ఎల్ఐసీ జీవన్ శాంతి పాలసీతో నెలకు 4 లక్షల పెన్షన్

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) అంటేనే భరోసా. దేశంలోని కోట్లాదిమంది విశ్వసనీయతను ఈ కంపెనీ చూరగొన్నది. ఇందుకు ప్రభుత్వ రంగ సంస్థ కావడం కూడా ఓ కారణమే. తమ కష్టార్జితం పూర్తి భద్రంగా ఉంటుందన్న నమ్మకం.. సమాజంలోని ఎన్నో వర్గాల ప్రజలను ఎల్ఐసీలో మదుపు చేయిస్తున్నది.
ఎల్ఐసీ అనేక పథకాలతో కస్టమర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నది. ఎండోమెంట్, టర్మ్, హెల్త్, జీవిత బీమా, చైల్డ్ ప్లాన్ తదితర ఎన్నో స్కీమ్లను ఎల్ఐసీ విక్రయిస్తున్నది. ఈ క్రమంలోనే జీవన్ శాంతి పెన్షన్ పాలసీలో నెలకు రూ.4 లక్షలకుపైగా పెన్షన్ వచ్చే సౌకర్యాన్నీ అందిస్తున్నది. పాలసీదారు జీవించి ఉన్నంత వరకూ వస్తుంది. ఉద్యోగస్తుల్లో ఎంతో మంది తమ ఉద్యోగానంతర జీవితంపై బెంగ పెట్టుకుంటుంటారు. అలాంటి వారి కోసమే ఎల్ఐసీ ఈ జీవన్ శాంతి పెన్షన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీలో ఉన్న ప్రధాన వెసులుబాటు ఏమిటంటే పాలసీదారులు వెంటనే పెన్షన్ ప్రయోజనాలను అందుకోవచ్చు. ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించినట్లయితే నెలనెలా నిర్ణీత మొత్తాన్ని పెన్షన్ రూపంలో పొందవచ్చు. పాలసీ కాలం పూర్తయ్యాక పాలసీదారులు చెల్లించినదంతా కూడా తిరిగి అందుకునే సదుపాయం ఉన్నది.
వివిధ పద్ధతుల్లో మదుపు
జీవన్ శాంతి పాలసీలో పెన్షన్ కోసం పాలసీదారులు పలు రకాల విధానాలను ఎంచుకోవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేశాక వెంటనే నెలసరి పెన్షన్ పద్ధతిని ఎంచుకోవచ్చు. అలాకాకుండా 5, 10, 15, 20 ఏండ్ల తర్వాత నుంచి కూడా పెన్షన్ చెల్లింపులను పెట్టుకోవచ్చు. మొత్తం 12 రకాల వరకు ఆప్షన్లున్నాయి. అయితే పాలసీదారునికి 79 ఏండ్లు మించరాదు. కనిష్ఠంగా 30 ఏండ్లు, గరిష్ఠంగా 85 ఏండ్ల మధ్య వయసున్నవారు ఈ పెన్షన్ పాలసీకి అర్హులు. కనీసం రూ.1.50 లక్షలతో పాలసీ మొదలవుతుంది. గరిష్ఠంగా ఎంతైనా మదుపు చేసుకోవచ్చు. ఆదాయం పన్ను చట్టం 1961, సెక్షన్ 80సీ ప్రకారం ఎల్ఐసీకి చేసే చెల్లింపులకు పన్ను మినహాయింపున్నది. ఆఫ్లైన్, ఆన్లైన్లలో ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఆన్లైన్లో కొనాలనుకునేవారు www.licindia.in వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. పాలసీ తీసుకున్న ఏడాది తర్వాత నుంచి రుణ సదుపాయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే నిబంధనలకు లోబడి 3 నెలల తర్వాత పాలసీ సరెండర్కూ వీలున్నది. పాలసీ కొన్నాక నియమ, నిబంధనలు నచ్చకపోయినట్లయితే 15 రోజుల్లోగా తిరిగి ఇచ్చేయవచ్చు. వ్యక్తిగత జీవితంపై, ఉమ్మడి కుటుంబంపై ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఇక మరణానంతర ప్రయోజనాలతోపాటు దివ్యాంగులకూ ఈ పాలసీలో అదనపు లాభాలున్నాయి.
రద్దయిన ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణ
ఏదైనా కారణాలతో మధ్యలో రద్దయిన వ్యక్తిగత పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది ఎల్ఐసీ. అక్టోబర్ 9 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపింది. టర్మ్ పాలసీలు, ఇతర హై రిస్క్ పాలసీలు మినహా మిగతా అన్ని పాలసీలను లేటు ఫీజుతో తిరిగి ప్రారంభించుకోవచ్చు. ఆలస్య రుసుం రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉంటే 25 శాతం వరకు రాయితీ వస్తుండటం విశేషం.