బుధవారం 03 జూన్ 2020
Business - Mar 31, 2020 , 23:48:58

ఈఎంఐలు వాయిదా

ఈఎంఐలు వాయిదా

- వడ్డీరేట్ల బకాయిలు కూడా.. స్పష్టం చేసిన బ్యాంకులు

-మారటోరియంపై మొబైల్‌ ఎస్‌ఎంఎస్‌, మెయిల్స్‌ ద్వారా వివరాలు

న్యూఢిల్లీ, మార్చి 31: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఇచ్చిన మారటోరియం ప్రకారం అన్ని టర్మ్‌ లోన్లకు సంబంధించిన ఈఎంఐలను వాయిదా వేసుకోవచ్చని మంగళవారం బ్యాంకులు కస్టమర్లకు స్పష్టం చేశాయి. మార్చి 1 నుంచి మే 31 వరకున్న రుణాల ఈఎంఐలు, వడ్డీరేట్ల బకాయిలను వాయిదా వేసుకోవచ్చని ఎస్బీఐ, బీవోబీ, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్‌లు తమ ఖాతాదారులకు తెలియజేశాయి. రీపేమెంట్‌ వ్యవధిని మూడు నెలలు పొడిగించామని ఎస్బీఐ ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ మేరకు ఖాతాలకు అనుసంధానంగా ఉన్న మొబైల్‌ నెంబర్లకు, ఈ-మెయిల్‌ అడ్రస్‌లకూ మెసేజ్‌లు పంపుతున్నట్లు బ్యాంకర్లు తెలిపారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రుణగ్రహీతలకు ఊరటనిస్తూ ఆర్బీఐ మారటోరియం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మారటోరియం తీసుకుంటే లాభమా.. నష్టమా.. అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో రుణగ్రహీతల్లో అయోమయం నెలకొన్నది. ఖాతాల నుంచి ఈఎంఐ సొమ్మును కత్తిరించే సమయం దగ్గరపడుతున్నా సందిగ్ధత కొనసాగుతున్న క్రమంలో బ్యాంకర్లు కస్టమర్ల సందేహాలను నివృత్తిచేస్తూ తాజాగా ప్రకటనలు చేశారు. మారటోరియంతోపాటు రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకున్న ఇతర నిర్ణయాల ప్రయోజనాలను ఎలా? పొందవచ్చు అన్నది సవివరంగా సందేశాల ద్వారా తెలియజేస్తున్నామని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్‌ రాయ్‌ జీ పీటీఐకి తెలిపారు. కాగా, కార్పొరేట్‌, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, వ్యవసాయ, రిటైల్‌, హౌజింగ్‌, ఆటో, వ్యక్తిగత రుణాలకు మారటోరియం వర్తిస్తుందని బ్యాంకులు చెప్పాయి.

ప్రభావితులే ఎంచుకోవాలి

కరోనా వైరస్‌తో ఆదాయం కోల్పోయినవారే మారటోరియంను ఎంచుకోవడం ఉత్తమమని రాయ్‌ అన్నారు. ఎప్పట్లాగే ఆదాయం ఉన్నవారు ఈఎంఐలను కొనసాగించాలని సూచించారు. కాగా, ఈఎంఐల కోతకు ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ సర్వీస్‌ (ఈసీఎస్‌)ను ఎంచుకున్న రుణగ్రహీతలు.. మారటోరియంను తీసుకోదల్చితే తాము రుణాలు పొందిన శాఖలకు మెయిల్‌ లేదా ఇతర డిజిటల్‌ వేదికల ద్వారా ఆ సమాచారాన్ని అందించాలని కోరారు. లేనిపక్షంలో యథాతథంగా ఖాతాల నుంచి ఈఎంఐలు కట్‌ అవుతాయన్నారు. ఇదిలావుంటే యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు మారటోరియంపై త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించాయి. 


logo