బుధవారం 03 జూన్ 2020
Business - Mar 31, 2020 , 00:40:21

రిలయన్స్‌ 500 కోట్లు

రిలయన్స్‌ 500 కోట్లు

  • రూ.150 కోట్లు ప్రకటించిన ఎల్‌అండ్‌టీ.. 
  • రూ.100 కోట్లిస్తున్న హీరో గ్రూప్‌
  • పీఎం-కేర్స్‌ ఫండ్‌కు కార్పొరేట్ల విరాళాలు

న్యూఢిల్లీ, మార్చి 30: కరోనా బారినపడ్డ భారతావనిని ఆదుకునేందుకు కార్పొరేట్లు కదిలారు. పీఎం-కేర్స్‌ ఫండ్‌కు పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ముకేశ్‌ అంబానీ సోమవారం రూ.500 కోట్లు ప్రకటించారు. మహారాష్ట్ర, గుజరాత్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్స్‌కు కూడా రూ.5 కోట్ల చొప్పున విరాళాలు ఇస్తున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ తెలియజేసింది. ఇప్పటికే 100 పడకల కరోనా దవాఖానను ఏర్పాటు చేసిన రిలయన్స్‌.. హెల్త్‌ వర్కర్ల కోసం రోజుకు లక్ష మాస్కులను తయారు చేయిస్తున్నది. ఎమర్జెన్సీ సర్వీసులకు ఉచితంగా ఇంధనాన్నీ అందిస్తున్నామని సంస్థ తెలిపింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు నిత్యావసరాలను సమకూరుస్తున్నట్లు చెప్పింది. మరోవైపు ఎల్‌అండ్‌టీ సోమవారం రూ.150 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. 

లాక్‌డౌన్‌ కారణంగా రోడ్డునపడ్డ దాదాపు 1.60 లక్షల కాంట్రాక్టు కార్మికులకు అండగా నిలుస్తున్నామని, నెలకు రూ.500 కోట్లకుపైగా ఖర్చుచేసి ఆహార, ఇతర సదుపాయాల్ని కల్పిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో గ్రూప్‌ సైతం రూ.100 కోట్ల సాయం తో ముందుకొచ్చింది. పీఎం-కేర్స్‌ ఫండ్‌కు రూ.50 కోట్లను విరాళంగా ప్రకటించింది. మరో రూ.50 కోట్లతో సహాయక చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. అలాగే హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) రూ.26.25 కోట్లను, టీవీఎస్‌ మోటర్‌, పతంజలి రూ.25 కోట్ల చొప్పున పీఎం-కేర్స్‌ ఫండ్‌కు ఇస్తున్నట్లు తెలిపాయి. ఐదు రాష్ర్టా ల్లో 1,500 పడకలతో 5 క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పతంజలి ప్రకటించింది. ఉద్యోగుల వేతనాల ద్వారా రూ.1.50 కోట్లను విరాళంగా ఇస్తున్నామన్నది. ఐఐఎఫ్‌ఎల్‌ గ్రూప్‌ సైతం రూ.5 కోట్ల విరాళాన్ని పీఎం-కేర్స్‌ ఫండ్‌కు ఇస్తున్నది.


logo