బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jul 16, 2020 , 02:22:18

5G సేవలకు సిద్ధం వచ్చే ఏడాది ప్రారంభిస్తాం

5G సేవలకు సిద్ధం వచ్చే ఏడాది ప్రారంభిస్తాం

  • స్పెక్ట్రమ్‌ అందుబాటులోకి రాగానే పరీక్షలు
  • రిలయన్స్‌ వార్షిక  సమావేశంలో ముకేశ్‌

దేశీయ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో.. తన ప్రభంజనాన్ని అప్రతిహతంగా కొనసాగించేందుకు ప్రణాళికలు రచించింది. మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చి డాటా విప్లవంతో కోట్ల మంది భారతీయులకు చేరువైన జియో.. ఐదో తరం టెలికం సేవలపై దృష్టిసారించింది. ఇందుకు అవసరమైన సాంకేతికతను జియో దేశీయంగానే అభివృద్ధి చేయడం విశేషం. 5జీ స్పెక్ట్రమ్‌ అందుబాటులోకి రాగానే ట్రయల్స్‌ నిర్వహిస్తామని, వచ్చే ఏడాది ఈ సేవలను ప్రారంభిస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ స్పష్టం చేశారు. 


ముంబై, జూలై 15: దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలను ఆరంభించేందుకు రిలయన్స్‌ జియో వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే కొలిక్కి వచ్చిందని, 5జీ స్పెక్ట్రమ్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే ట్రయల్స్‌ నిర్వహించాలని భావిస్తున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. వచ్చే ఏడాది 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందుకు అవసరమైన టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సంస్థ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. 

జియో ప్లాట్‌ఫామ్స్‌.. 20కిపైగా స్టార్టప్‌లతో కలిసి 4జీ, 5జీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డివైజెస్‌, ఓఎస్‌, బిగ్‌డాటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆగమెంటెడ్‌ రియాలిటీ/వర్చువల్‌ రియాలిటీ, బ్లాక్‌చైన్‌, నాచురల్‌ లాంగ్వేజ్‌ అండర్‌స్టాండింగ్‌, కంప్యూటర్‌ విజన్‌ తదితర రంగాల్లో ప్రపంచస్థాయి టెక్నాలజీలను అభివృద్ధి చేశాయన్నారు. ఈ సాంకేతికతల సాయంతో మీడియా, ఆర్థిక సేవలు, వాణిజ్యం, విద్య, వైద్య, వ్యవసాయం, స్మార్ట్‌ సిటీలు, స్మార్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, మొబిలిటీ తదితర రంగాల్లో అద్భుతాలను సృష్టించేందుకు వీలుంటుందన్నారు. దేశంలో డాటా వినియోగం భారీగా పెరిగిందని, గత నెలలో జియో వినియోగదారులు 500 కోట్ల గిగాబైట్ల డాటాను ఉపయోగించుకొన్నారని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు దాదాపు 10 లక్షల ఇండ్లకు జియో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఇచ్చినట్టు వెల్లడించారు.

రిటైల్‌ వెంచర్‌లోకి అంతర్జాతీయ భాగస్వాములు

రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. త్వరలో అంతర్జాతీయ భాగస్వాములు, పెట్టుబడిదారులను ఈ విభాగంలో చేర్చుకోనున్నాం. ఇప్పటికే మేము కిరాణా దుకాణదారులతో కలిసి నడుపుతున్న జియోమార్ట్‌ ఆన్‌లైన్‌ గ్రాసరీ ప్లాట్‌ఫామ్‌ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ఈ ప్లాట్‌ఫామ్‌కు నిత్యం 2.5 లక్షలకుపైగా ఆర్డర్లు వస్తున్నాయి. వీటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. జియోమార్ట్‌తో అనుసంధానమైన రైతులు తమ తాజా వ్యవసాయోత్పత్తులను నేరుగా ప్రజల ఇండ్ల వద్దకే పంపిణీ చేస్తున్నారు. అన్నదాతల ఆదాయం, వ్యవసాయ ఉత్పాదకత పెరిగేందుకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లలో మూడింట రెండొంతులు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయని, వీటిలో అమ్మే 80 శాతానికిపైగా కూరగాయలు, పండ్లను నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తున్నారు.

