బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Jan 29, 2020 , 23:45:11

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు

నాగొథానె (రాయ్‌గఢ్‌), జనవరి 29: రోడ్ల నిర్మాణంలో వాడి పారేసిన ప్లాస్టిక్‌ వినియోగంపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. భారతీయ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ను సంప్రదించింది. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ ఇప్పటికే ఈ తరహా పైలట్‌ ప్రాజెక్టులను చేపట్టింది. రాయ్‌గఢ్‌ జిల్లాలో తమ నాగొథానె ఉత్పాదక కేంద్రం వద్ద దాదాపు 40 కిలోమీటర్ల మేర రోడ్డును ఈ ప్రయోగంతోనే నిర్మించింది. 50 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు, తారును కలిపి ఈ రోడ్డును వేశారు. ‘ఈ టెక్నాలజీని అభివృద్ధిపరిచేందుకు 14 నుంచి 18 నెలలు పట్టింది. తినుబండారాల ప్యాకేజింగ్‌ కవర్లు, పాలిథిన్‌ బ్యాగులు ఇతరత్రా వాటిని రోడ్డు నిర్మాణంలో వినియోగించాం’ అని సంస్థ పెట్రోకెమికల్స్‌ బిజినెస్‌ సీవోవో విపుల్‌ షా విలేకరులకు తెలిపారు. ఎన్‌హెచ్‌ఏఐతోనేగాక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలతోనూ రిలయన్స్‌ చర్చలు జరుపుతున్నది. తమ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచిస్తున్నది. ఈ ప్లాస్టిక్‌ రోడ్లతో పనికిరాని ప్లాస్టిక్‌ను వాడుకున్నట్లవుతుందని, ఆర్థికంగా కూడా లాభదాయకమని షా గుర్తుచేశారు. ఒక కిలోమీటర్‌ రోడ్డు నిర్మాణానికి ఒక మెట్రిక్‌ టన్ను ప్లాస్టిక్‌ వ్యర్థాలను వాడుతున్నామని, దీనివల్ల దాదాపు రూ.లక్ష ఆదా అవుతుందని చెప్పారు. నాణ్యతలో కూడా ఏవిధంగానూ ఈ రోడ్లు తీసిపోవని స్పష్టం చేశారు. నిరుడు కురిసిన కుండపోత వర్షాలకు కూడా ప్లాస్టిక్‌ రోడ్డు చెక్కుచెదరలేదని గుర్తుచేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో 10వేల కిలోమీటర్ల రోడ్లను ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించాలనుకుంటున్నది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు మరో 23వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలని చూస్తున్నాయి.


logo
>>>>>>