సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 15, 2020 , 14:47:59

'జియో'‌లో గూగుల్‌ రూ.33,737 కోట్ల పెట్టుబడి

'జియో'‌లో గూగుల్‌  రూ.33,737 కోట్ల పెట్టుబడి

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో  టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌  33,737 కోట్ల పెట్టుబడి పెట్టనుందని సంస్థ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు.  జియో ప్లాట్‌ఫామ్స్‌లో  7.7శాతం వాటాను గూగుల్‌ కొనుగోలు చేయనుందని ప్రకటించారు.   జియో వ్యూహాత్మక భాగస్వామిగా గూగుల్‌ కొనసాగుతుందని చెప్పారు.    రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారుల 43వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) బుధవారం జరిగింది. ఏజీఎం నిర్ణయాలను  ముకేశ్‌ ప్రకటించారు.   

కరోనా నేపథ్యంలో తొలిసారిగా రిలయన్స్‌ వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహించింది.   ఫేస్‌బుక్‌, ఇంటెల్‌, క్వాల్‌కామ్‌ తదితర టెక్నాలజీ కంపెనీలతో  పాటు పలు అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు,  వెంచర్‌ ఫండ్స్‌ జియోలో వాటాలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 

రిలయన్స్‌లోకి రూ.2.12 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు వచ్చినట్లు ముకేశ్‌ వెల్లడించారు. పెట్టుబడుల సమీకరణ  లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నామని చెప్పారు.  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అభివృద్ధిలో దూసుకుపోతోందని ముకేశ్‌ అన్నారు. దేశంలోనే అత్యధికంగా జీఎస్టీ చెల్లించామన్నారు.  వాటాదారులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువుకు ముందే రుణ రహిత కంపెనీగా మార్చామని వివరించారు. టెలికాం రంగంలో ప్రపంచంలోనే నెంబర్‌ 2గా జియో నిలిచిందన్నారు. 


logo