గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 28, 2020 , 23:35:45

6 నెలల కనిష్ఠానికి రూపాయి

6 నెలల కనిష్ఠానికి రూపాయి
  • 63 పైసలు పడిపోయిన మారకం

ముంబై, ఫిబ్రవరి 28: దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. స్టాక్‌ మార్కెట్ల భారీ పతనంతో మారకం విలువ ఆరు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఈక్విటీ మార్కెట్లు కుదేలవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో రూపాయి కరెన్సీ వరుసగా ఆరో రోజు 63 పైసలు పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ  72.24 వద్ద నిలిచింది. 71.90 వద్ద ప్రారంభమైన కరెన్సీ విలువ ఇంట్రాడేలో 72.29 కనిష్ఠ స్థాయిని తాకింది. సెప్టెంబర్‌ 13, 2019 తర్వాత రూపాయికి ఇదే భారీ పతనం. కరోనా వైరస్‌ భయాలు ఫారెక్స్‌ మార్కెట్లకు చుట్టుకున్నాయని, ఫలితంగా దేశీయ కరెన్సీతోపాటు ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని ఫారెక్స్‌ డీలర్‌ వెల్లడించారు. దేశీయ క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.1,428.74 కోట్ల పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్నారు. 


476 బిలియన్‌ డాలర్లకు ఫారెక్స్‌ రిజర్వులు

విదేశీ మారకం నిల్వలు స్వల్పంగా పెరిగాయి. ఈ నెల 21తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్‌ రిజర్వులు 29 మిలియన్‌ డాలర్లు పెరిగి రికార్డు స్థాయి 476.122 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. అంతక్రితం వారంలో రిజర్వులు 3 బిలియన్‌ డాలర్లు పెరిగి 476.092 బిలియన్‌ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తులు మాత్రం 490 మిలియన్‌ డాలర్లు తగ్గి 441.458 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనప్పటికీ రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం. వరుసగా రెండోవారం గోల్డ్‌ రిజర్వులు 539 మిలియన్‌ డాలర్లు ఎగబాకి 29.662 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 


logo
>>>>>>