సోమవారం 30 మార్చి 2020
Business - Jan 18, 2020 , 01:04:22

రిలయన్స్‌ గర్జన

 రిలయన్స్‌ గర్జన
  • -దన్నుగా నిలిచిన చమురు, రిఫైనింగ్‌,రిటైల్‌, టెలికం రంగాలు
  • -రూ.1.68 లక్షల కోట్లకు పరిమితమైన ఆదాయం

ముంబై, జనవరి 17: దేశంలో అత్యంత విలువైన సంస్థగా కొనసాగుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాల జోరు కొనసాగుతున్నది. గత త్రైమాసికానికిగాను సంస్థ రూ.11,640 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి రికార్డు సృష్టించింది. ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయి లాభాలను ఆర్జించడం కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. పెట్రో కెమికల్‌ వ్యాపాలు నిరాశాపరిచినప్పటికీ...చమురు రిఫైనింగ్‌ వ్యాపారం తిరిగి కోలుకోవడం, కన్జ్యూమర్‌, రిటైల్‌, టెలికం రంగాలు కూడా దన్నుగా నిలిచాయి. చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌..అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యకాలానికిగాను రూ.11, 640 కోట్లు లేదా ప్రతిషేరుపై రూ.18.4 నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో రూ.10,251 కోట్లు లేదా రూ.17.3 నమోదైంది. ఒక త్రైమాసికంలో ఇంతటి గరిష్ఠ స్థాయిలో లాభాలు ఆర్జించిన తొలి ప్రైవేట్‌ సంస్థగా ఆర్‌ఐఎల్‌ రికార్డు సృష్టించింది. జూలై-సెప్టెంబర్‌లో సంస్థ నెలకొల్పిన రూ.11,262 కోట్ల నికర లాభం రికార్డును తానే వెనక్కినెట్టింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) రూ.14,512.81 కోట్ల లాభాన్ని గడించింది. ఇదే ఇప్పటి వరకు ఉన్న ప్రపంచ రికార్డు. లాభాల్లో రికార్డులు బద్దలు కొట్టిన సంస్థకు ఆదాయంలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 1.4 శాతం తగ్గి రూ.1,68,858 కోట్లకు పడిపోయింది.


Reliance1

రిటైల్‌ కూడా..

డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రిలయన్స్‌ రిటైల్‌ రూ.2,727 కోట్ల లాభాన్ని గడించింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.1,680 కోట్లతో పోలిస్తే 62.32 శాతం అధికం. గత త్రైమాసికంలో రిటైల్‌ విభాగం నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు రూ.45,327 కోట్ల ఆదాయం సమకూరింది. క్రితం ఏడాది వచ్చిన రూ.35,577 కోట్లతో పోలిస్తే 27.40 శాతం అధికం. సమీక్షకాలంలో కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌ైస్టెల్‌, గ్రాసరీ సెగ్మెంట్‌లు 35.7 శాతం వృద్ధిని కనబరిచాయి. గత త్రైమాసికంలో కొత్తగా 456 స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 11,316కి చేరుకున్నాయి. వీటిలో రెండింట మూడోవంతు ద్వి, తృతీయ శ్రేణి నగరాల్లోనే ఏర్పాటు చేసింది.


జియో లాభం రూ.1,350 కోట్లు

లాభాల్లో రిలయన్స్‌ జియో దూకుడు కొనసాగుతున్నది. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యకాలానికిగాను సంస్థ రూ.1,350 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదు చేసుకున్న రూ.831 కోట్లతో పోలిస్తే 62.5 శాతం అధికం. గత త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ఆదాయం 28.3 శాతం అధికమై రూ.13,968 కోట్లకు ఎగిసింది. డిసెంబర్‌ 31 నాటికి వినియోగదారులు 32.1 శాతం పెరిగి 37 కోట్లకు చేరుకున్నారు. సరాసరిగా ఒక్కో కస్టమర్‌ నుంచి రూ.128.3 చొప్పున ఆదాయం సమకూరినట్లు సంస్థ పేర్కొంది. గత మూడు నెలల్లో జియో వినియోగదారులు 1,208 కోట్ల జీబీల డాటాను వినియోగించారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 40 శాతం అధికం. అలాగే 82,640 కోట్ల నిమిషాల పాటు మాట్లాడరు.
-చమురు రిఫైనింగ్‌ వ్యాపారం 12% పెరిగి 5,657 కోట్లకు ఎగబాకింది.
-ప్రతి బ్యారెల్‌ చమురును శుద్ది చేయడం ద్వారా సంస్థ 9.2 డాలర్ల ఆదాయం సమకూరింది. క్రితం ఏడాదిలో ఇది 8.8 డాలర్లుగా ఉన్నది. రెండో త్రైమాసికంలో నమోదైన 9.4 డాలర్లతో పోలిస్తే తగ్గుముఖం పట్టింది.
-కంపెనీకి వచ్చిన లాభంలో రిటైల్‌, టెలికం రంగాల వాటా 40 శాతంగా ఉన్నది.
-డిసెంబర్‌ 31 నాటికి కంపెనీకి రూ.3,06,851 కోట్ల అప్పు ఉన్నది. గతేడాది మార్చి చివరి నాటికి రూ. 1,87, 505 కోట్లుగా ఉండగా, సెప్టెంబర్‌ నాటికి ఇది రూ.2,91,982 కోట్లకు పెరిగింది.
-ఇదే సమయంలో సంస్థ వద్ద రూ.1,53,719 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి రూ.1,34,746 కోట్లు.
-సౌదీకి చెందిన ఆరామ్కోతో కుదుర్చుకున్న వాటా విక్రయ ఒప్పందం వచ్చే ఏడాది పూర్తికానున్నట్లు అంచనా.
-కంపెనీ షేరు ధర 2.79 శాతం లాభపడి రూ.1,580.65 వద్ద ముగిసింది. దీంతో సంస్థ మార్కెట్‌ విలువ మరో .27,243.11 కోట్లు పెరిగి రూ. 10,02,009.11 కోట్లకు చేరుకున్నది.

రిలయన్స్‌ డిజిటల్‌లో రిపబ్లిక్‌ ఆఫర్‌

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రిలయన్స్‌ డిజిటల్‌ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వెయ్యి రూపాయలు చెల్లించి ఈ నెల 18నుంచి 23 లోగా ముందస్తు బుకింగ్‌ చేసుకున్నవారికి రూ.1,000 అదనంగా రాయితీ పొందవచ్చును. ఈ నెల 24 నుంచి 26 లోపు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ రాయితీ లభించనున్నది.

అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉన్నప్పటికీ ఇంధన రంగం దన్నుతో మూడో త్రైమాసికంలో ఆశాజనక ఆర్థిక ఫలితాలు నమోదు చేసుకున్నాయి. పెట్రో కెమికల్‌ బిజినెస్‌ నిరాశాపరిచినిప్పటికీ రిటైల్‌, టెలికం, ఇతర రంగాలు భారీ వృద్ధిని నమోదు చేసుకోవడంతో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించగలిగాము. కన్జ్యూమర్‌ బిజినెస్‌ మరో మైలురాయికి చేరుకున్నది. వినియోగదారులకు గొప్ప షాపింగ్‌ అనుభవాన్ని కల్పించడంతో అమ్మకాల్లో భారీ వృద్ధిని సాధించాము. తక్కువకే ధరకే వినియోగదారులకు డిజిటల్‌ సేవలు అందించడం జియోతోనే సాధ్యమైంది.
- ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌


logo