ముంబై, జూలై 9: దేశంలో విదేశీ మారకం నిల్వలు కొత్త రికార్డు స్థాయికి పెరిగాయి. జూలై 2తో ముగిసిన వారంలో అంతక్రితం వారంకంటే 1 బిలియన్ డాలర్ల మేర పెరిగి 610 బిలియన్ డాలర్లకు చేరినట్లు శుక్రవారం ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. జూన్ 25తో ముగిసిన వారంలో ఇవి 609 బిలియన్ డాలర్లు. మొత్తం రిజర్వుల్లో అధికంగా ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తులు.. సమీక్షా వారంలో 74.8 కోట్ల డాలర్ల మేర పెరిగి 566.99 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వ లు 7.6 కోట్ల డాలర్ల వరకు పెరిగి 36.37 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్లు) 4.9 కోట్ల డాలర్ల మేర వృద్ధి చెంది 1.55 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఐఎంఎఫ్ వద్ద ఉంచే రిజర్వులు 13.9 కోట్ల డాలర్ల వరకు పెరిగి 5.11 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.