చమురు వ్యాపార విభజన

భాగస్వామ్య అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు రిలయన్స్‌ చమురు, రసాయనాల వ్యాపారాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా రూపొందించనున్నాం. వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేస్తాం. చమురు, రసాయనాల వ్యాపారంలో 15 బిలియన్‌ డాలర్ల (రూ.1,12,655 కోట్ల) వాటాను సౌదీ అరేబియా సంస్థ ఆరామ్‌కోకు అమ్మాలని భావించాం, కానీ కరోనా సంక్షోభం వల్ల ఈ ఒప్పందం అనుకున్నంతగా ముందుకు సాగలేదు. ఆరామ్‌కోతో రెండు దశాబ్దాల నుంచి ఉన్న అనుబంధానికి ఎంతో విలువ ఇస్తున్నాం, ఆ సంస్థతో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం రవాణాకు ఉపయోగిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ లాంటి శిలాజ ఇంధనాల స్థానంలో విద్యుత్‌, హైడ్రోజన్‌ లాంటి కర్బనరహిత ఇంధనాలను తీసుకొస్తాం. 2035 సంవత్సరం నాటికి కర్బన ఉద్గారరహిత సంస్థగా మారాలని రిలయన్స్‌ లక్ష్యంగా నిర్ణయించుకున్నది.

జియోమీట్‌కు అద్భుత ఆదరణ

జియోమీట్‌ వీడియో కాలింగ్‌ యాప్‌నకు అద్భుత ఆదరణ లభిస్తున్నది. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 50 లక్షల మందికిపైగా వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొన్నారు. భారత్‌లో క్లౌడ్‌ ఆధారిత తొలి వీడియో కాలింగ్‌ యాప్‌ ఇదే.. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, విండోస్‌, మాక్‌ ఓఎస్‌, వెబ్‌ ఓఎస్‌లలో ఇది అందుబాటులో ఉన్నది. హైడెఫినిషన్‌ ఆడియో, వీడియో క్వాలిటీతో కాన్ఫరెన్స్‌లు నిర్వహించుకొనేందుకు వీలున్న ఈ యాప్‌ను ఒకేసారి 100 మంది నిరంతరాయంగా 24 గంటలూ ఉపయోగించుకోవచ్చు. స్క్రీన్‌ షేరింగ్‌, మీటింగ్‌ షెడ్యూల్‌ లాంటి ఆధునిక ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి.

4% తగ్గిన ఆర్‌ఐఎల్‌ షేరు 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సాధారణ సమావేశ నిర్ణయాలు మదుపరులను  మెప్పించలేకపోయాయి. బుధవారం ఇంట్రాడేలో చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1,978.50కి తాకిన షేరు ధర  చివరకు 3.71 శాతం పతనమై రూ.1,845.60కి పరిమితమైంది.  దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.45,014 కోట్లు కరిగిపోయి రూ.11,70,000 కోట్ల వద్దకు చేరుకున్నది. 

చౌక ధరల్లో స్మార్ట్‌ఫోన్లు

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో అంతర్జాతీయ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్టు వస్తున్న వార్తలను ముకేశ్‌ అంబానీ ధ్రువీకరించారు. 
  • జియోలో రూ.33,737 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్‌ సిద్ధమైందని ప్రకటించారు. 
  • ఈ పెట్టుబడితో గూగుల్‌కు జియోలో 7.7% వాటా దక్కుతుందని తెలిపారు.
  • గూగుల్‌తో వ్యూహాత్మక భాగ స్వామ్యం ద్వారా అందుబాటు ధరల్లో 4జీ/5జీ స్మార్ట్‌ఫోన్లను తయారు చేయనున్నట్టు ముకేశ్‌ చెప్పారు.
  • జియోలో భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో ఫేస్‌బుక్‌ (రూ.43,573.62 కోట్లు) అగ్రస్థానంలో నిలువగా.. గూగుల్‌ రెండో స్థానాన్ని పొందనున్నది.


కండ్లకు స్మార్ట్‌ అద్దాలు

కండ్ల ముందు సరికొత్త ప్రపంచాన్ని సాక్షాత్కరింపజేసే ‘జియో గ్లాసెస్‌'ను రిలయన్స్‌ బుధవారం ఆవిష్కరించింది. తద్వారా టీవీ ప్రసారాలు, టెలీ కాన్ఫరెన్స్‌లు, వీడియో కాలింగ్‌లో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. కేవలం 75 గ్రాముల బరువుండే ఈ గ్లాసెస్‌ను 3డీ వర్చువల్‌ గదులను ప్రారంభించడం, భారీ ప్రెజెంటేషన్లు ఇవ్వడం లాంటి అవసరాలకు  ఉపయోగించుకోవచ్చని తెలిపింది. జియో మిక్స్‌డ్‌ రియాలిటీ ద్వారా రియల్‌ టైమ్‌లో తరగతులను నిర్వహించడంలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నది. ప్రస్తుతం జియో గ్లాసెస్‌కు 25 రకాల యాప్స్‌ అందుబాటులో ఉంటాయని ముకేశ్‌ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ వివరించారు. ‘జియో టీవీ+’ యాప్‌లో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ లాంటి 12 సంస్థల ఓటీటీ సేవలను చేర్చనున్నట్టు ఆకాశ్‌ తెలిపారు.


logo