శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Business - Mar 19, 2020 , 00:52:59

రూ.10వేల కోట్లు

రూ.10వేల కోట్లు

  • కరోనా వైరస్‌ నేపథ్యంలో రేపు మార్కెట్‌లోకి విడుదల చేయనున్న ఆర్బీఐ

ముంబై, మార్చి 18: విశ్వ మానవాళికి చావు భయాన్ని.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్ట భయా న్ని కలిగిస్తున్న కరోనా వైరస్‌.. దేశంలో విజృంభిస్తున్న వేళ ఆర్బీఐ అప్రమత్తమైంది. సుస్థిర ఆర్థిక వ్యవస్థ రక్షణార్థం శుక్రవారం బహిరంగ మార్కెట్‌ ద్వారా రూ.10,000 కోట్లను అందుబాటులోకి తేనున్నది. ‘కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) మహమ్మారితో ఆర్థిక మార్కెట్లకు ముప్పు పొంచి ఉన్నది. స్థిరత్వం లోపించకుండా, సాధారణంగా నడిచేందుకు కావాల్సిన చర్యలను తీసుకుంటున్నాం’ అని ఓ ప్రకటనలో బుధవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. బహుళ ధరల పద్ధతి వినియోగిస్తూ వేర్వేరు సెక్యూరిటీల వేలం ద్వారా రూ.10,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు దిగుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఫిబ్రవరి 15, 2022 మెచ్యూరిటీపై 8.20 శాతం, ఏప్రిల్‌ 16, 2023పై 7.37 శాతం, జనవరి 28, 2024పై 7.32 శాతం, మే 25, 2025 మెచ్యూరిటీపై 7.72 శాతం చొప్పున కూపన్‌ రేటుతో సెక్యూరిటీలను కొనుగోలు చేస్తామని వివరించింది. డాలర్‌తో పో ల్చితే రూపాయి మారకం విలువ బలోపేతానికి ఈ నెల 16న 2 బిలియన్‌ డాలర్లను రూపాయి కొనుగోలు ద్వారా మార్కెట్‌కు అందించింది ఆర్బీఐ. 23న మరో విడుతలో ఇంకా 2 బిలియన్‌ డాలర్లను అమ్మనున్నది.

కరోనా బాధిత రంగాల కోసం..

కరోనా వైరస్‌ వ్యాప్తితో దెబ్బతిన్న బ్యాంకులు, విమానయానం, హోటల్‌ తదితర రంగాలకు ఊరటనివ్వాలని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆర్బీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులోభాగంగానే మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) వర్గీకరణ నిబంధనల్ని సడలించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఓ రుణాన్ని మొండి బకాయిగా వర్గీకరించేందుకున్న సమయాన్ని 30 నుంచి 60 రోజులు పెంచాలన్నదానిపై చర్చిస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.


logo