Relief on Lapse LIC Policy | మీరు గతంలో ఎల్ఐసీలో జీవిత బీమా తీసుకుని మధ్యలో వదిలేశారా.. అయితే, ఆ పాలసీని యాక్టివ్ చేయడానికి మీకు ఎల్ఐసీ మరో అవకాశం కల్పిస్తోంది. అందుకు అక్టోబర్ 22 వరకు వెసులుబాటునిచ్చింది. అపరాధ రుసుములోనూ రాయితీ కల్పిస్తుంది. ఇంతకుముందు కూడా ల్యాప్స్ అయిపోయిన పాలసీలను పునరుద్ధరించడానికి పలు దఫాలు ప్రచారోద్యమం చేపట్టింది. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో రిస్క్ కవర్ తప్పనిసరి అని ఎల్ఐసీ పేర్కొంది. కనుక మధ్యలో వదిలేసిన పాలసీలను పునరుద్ధరించుకోవడానికి ఇది గొప్ప అవకాశం అని వ్యాఖ్యానించింది.
పాలసీల ప్రత్యేక పునరుద్ధరణ కార్యక్రమం సోమవారం నుంచి మొదలై అక్టోబర్ 22 వరకు కొనసాగుతుంది. మధ్యలో ముగిసిపోయిన పాలసీలను తిరిగి ప్రారంభించుకోవచ్చు. పూర్తిగా ప్రీమియం నుంచి మినహాయింపు ఉంటుంది. వైద్య అవసరాలకు మినహాయింపులు ఉండవు. మాక్రో ఇన్సూరెన్స్, హెల్త్ లేట్ ఫీలకు అపరాధ రుసుము మాఫీ చేస్తారు.
ఐదేండ్లలోపు మూసేసిన పాలసీలను మాత్రమే పునరుద్ధరిస్తామని ఎల్ఐసీ తెలిపింది. అయినప్పటికీ టర్మ్ అస్యూరెన్స్, మల్టీపుల్ రిస్క్ పాలసీలపై డిస్కౌంట్లు ఉండవు. వీటికి మీరు మొత్తం ఫీజు చెల్లించాల్సిందే.
రూ. లక్ష విలువ గల పాలసీలపై 20 శాతం లేదా గరిష్ఠంగా రూ.2000 వరకు మినహాయింపు. రూ.లక్ష నుంచి రూ. 3 లక్షల్లోపు ప్రీమియం గల పాలసీలపై 25 శాతం లేదా రూ.2,500 మినహాయింపు ఉంటుంది. రూ.3 లక్షల పై చిలుకు ప్రీమియం గల పాలసీలకు 30 శాతం లేదా గరిష్ఠంగా రూ.3000 మినహాయింపు ఇస్తారు.