రిలయన్స్ గర్జన

క్యూ3లో 12 % పెరిగిన లాభం
13,101 కోట్లుగా నమోదు
ఆదాయంలో 22% క్షీణత
న్యూఢిల్లీ, జనవరి 22: ఆర్థిక ఫలితాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోమారు గర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.13,101 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం నమోదైన రూ.11,640 కోట్లతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. చమురు, కెమికల్ రంగాలు ఆశాజనక పనితీరు కనబరిచినప్పటికీ..రిటైల్, టెలికం విభాగాలు నిలకడైన వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కానీ, ఆదాయంలో మాత్రం గండిపడింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1,57,165 కోట్ల నుంచి రూ.1,28,450 కోట్లకు పడిపోయింది. గతేడాదితో పోలిస్తే 22 శాతం తగ్గింది.
జియో లాభం రూ.3,489 కోట్లు
టెలికం వెంచర్ జియో లాభాల్లో దూకుడును ప్రదర్శిస్తున్నది. గత త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,489 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకున్నది. 2019-20లో నమోదైన రూ.3,020 కోట్ల లాభంతో పోలిస్తే 15.5 శాతం పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. లాభాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థకు ఆదాయంలో మాత్రం సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. గత త్రైమాసికంలో సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5.3 శాతం పెరిగి రూ.22,858 కోట్లకు చేరుకున్నది. డిసెంబర్ చివరినాటికి సంస్థకు 41 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారు. సరాసరిగా ఒక్కో వినియోగదారుడి నుంచి సంస్థకు రూ.151 ఆదాయం ఆర్జించింది. మొత్తంగా 1,586 కోట్ల జీబీల డాటాను వినియోగించారు.
రిటైల్ ఆశాజనకం
రిలయన్స్ రిటైల్ ఆశాజనక పనితీరు కనబరిచింది. గత త్రైమాసికంలో రిటైల్ వెంచర్ రూ.3,102 కోట్ల ముందస్తు పన్ను చెల్లింపుల తర్వాత నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది రూ.2,736 కోట్లుగా ఉన్నది. ఆదాయం 22.94 శాతం తగ్గి రూ.36,887 కోట్లకు పడిపోయింది. కరోనా వైరస్ కారణంగా అవుట్లెట్లు మూతపడటంతో ఆదాయంలో గండిపడిందని పేర్కొంది. గత త్రైమాసికంలో కొత్తగా 327 స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 12,201కి చేరుకున్నాయి.
జియోలో వాటా విక్రయించడం ద్వారా రూ.1.52 లక్షల కోట్లు, రిటైల్ యూనిట్ ద్వారా రూ.47,265 కోట్లు సేకరించింది. మొత్తంగా రూ.2,20,231 కోట్లు సమీకరించగలిగింది. డిసెంబర్ చివరినాటికి కంపెనీ అప్పు 2,57,413 కోట్లకు తగ్గింది. మార్చి 2020 వరకు ఇది 3,36,294 కోట్లుగా ఉన్నది. ఇదే సమయంలో నగదు నిల్వలు రూ.1,75,259 కోట్ల నుంచి రూ.2,20,524 కోట్లకు చేరుకున్నాయి. కరోనా సమయంలోనూ సంస్థ 50 వేల మందికి ఉపాధి కల్పించింది. 2.3% కంపెనీ షేరు ధర2.3 శాతం తగ్గి రూ.2,049.65 వద్ద నిలిచింది.
భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న తరుణంలో సంస్థ అన్ని రంగాల్లో సత్తాచాటింది. ముఖ్యంగా చమురు నుంచి కెమికల్ వ్యాపారాలతోపాటు రిటైల్ రంగాలు అంచనాలకుమించి రాణించగా, డిజిటల్ సేవలు నిలకడైన వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ గతేడాది 50 వేల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించగలిగాం.
- ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్
తాజావార్తలు
- అలవాటైన నడకతో అవార్డుల పంట
- పెట్రోల్ బంకుల్లో కల్తీని సహించం
- పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే .. భారీ మూల్యం తప్పదు!
- ఉత్సాహంగాకదన రంగంలోకి..
- నగర దారులు వాహన బారులు
- పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం
- పేదలకు అండగా ప్రభుత్వం
- ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం
- సభ్యత్వ నమోదులో సైనికుడిలా పనిచేయాలి
- సెట్విన్ కేంద్రాల్లో ప్రతిభా పోటీలు