శుక్రవారం 10 జూలై 2020
Business - Jun 03, 2020 , 23:56:40

జీతాల్లో కోతలు

జీతాల్లో కోతలు

  • 50 శాతం వరకు తగ్గిస్తున్న అమర రాజా, జీవీకే

హైదరాబాద్‌, జూన్‌ 3: కరోనా సెగతో కార్పొరేట్‌ సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోగా..తాజాగా ఉద్యోగుల జీతాలపై దృష్టి సారించాయి. ఇప్పటికే జీఎమ్మార్‌ ఏకంగా 50 శాతం వరకు వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా అమర రాజా గ్రూపు, జీవీకేలు కూడా 50 శాతం వరకు తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించాయి. బ్యాటరీల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన అమర రాజా గ్రూపు.. జూనియర్‌, సీనియర్‌ స్థాయి సిబ్బంది వేతనాలను 10 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 31 నాటికి సంస్థలో 7,541 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వీరికి ప్రతియేటా రూ.345.23 కోట్లను జీతాల రూపంలో చెల్లిస్తున్నది. ప్రస్తుతేడాది ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పరిహారం చెల్లింపులు లేవని స్పష్టం చేసింది.

 మరో సంస్థ జీవీకే గ్రూపు కూడా 30 శాతం జీతాల్లో కోత విధించింది. ఈ కోత మే నెల నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా గడిచిన మూడు నెలలుగా వ్యాపార రంగం మూతపడటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల లోపు వార్షిక వేతనాన్ని అందుకుంటున్న సిబ్బంది జీతాల్లో 10 శాతం కోత విధించిన సంస్థ.. రూ.25 లక్షలపైగా జీతం అందుకుంటున్న వారికి 20 శాతం తగ్గించింది. వీరితోపాటు సీనియర్‌, మేనేజ్‌మెంట్‌ స్థాయి ఉద్యోగుల జీతాల్లో కూడా 30 శాతం తగ్గించింది.


logo