శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 27, 2020 , 00:41:37

తగ్గిన పసిడి దిగుమతులు

తగ్గిన పసిడి దిగుమతులు
  • ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్యకాలంలో 7 శాతం క్షీణత

న్యూఢిల్లీ, జనవరి 26: పసిడి దిగుమతులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచిన తొమ్మిది నెలల్లో బంగారం దిగుమతులు 6.77 శాతం తగ్గి 23 బిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో భారత్‌ 24.73 బిలియన్‌ డాలర్ల విలువైన పసిడిని దిగుమతి చేసుకున్నది. తగ్గుముఖం పట్టిన పసిడి దిగుమతులతో వాణిజ్యలోటు 148.23 బిలియన్‌ డాలర్ల నుంచి 118 బిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు వెల్లడించింది. 


గతేడాది జూలై నుంచి పసిడి దిగుమతుల్లో ప్రతికూల వృద్ధి నమోదు చేసుకోగా..అక్టోబర్‌, నవంబర్‌లో మాత్రం పెరుగగా, డిసెంబర్‌లోనూ 4 శాతం అధికమయ్యాయి. భారత్‌లో ఆభరణాలకు ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో పసిడిని అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నది. విలువపరంగా చూస్తే ప్రతియేటా 800 నుంచి 900 టన్నుల మేర బంగారం వచ్చి చేరుతున్నది. క్యాడ్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం.. బంగారం దిగుమతులపై సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం సత్ఫలితాలను ఇచ్చింది. కానీ, జెమ్స్‌ అండ్‌ జ్యూవెల్లరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ మాత్రం ఈ సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని కోరుతున్నది. గత తొమ్మిది నెలల్లో ఆభరణాల ఎగుమతులు 6.4 శాతం తగ్గి 27.9 బిలియన్‌ డాలర్లకు పరిమితం కావడం వల్లనే ఇండస్ట్రీ వర్గాలు ప్రభుత్వం వద్ద మొరపెట్టుకుంటున్నాయి. 2018-19లోనూ బంగారం దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 3 శాతం తగ్గి 32.8 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  


logo