింది. మరోవైపు భవన నిర్మాణదారులు కూడా ఏవైనా సమస్యలుంటే నేరుగా మంత్రి కేటీఆర్‌ దృష్టికే తీసుకెళ్తున్నారు. ఆయన వెంటనే మాట్లాడి ఆయా సమస్యలను చట్టం పరిధిలో పరిష్కరిస్తున్నారు. కరోనా సమస్య వచ్చిన తరువాత దేశమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లారు. దీంతో భవన నిర్మాణ పనులన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. కొత్త భవన నిర్మాణాలకు రెరా అనుమతుల కోసం దరఖాస్తులు చేశారు. 

అధికారులు కొవిడ్‌-19 నివారణ పనులపై దృష్టి సారించిన నేపథ్యంలో ఈ దరఖాస్తుల పరిశీలనే లేకుండా పోయింది. దీంతో లాక్‌డౌన్‌కు ముందు చేసుకున్న దరఖాస్తులు దాదాపు వంద వరకు రెరా వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అయితే అన్‌లాక్‌ సీజన్‌ మొదలవడంతో భవన నిర్మాణదారులు ఈ మధ్య కాలంలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రెరా వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్‌ చేస్తే కొత్త నిర్మాణాలు చేపడుతామని, ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌.. అన్ని నిబంధనలను పాటించిన దరఖాస్తులను వెంటనే క్లియర్‌ చేయలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో అనుమతులు మంజూరయ్యాయి. ఇలా దాదాపు వంద వరకు దరఖాస్తులు క్లియర్‌ అయినట్లు సమాచారం.


logo