శనివారం 30 మే 2020
Business - Apr 28, 2020 , 20:37:10

షాకింగ్ న్యూస్‌: ఉద్దేశ‌పూర్వ‌క ఎగ‌వేత‌దారుల రుణాలు మాఫీ!

షాకింగ్ న్యూస్‌: ఉద్దేశ‌పూర్వ‌క ఎగ‌వేత‌దారుల రుణాలు మాఫీ!

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ క్లిష్ట ప‌రిస్థితులు ఎదుర్కొంటున్న‌ది. ఇలాంటి క్లిష్ట‌ సంద‌ర్భంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) షాకింగ్ వార్త చెప్పింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించిన 50 మందికి సంబంధించి రూ.68,607 కోట్ల రుణాల‌ను సాంకేతికంగా మాఫీ చేసిన‌ట్లు తెలిపింది. సెప్టెంబర్ 30, 2019 నాటికి బ్యాంకుల్లో బ‌కాయిప‌డ్డ‌ రూ.68,607 కోట్ల‌ రుణాలను నిలిపివేసినట్లు ఆర్బీఐ సమాచారహక్కుచ‌ట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. 

ఈ మేరకు ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే  తన ట్విటర్ ఖాతా ద్వారా వివరాలను వెల్ల‌డించారు. టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై  కాంగ్రెస్ నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్‌ గాంధీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్ప‌డానికి నిరాక‌రించార‌ని, అందుకే తాను అదే విషయంపై ఆర్టీఐని ఆశ్రయించాన‌ని గోఖలే ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 16 నాటికి టాప్-50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, వారి ప్రస్తుత రుణ స్థితికి సంబంధించిన వివరాలను కోరగా, ఏప్రిల్ 24న  తనకు ఈ సమాధానం వచ్చినట్టు గోఖలే చెప్పారు. 

కాగా, ఉద్దేశ‌పూర్వ‌క ఎగ‌వేత‌దారుల్లో డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ రూ.5492 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. చోక్సీ ఇతర సంస్థలైన గిలి ఇండియా, నక్షత్ర బ్రాండ్లు కూడా వరుసగా రూ.1,447, రూ.1,109 కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్‌ఈఐ ఆగ్రో రూ.4,314, విన్సమ్ డైమండ్స్ రూ.4,076 కోట్లు ఉన్నాయి. 

ఇక రోటోమాక్ గ్లోబల్ ప్రైవేటు లిమిటెడ్ రూ.2,850 కోట్లు, కుడోస్ కెమీ లిమిటెడ్ రూ.2,326 కోట్లు, రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.2,212 కోట్లు, జూమ్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ రూ.2,012 కోట్లు బ్యాంకుల‌కు చెల్లించాల్సి ఉంది. విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.1,943 కోట్లతో ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఇక‌ ప్రీషియస్ జ్యువెల్లరీ అండ్ డైమండ్స్ ప్రైవేట్‌ లిమిటెడ్ రూ.1,962 కోట్లు, డెక్కన్ క్రానిక‌ల్‌ హోల్డింగ్స్ లిమిటెడ్ రూ.1,915 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు.. 


logo