మంగళవారం 04 ఆగస్టు 2020
Business - Jul 31, 2020 , 02:12:15

ఆర్‌ఐఎల్‌ అదుర్స్‌

ఆర్‌ఐఎల్‌ అదుర్స్‌

  • క్యూ1లో రూ.13,248 కోట్ల లాభం.. 
  • గరిష్ఠస్థాయి లాభాలు ఆర్జించడం ఇదే తొలిసారి

న్యూఢిల్లీ, జూలై 30: దేశంలో అతిపెద్ద సంస్థయైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డుల పరంపర కొనసాగుతున్నది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.13,248 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయి లాభాలు ఆర్జించిన సంస్థగా రికార్డు సృష్టించింది. ఏడాది క్రితం నమోదైన రూ. 10,141 కోట్లతో పోలిస్తే 30.6 శాతం అధికం. అనుబంధ సంస్థలో వాటాల విక్రయం ద్వారా సమకూరిన నిధులు లాభాల్లో భారీ వృద్ధికి దోహదం చేశాయి. కరోనా వైరస్‌తో  రిఫైనింగ్‌, పెట్రోకెమికల్‌, రిటైల్‌ విభాగాలు కుదేలైనప్పటికీ జియోలో వాటా విక్రయానికి వచ్చిన అపూర్వ స్పందన దన్నుగా నిలిచింది. అక్టోబర్‌-డిసెంబర్‌ 2019లో నమోదైన రూ.11,640 కోట్ల లాభం ఇప్పటి వరకు ఇదే ఉత్తమం. చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్‌కు చెందిన చమురు రిటైలింగ్‌ వెంచర్‌లో 49 శాతం వాటాను బీపీకి విక్రయించడంతో రూ.4,966 కోట్ల నిధులు సమకూరాయి.   సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం లక్ష కోట్లు దాటి రూ.1,00,929 కోట్లుగా నమోదైంది. 

 రిటైల్‌పై కరోనా

రిలయన్స్‌ రిటైల్‌ రంగంపై కరోనా ప్రభావం చూపింది. లాక్‌డౌన్‌ కారణంగా 50 శాతం స్టోర్లను మూసివేయడంతో ఆదాయంలో భారీ గండిపడిందని పేర్కొంది.   రూ.31,633 కోట్ల ఆదాయంపై రూ.1,083 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. ఆదాయం 17 శాతం తగ్గగా, నికర లాభం 47.4 శాతం క్షీణించింది. స్టోర్లు మూతపడటం, ఎగుమతుల మార్కెట్‌ నిరాశావాదంగా ఉండటంతో రిటైల్‌ ఆదాయ లాభాలపై ప్రభావం పడిందని పేర్కొంది. 

పెట్రోకెమికల్స్‌ అంతంతే..

రిటైల్‌తోపాటు పెట్రోకెమికల్స్‌ విభాగం కూడా నిరాశపరిచింది. తొలి త్రైమాసికానికిగాను ఈ విభాగ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 33 శాతం తగ్గి రూ.25,192 కోట్లకు పరిమితమైంది. ధరలు హెచ్చుతగ్గుదల నమోదవడం, ప్రాంతీయంగా డిమాండ్‌ పడిపోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. క్రూడాయిల్‌ ధరలు భారీగా పడిపోవడంతో రిఫైనింగ్‌ విభాగం నుంచి రావాల్సిన ఆదాయం 54.1 శాతం పడిపోయి రూ.46,642 కోట్లకు పరిమితమైంది. ఒక్కో బ్యారెల్‌ చమురును శుద్ది చేయడం ద్వారా 6.3 డాలర్ల ఆదాయం మాత్రమే లభించింది. ఏడాది క్రితం ఇది 8.1 డాలర్లుగా ఉన్నది. 

‘ప్రతి ఒక్కరికి డిజిటల్‌ టెక్నాలజీ సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన జియోలోకి 13 అంతర్జాతీయ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టాయి. లాక్‌డౌన్‌ కారణంగా హైడ్రోకార్బన్‌ బిజినెస్‌పై తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, ఈ ఇబ్బందికర పరిస్థితుల్లోనూ రూ.2 లక్షల కోట్లకు పైగా నిధులను సేకరించాం. వీటిలో రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53 వేల కోట్లు, జియోలో వాటా విక్రయించడం ద్వారా రూ.1.52 లక్షల కోట్లు, బీపీలో 40 శాతం వాటా విక్రయించడంతో రూ.7 వేల కోట్లు లభించాయి. దేశీయ కార్పొరేట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద నిధుల సేకరణ’

- ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ

 జియో దూకుడు

టెలికం వెంచర్‌ జియో లాభాల్లో దూసుకుపోతున్నది. గత త్రైమాసికానికిగాను రూ.2,520 కోట్ల లాభాన్ని గడించింది. ఏడాది క్రితం వచ్చిన రూ.891 కోట్ల లాభంతో పోలిస్తే 180 శాతం ఎగబాకింది. ఏడాది ప్రాతిపదికన ఆదాయం 33.7 శాతం వృద్ధి చెంది రూ.16,557 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. గత నెల చివరినాటికి జియోకు 39.83 కోట్ల మంది వినియోగదారులు ఉనానరు. ఒక్కో వినియోగదారుడి నుంచి సరాసరి ఆదాయం రూ.140.3 లభించింది. 


logo