సోమవారం 01 జూన్ 2020
Business - Mar 27, 2020 , 23:34:16

ఎస్బీఐ షురూ

ఎస్బీఐ షురూ

-వడ్డీరేట్లు 75 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు

ముంబై: రిజర్వు బ్యాంక్‌ వడ్డీరేట్లను తగ్గించిన కొన్ని గంటల్లోనే దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ)..వడ్డీరేట్లను ఏకంగా 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఈ నూతన రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతోపాటు రిటైల్‌, బల్క్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను కూడా 20 బేసిస్‌ పాయింట్ల నుంచి 100 బేసిస్‌ పాయింట్ల వరకు కోత విధించింది. ఈ నిర్ణయంతో ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌-లింక్డ్‌ లెండింగ్‌ రేటు(ఈబీఆర్‌), రెపో-లింక్డ్‌ లెండింగ్‌ రేటు(ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)తో అనుసంధానమై అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు మరింత తగ్గనున్నదని తెలిపింది. దీంతో ఈబీఆర్‌ రేటు 7.80 శాతం నుంచి 7.05 శాతానికి తగ్గనుండగా, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 7.40 శాతం నుంచి 6.65 శాతానికి దిగిరానున్నది. బ్యాంక్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో 30 ఏండ్ల కాలపరిమితి కలిగిన లక్ష రూపాయల రుణంపై ఈఎంఐ రూ.52 తగ్గనున్నది. మరోవైపు బ్యాంక్‌ అసెట్‌ లయబిలిటీ కమిటీ వచ్చే నెలలో సమావేశమై మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు కుమార్‌ వెల్లడించారు. 

60 వేల కోట్ల చెల్లింపులపై ప్రభావం

ఆర్బీఐ తీసుకున్న మూడు నెలల మారటోరియంతో బ్యాంకుకు రావాల్సిన మొత్తం రుణాల్లో రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్ల వరకు చెల్లింపులు నిలిచిపోనున్నట్లు ఎస్బీఐ స్పష్టంచేసింది. ప్రతియేటా రూ.2-2.5 లక్షల కోట్ల వరకు రుణాలను వసూలు చేస్తుండగా, వీటిలో వచ్చే మూడు నెలల్లో రూ.60 వేల కోట్ల వరకు వసూలు కాకపోవచ్చునని బ్యాంక్‌ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ చెప్పారు. 

బ్యాంకులు తగ్గించింది స్వల్పమే..!

 ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి రిజర్వుబ్యాంక్‌ ఉదారంగా వడ్డీరేట్లను తగ్గిస్తున్నప్పటికీ బ్యాంకులు మాత్రం పెడచెవిన పెడుతున్నాయి. 2019లో వరుసగా ఐదుసార్లు  135 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేట్లను తగ్గిస్తే బ్యాంకులు మాత్రం 35-40 బేసిస్‌ పాయింట్లు తగ్గించి చేతులు జులుపుకున్నాయి. కానీ, ఈసారి కరోనా వైరస్‌తో కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడానికి సెంట్రల్‌ బ్యాంక్‌ ఏకంగా 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. బ్యాంకులు ఏ మేరకు తగ్గిస్తాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకున్న కారణంగా డిసెంబర్‌, ఫిబ్రవరి నెలల్లో జరిగిన సమీక్షల్లో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. 


logo