సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 18, 2020 , 03:14:27

ఆరేండ్లలో 5.5 లక్షల కోట్లు రుణాల మాఫీ

ఆరేండ్లలో 5.5 లక్షల కోట్లు రుణాల మాఫీ

aన్యూఢిల్లీ, జూలై 17: సామాన్యుడి రుణాన్ని ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులు కార్పొరేట్లకు ఇచ్చిన రుణాలను మాత్రం గాలికివదిలేస్తున్నాయి. దీంతో నిరర్థక ఆస్తులు భారీగా పెరుగడంతో ఆయా బ్యాంకులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇచ్చిన రుణాలు వసూలు కాకపోవడంతో ఆయా బ్యాంకులు వీటిని రద్దుచేస్తున్నాయి. గడిచిన ఆరేండ్లలో ఏకంగా రూ.5.5 లక్షల కోట్ల మొండి బకాయిలను రైటాఫ్‌ చేసినట్లు తాజాగా ఒక నివేదిక బహిర్గతమైంది.  రద్దుచేసిన వాటిలో అత్యధికంగా కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన రుణాలే ఉండటం గమనార్హం.  గత ఆరేండ్లలో (2019 వరకు) పీఎస్‌బీలు రూ.5,48,734 కోట్ల మొండి బకాయిలను రద్దుసినట్టు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) వెల్లడించింది. అంతక్రితం ఇదే సమయంలో రద్దుచేసిన వాటితో పోలిస్తే ఇవి ఆరు రెట్లు అధికం. 

మోదీ హాయంలోనే అత్యధికం..

నరేంద్ర మోదీ హాయంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు లక్షలాది కోట్ల రుణాలను మాఫీ చేశాయి. 2008 నుంచి 2013 మధ్యకాలంలో రూ.86,528 కోట్ల రుణాలను రద్దు చేసిన బ్యాంకులు.. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గతేడాది చివరి వరకు ఏకంగా రూ. 5.50 లక్షల కోట్ల రుణాలను రద్దుచేశాయి. రిజర్వు బ్యాంక్‌, సభ్యుల బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ గణాంకాలను రూపొందిం చామని ఏఐబీఈఏ జనరల్‌ కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు. బ్యాంకులు రద్దు చేస్తున్న రుణాలు ఏటేటా పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. 2001 నుంచి 2009 మధ్యకాలంలో రూ.73,760 కోట్లను రద్దుచేసిన బ్యాంకులు.. ఆ మరుసటి దశాబ్దంలో రూ.6.2 లక్షల కోట్లు రద్దుచేశాయి. 

ఎస్బీఐదే అగ్రస్థానం 

మొండి బకాయిలను రద్దుచేసిన వాటిలో బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ అగ్రస్థానంలో ఉన్నది. గడిచిన నాలుగేండ్లలో బ్యాంక్‌ రూ.1.79 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది. గత ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా రూ.52,387 కోట్లను రద్దు చేసింది. ఈ విషయాన్ని బ్యాంక్‌ వార్షిక నివేదికలోనే వెల్లడించింది. అంతక్రితం ఏడాదిలో రూ.58,905 కోట్లు, 2017-18లో రూ.40,196 కోట్లను ఎస్బీఐ రద్దు చేసింది. 


logo