సోమవారం 01 జూన్ 2020
Business - Apr 16, 2020 , 00:45:48

రూపాయి విలవిల

రూపాయి విలవిల

  • చారిత్రక కనిష్ఠానికి మారకం
  • 17 పైసలు క్షీణించి 76.44కు 

ముంబై, ఏప్రిల్‌ 15: రూపాయి విలువ క్రమంగా పడిపోతున్నది. రోజుకొక కనిష్ఠ స్థాయికి జారుకుంటున్న మారకం విలువ బుధవారం చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్‌ పెరుగడం, దేశీయ స్టాక్‌ మార్కెట్లు కుదేలవడం కరెన్సీ పతనానికి ఆజ్యంపోశాయి.  ప్రారంభంలో భారీగా లాభపడిన దేశీయ కరెన్సీ విలువ చివరకు డాలర్‌తో పోలిస్తే 17 పైసలు క్షీణించి 76.44కి జారుకున్నది. కరోనా వైరస్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలనున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీల హెచ్చరికలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. 76.07 వద్ద ప్రారంభమైన మారకం విలువ ఒక దశలో 75.99 గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 17 పైసలు పతనం చెంది 76.48 వద్ద ముగిసింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి   లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫారెక్స్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపిందని ఫారెక్స్‌ డీలర్‌ వెల్లడించారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 3.72 శాతం తగ్గి 28.50 డాలర్లకు పడిపోయింది. 


logo