బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jul 08, 2020 , 02:11:02

ఐసీఐసీఐలో జీతాల పెంపు

ఐసీఐసీఐలో జీతాల పెంపు

న్యూఢిల్లీ, జూలై 7: కరోనా సంక్షోభం పేరుతో ఉద్యోగుల జీతాలకు కంపెనీలు కోత పెడుతున్న నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాత్రం తమ సిబ్బంది జీతాలను పెంచాలని నిర్ణయించింది. ప్రాణాంతక వైరస్‌ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులను బ్యాంక్‌ ప్రోత్సహించాలనుకున్నది. అందుకే 80వేలకుపైగా ఉద్యోగుల వేతనాలను 8 శాతం వరకు పెంచుతున్నట్లు మంగళవారం సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. బ్యాంక్‌ మొత్తం సిబ్బందిలో ఈ ఉద్యోగులు 80 శాతానికిపైనేనని పీటీఐకి సదరు వర్గాలు తెలిపాయి. ఎం1 అంతకంటే తక్కువ శ్రేణిలోని ఉద్యోగులకు ఈ పెంపు ఉంటుందని తెలుస్తున్నది. వీరంతా బ్యాంక్‌ శాఖల్లో రోజూ పనిచేసేవారే. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను తీసుకున్న ఈ నిర్ణయం ఈ నెల నుంచే వర్తిస్తుందని సమాచారం. అయితే దీనిపై బ్యాంక్‌ను సంప్రదించినప్పటికీ ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. 


logo