శనివారం 04 జూలై 2020
Business - May 24, 2020 , 23:58:14

సంస్కరణలంటే చట్టాల రద్దు కాదు

సంస్కరణలంటే చట్టాల రద్దు కాదు

  • కార్మిక చట్టాల్లో మార్పులపై నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ, మే 24: సంస్కరణలంటే కార్మిక చట్టాలను పూర్తిగా రద్దుచేయడం కాదని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. కరోనా కాటుతో కుదేలైన పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ఇటీవల ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ లాంటి పలు రాష్ర్టాల్లో కార్మిక చట్టాలను సవరించడం లేదా సవరణలకు ప్రతిపాదించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో)లో భారత్‌ సభ్యదేశంగా ఉన్నది. కనుక దేశంలో కార్మిక చట్టాలను రద్దుచేయడం కుదరదు. ఈ విషయాన్ని రాష్ర్టాలకు చెప్పేందుకు కేంద్ర కార్మికశాఖ సిద్ధమవుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. కార్మిక చట్టాలను సంస్కరించడమంటే ఆ చట్టాలను పూర్తిగా రద్దుచేయడం కాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు దీని ద్వారా స్పష్టమవుతున్నది. కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం కట్టుబడి ఉన్నది’ అని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కొవిడ్‌-19 ప్రతికూల ప్రభావంతో యావత్‌ ప్రపంచ దేశాల మాదిరిగానే భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందులు పడుతున్నదని, ఈ మహమ్మారి వల్ల ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ప్రతికూలంగా ఉండవచ్చన్న రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటనను రాజీవ్‌ కుమార్‌ గుర్తుచేస్తూ.. జీడీపీ వృద్ధిరేటు ఎంతమేరకు ప్రతికూలంగా ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులతోపాటు అనేక అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు.


logo