సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Feb 25, 2020 , 00:17:31

డిజిటల్‌ సొసైటీగా భారత్‌

డిజిటల్‌ సొసైటీగా భారత్‌
  • ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ

ముంబై, ఫిబ్రవరి 24: భారత్‌ ప్రీమియం డిజిటల్‌ సొసైటీగా అవతరించే దశలో ఉన్నదని ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ అన్నారు. ప్రపంచ దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసుకుంటున్న భారత్‌..వచ్చే దశాబ్దకాలంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించనున్నదన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తంచేశారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్లతో కలిసి పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మొబైల్‌ నెట్‌వర్క్‌ విపరీతంగా పెరుగడంతోపాటు గతంలో ఎన్నడూ చూడనంత వేగంగా విస్తరిస్తున్నదన్నారు.


ప్రపంచంలో ఎక్కడ లేనంతగా భారత్‌లో మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలు భారీగా విస్తరిస్తున్నాయనడంలో ఎలాంటి అనుమానాలు లేవని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంతో భారత్‌ ప్రీమియం డిజిటల్‌ సొసైటీగా మారబోతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ మూడో అతిపెద్దగా అవతరించడంలో ఎలాంటి అనుమానాలు లేవని, అయితే ఐదేండ్లు లేదా పదేండ్లు పట్టవచ్చు కానీ, ఈ లక్ష్యానికి చేరుకోవడం తథ్యం అని ముకేశ్‌ అన్నారు. గతేడాదికిగాను భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాల ఆర్థిక వ్యవస్థను దాటేసిన  భారత్‌..అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీల తర్వాత కొనసాగుతున్నది. 


3 లక్షల కోట్ల డాలర్లకు

1992లో నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌లో చేరినప్పుడు 300 బిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ..ప్రస్తుతం 3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నదని ముకేశ్‌ అంబానీ అన్నారు. ఆర్థిక మూలాలు దృడంగా ఉన్నాయని, టెక్నాలజీ రంగం కూడా అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, ముఖ్యంగా టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లు ప్రపంచ టెలికం రంగంలో చెరగని ముద్రవేశాయన్నారు.  జియో టెలికం సేవలు ఆరంభించకుముందు 256 కేబీపీఎస్‌లుగా ఉన్న ఇంటర్నెట్‌ వేగం ప్రస్తుతం 21 ఎంబీపీఎస్‌కు చేరుకున్నదని చెప్పారు. అలాగే గతంలో జీబీకి అయ్యే ఖర్చు రూ.300 నుంచి 500 మధ్యలో ఉండగా, ప్రస్తుతం ఆది రూ.12-14 మధ్యలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఒక దశలో ఒక్క జీబీ డాటాకు రూ.10,000 చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనపై ఆయన స్పందిస్తూ..2020లో ట్రంప్‌ చూసే భారతదేశం గతంలో కార్టర్‌, బిల్‌ క్లింటన్‌, బరాక్‌ ఒబామాలు చూసినదానికంటే విభిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. 


వెయ్యి రూపాయలతో స్టార్టప్‌

తన తండ్రి ధీరుభాయ్‌ అంబానీ 50 ఏండ్ల క్రితం రూ.1,000 మూలధనంతో రిలయన్స్‌ను ప్రారంభించిన విషయాన్ని ముకేశ్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రారంభంలో చిన్న స్థాయి సంస్థగా ఆరంభమైన రిలయన్స్‌.. ఆ తర్వాతి క్రమంలో చిన్న స్థాయి నుంచి అతిపెద్ద సంస్థగా అవతరించింది. 


సొంత సాంకేతిక పరిజ్ఞానం పెరగాలి: నాదెళ్ల

భారతీయ సంస్థలు సొంత సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా సోమవారం ముంబైలో ఏర్పాటు చేసిన మైక్రోసాఫ్ట్‌ ఫ్యూచర్‌ డీకోడెడ్‌ సీఈవో సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశీయ కార్పొరేట్‌ సీఈవోలనుద్దేశించి మాట్లాడుతూ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించాలని పిలుపునిచ్చారు. గడిచిన దశాబ్దంలో మొబైల్‌ ఆధారిత టెక్నాలజీల రాకను చూశామన్న ఆయన వీటిని కొందరే అందిపుచ్చుకోగలిగారన్నారు. సాంకేతిక మార్పులను వీలైనంత త్వరగా అందిపుచ్చుకోవాలని, టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.


సైబర్‌ సెక్యూరిటీ సమస్యలను ఆయా సంస్థలు ఎక్కువగా ఎదుర్కొంటున్నాయని, దీనివల్ల లక్ష కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతున్నదని చెప్పారు. ఇది ఉపేక్షించదగినది కాదన్నారు. ఇదిలావుంటే దివ్యాంగులు ఉద్యోగాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌-ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ చేతులు కలిపాయి. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ఇరు సంస్థలు ముందుకొచ్చాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో ఉద్యోగాలు వచ్చేలా సహకరించనున్నాయి. తొలి ఏడాది 500లకుపైగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు.


logo