ఆదివారం 24 మే 2020
Business - Mar 23, 2020 , 23:46:43

రిలయన్స్‌ ఔదార్యం..

రిలయన్స్‌ ఔదార్యం..

  • ముంబైలో కొవిడ్‌-19 దవాఖాన ఏర్పాటు

న్యూఢిల్లీ, మార్చి 23: దేశంలో అతిపెద్ద వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా ముందకొచ్చింది. దేశంలో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టడానికి తనవంతుగా చేయూతనందించడంలో భాగంగా మాస్క్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు లక్షకు పెంచడంతోపాటు అత్యవసరంగా తిరిగి వాహనాలకు ఉచితంగా ఇంధనం సరఫరా చేయడంతోపాటు ఆయా నగరాల్లో ఉన్న ఎన్‌జీవోలతో కలిసి ఉచితంగా భోజనం కూడా అందిస్తున్నది. అలాగే సామాజిక సేవల్లో భాగంగా ముంబైలో 100 పడకల ఆసుపత్రిని సైతం ఏర్పాటు చేసింది. 

కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స అందించడానికి రెండు వారాల్లోనే ఈ ఆసుపత్రిని బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)తో కలిసి శ్రీ హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ నెలకొల్పింది. అన్ని రకాల పడకల వద్ద బయోమెడికల్‌ పరికరాలు, వెంటిలేటర్లు, పేస్‌మేకర్లు, డయాల్‌సిస్‌ మెషిన్లు, పేటెంట్‌ మానిటరింగ్‌ పరికరాలు ఉంచింది. వైరస్‌ నేపథ్యంలో మూతపడిన కంపెనీకి సంబంధించిన పలు ప్రాజెక్టుల్లోపనిచేస్తున్న కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగుల జీతభత్యాలు యథావిధిగా చెల్లించనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 746 గ్రాసరీ స్టోర్లలో అన్ని రకాల వస్తువులను సిద్ధంగా ఉంచినట్లు, ఇవి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచివుంచనున్నట్లు వెల్లడించింది. 

నూతన కస్టమర్లకు బ్రాడ్‌బ్యాండ్‌ ఫ్రీ

నూతన బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్నట్లు జియో ప్రకటించగా..పాత వినియోగదారులకు డాటా పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటి నుంచి పనిచేసేవారికి ప్రయోజనం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్‌ కనెక్షన్‌ పొందడానికి రూ.2,500 చెల్లించాల్సి ఉండగా, వీటిలో రూ.1,500 రిఫండ్‌ కింద పొందనున్నారు. 


logo