శనివారం 30 మే 2020
Business - May 01, 2020 , 00:53:13

రిలయన్స్‌కు పెట్రో దెబ్బ

రిలయన్స్‌కు పెట్రో దెబ్బ

  • క్యూ4లో 37% క్షీణించిన లాభం
  • రూ.6,546 కోట్లకు పరిమితం 
  • షేర్‌కు రూ.6.50 డివిడెండ్‌ ప్రకటన
  • జీతాన్ని వదులుకున్న ముకేశ్‌

ముంబై, ఏప్రిల్‌ 30: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఈసారి నిరాశాజనక లాభాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2019-20) చివరి త్రైమాసికం (ఈ ఏడాది జనవరి-మార్చి)లో రూ.6,546 కోట్ల లాభాలకే పరిమితమైంది. గతంతో పోల్చితే ఇది 37 శాతం క్షీణత. అంతేగాక గడిచిన మూడేండ్లలో ఇదే అత్యంత కనిష్ఠస్థాయి త్రైమాసిక లాభాలు కావడం గమనార్హం. క్రిందటిసారి (నిరుడు జనవరి-మార్చి) రూ.10,362 కోట్ల లాభాలను అందుకున్నట్లు గురువారం రిలయన్స్‌ తెలిపింది. పెట్రోకెమికల్‌ వ్యాపారం నుంచి పడిపోయిన ఆదాయం.. సంస్థ లాభాలకు గండి కొట్టింది. ఈ మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6.50 చొప్పున డివిడెండ్‌కు ఆర్‌ఐఎల్‌ బోర్డు ఆమోదం తెలిపింది. 

జియో లాభం 177% జూమ్‌

రిలయన్స్‌ జియో నికర లాభం ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో గతంతో పోల్చితే 177 శాతం ఎగిసింది. రూ.2,331 కోట్లుగా నమోదైంది. నిరుడు ఇదే వ్యవధిలో సంస్థ లాభం రూ.840 కోట్లకే పరిమితమైంది. చార్జీల పెంపు, పెరిగిన వినియోగదారులు సంస్థ లాభాలను అమాంతం పెంచేశాయి. 

రూ.53,125 కోట్ల రైట్స్‌ ఇష్యూ

దేశ కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద రైట్స్‌ ఇష్యూకు రిలయన్స్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.53,125 కోట్ల ఇష్యూతో ముందుకు వస్తున్నది. ప్రతీ 15 షేర్లకు ఒక షేర్‌ ప్రాతిపదికన వస్తున్న ఈ ఇష్యూ షేర్‌ ధర రూ.1,257గా నిర్ణయించారు. గురువారం ట్రేడింగ్‌లో సంస్థ షేర్‌ ముగిసిన ధర కంటే ఇది 14 శాతం తక్కువ. 

ఉద్యోగులకు షాక్‌.. జీతాల్లో కోతలు

కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ఉద్యోగుల జీతాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కోత పెట్టింది. చాలా మంది ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం నుంచి 50 శాతం వరకు కత్తిరించాలని నిర్ణయించింది. అయితే వార్షిక వేతనం రూ.15 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి ఈ కోతలుండవని స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఏడాది తన పూర్తి జీతాన్ని వదులుకుంటున్నట్లు సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. ముకేశ్‌ వేతనం రూ.15 కోట్లుగా ఉన్నది. మరోవైపు రిలయన్స్‌ బోర్డులోని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, సీనియర్‌ ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం కోతలుండనున్నాయి.


logo