సోమవారం 30 నవంబర్ 2020
Business - Oct 27, 2020 , 02:24:45

మార్కెట్లకు అమెజాన్‌ దెబ్బ

మార్కెట్లకు అమెజాన్‌ దెబ్బ

  • ఆగిన రిలయన్స్‌-ఫ్యూచర్‌ డీల్‌తో మదుపరుల్లో అమ్మకాల ఒత్తిడి

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ డీల్‌ బ్రేక్‌.. దేశీయ స్టాక్‌ మార్కెట్లను భారీ నష్టాలకు గురిచేసింది. ఈ లావాదేవీపై అమెజాన్‌కు అనుకూలంగా సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఆదేశాలు రావడంతో మదుపరులు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. దీంతో సోమవారం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 540 పాయింట్లు లేదా 1.33 శాతం పడిపోయి 40,145.50 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 737 పాయింట్లు క్షీణించడం గమనార్హం. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 162.60 పాయింట్లు లేదా 1.36 శాతం దిగజారి 11,767.75 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్‌ భయాలు, అమెరికా ఉద్దీపనపై అనిశ్చితి, అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్ల నష్టాలు, రూపాయి మారకం విలువ పతనం కూడా భారతీయ స్టాక్‌ మార్కెట్లను కుదిపేశాయి. సెన్సెక్స్‌ షేర్లలో బజాజ్‌ ఆటో షేర్‌ విలువ గరిష్ఠంగా 6.10 శాతం పడిపోయింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, రిలయన్స్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లూ కుదేలయ్యాయి. 

రిలయన్స్‌, ఫ్యూచర్‌ షేర్లు ఢమాల్‌

రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థల షేర్లు తీవ్ర నష్టాలకు లోనయ్యాయి. బీఎస్‌ఈలో ఆర్‌ఐఎల్‌ షేర్‌ విలువ 3.97% క్షీణిం చగా,  ఫ్యూచర్‌ గ్రూప్‌లోని వివిధ కంపెనీల షేర్ల విలువ 10% వరకు పతనమైంది. లైఫ్‌ైస్టెల్‌ ఫ్యాషన్స్‌ 9.71%, రిటైల్‌ 5.08%, ఎంటర్‌ప్రైజెస్‌ 4.99%, కన్జ్యూమర్‌ లిమిటెడ్‌ 4.92% మేర పడిపోయాయి.

2లక్షల కోట్లు ఆవిరి

భారీ నష్టాలతో బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్‌ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఒక్కరోజే రూ.1,98,314.27 కోట్లు కరిగిపోయి రూ.1,58,60,658. 73 కోట్లకు పరిమితమైంది.