ఆదివారం 07 మార్చి 2021
Business - Dec 29, 2020 , 00:42:55

లాక్‌డౌన్‌ సడలించినా నో ‘చిల్లర’ బిజినెస్‌

లాక్‌డౌన్‌ సడలించినా నో ‘చిల్లర’ బిజినెస్‌

న్యూఢిల్లీ: కరోనాను నియంత్రించడానికి విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు కొన్ని నెలలుగా సడలిస్తూ వస్తున్నా, పండుగల సీజన్‌ అయినా నవంబర్‌ నెలలో రిటైల్ బిజినెస్‌ పెద్దగా పుంజుకోలేదు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 13 శాతం డిమాండ్‌ పడిపోయింది. 2019 కంటే ఈ ఏడాది కన్జూమర్‌ డ్యూరబుల్స్‌, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌, ఫుడ్‌, గ్రాసరీ విక్రయాలు సానుకూలంగా పెరిగాయని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ) నిర్వహించిన రిటైల్‌ బిజినెస్‌ సర్వే నిర్ధారించింది. 

కన్జూమర్‌ డ్యూరబుల్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువుల కొనుగోళ్లు గతేడాదితో పోలిస్తే 12శాతం పెరిగాయి. వర్క్‌ ఫ్రం హోం, స్టడీ ఫ్రం హోం సంస్కృతి అమలులోకి రావడంతో ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలకు డిమాండ్‌ పెరిగింది. గత నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది ఫుడ్‌, గ్రాసరీ సెగ్మెంట్‌ విక్రయాల్లో 5 శాతం వృద్ధిరేటు నమోదైంది. 

ఇక అప్పారెల్‌ అండ్‌ క్లాథింగ్‌ సెగ్మెంట్‌ ఒత్తిడికి గురవుతున్నది. గతేడాది అక్టోబర్‌ నెలతో పోలిస్తే రికవరీ మెరుగైంది. అక్టోబర్‌ నెలలో 30  శాతం విక్రయాలు పడిపోతే, నవంబర్‌లో 12 శాతానికి పరిమితమైంది. పశ్చిమ, తూర్పు భారత్‌ ప్రాంతాల్లో వివిధ వస్తువుల విక్రయాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. పశ్చిమ భారత్‌లో 18 శాతం.. తూర్పు భారత రాష్ట్రాల్లో 17 శాతం విక్రయాలు మాత్రమే జరిగాయి. ఉత్తర, భారత భారత ప్రాంతాల్లో విక్రయాలు సానుకూలంగా ఉన్నాయి. 

ఫెస్టివ్‌ సీజన్‌, పెండ్లిళ్ల వల్ల కొన్ని విభాగాల్లో రికవరీ మెరుగైనా, ఎన్నారైల ప్రయాణాలపై నిషేధం అమలులో ఉండటం వల్ల ఈ శీతాకాలంలో విక్రయాల్లో ప్రతికూలత నెలకొందని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో కుమార్‌ రాజగోపాలన్‌ అభిప్రాయ పడ్డారు. అయితే వచ్చే ఆరు నెలల్లో 85 శాతం కరోనాకు ముందు నాటి పరిస్థితులకు బిజినెస్‌ లావాదేవీలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కరోనా నూతన స్ట్రెయిన్‌ వెలుగు చూడడంతో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం వల్ల రిటైల్‌ బిజినెస్‌పై ప్రతికూల ప్రభావం కొనసాగుతుందని రాజగోపాలన్‌ పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo