శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Mar 07, 2020 , 00:23:31

మీ సొమ్ము భద్రం

మీ సొమ్ము భద్రం
  • ఏ ఒక్కరికీ నష్టం వాటిల్లదు.. సాధ్యమైనంత త్వరగా సంక్షోభాన్ని పరిష్కరిస్తాం
  • యెస్‌ బ్యాంకు డిపాజిటర్లకు నిర్మలమ్మ అభయం

న్యూఢిల్లీ, మార్చి 6: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న యెస్‌ బ్యాంకు నుంచి నగదును ఉపసంహరించుకొనేందుకు ఖాతాదారులు పరుగులు తీస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం వారికి అభయమిచ్చింది. ఆ బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉన్నదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం భరోసా ఇచ్చారు. ఈ సంక్షోభాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కృషిచేస్తున్నదని తెలిపారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో నాలుగవదిగా ఉన్న యెస్‌ బ్యాంకు ప్రస్తుతం కొత్త రుణాలిచ్చేందుకు నిధుల్లేక తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోయింది. నిధుల సమీకరణ ద్వారా ఈ సమస్యను అధిగమించేందుకు యెస్‌ బ్యాంకు తాజాగా చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో గురువారం ఆ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడంతోపాటు ఖాతాదారులు నెలలో రూ.50 వేలకు మించి నగదు ఉపసంహరించడానికి వీల్లేదని పరిమితి విధించిన విషయం తెలిసిందే. దీంతో యెస్‌ బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందతున్నారు. ఈ సంక్షోభంపై తాను ఆర్బీఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ఆర్బీఐ తనకు హామీ ఇచ్చిందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 


‘ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. యెస్‌ బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము సురక్షితంగా ఉన్నది. ఆ బ్యాంకు ఖాతాదారుల్లో ఏ ఒక్కరికీ నష్టం జరుగదని నేను హామీ ఇస్తున్నా. నిర్దేశిత పరిమితికి లోబడి తమ సొమ్మును ఉపసంహరించుకొనేలా డిపాజిటర్లకు వీలుకల్పించడమే మా ముందున్న తక్షణ ప్రాధాన్యం. ఈ విషయమై రిజర్వు బ్యాంకుతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా. డిపాజిటర్లతోపాటు బ్యాంకులు, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను కాపాడేందుకే తాజా చర్యలు చేపట్టాం. డిపాజిటర్లకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు రూ.50 వేలు ఉపసంహరించుకొనే అవకాశాన్ని కల్పించాం’ అని ఆమె వివరించారు. యెస్‌ బ్యాంకుకు కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటుచేయనున్నామని, ఆ బ్యాంకులో 49 శాతం పెట్టుబడులు పెట్టేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆసక్తి చూపిందని తెలిపారు.


2017లోనే అప్రమత్తం

యెస్‌ బ్యాంకు సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం 2017లోనే అప్రమత్తమైందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆ బ్యాంకులో పాలనాపరమైన సమస్యలున్నట్టు అప్పుడే గుర్తించి సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రణాళికలు రచించామని తెలిపారు. ఆ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులకు, వారి జీతాలకు ఏడాదిపాటు ఎలాంటి ఢోకా ఉండదని హామీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని   గత యూపీఏ ప్రభుత్వం బలవంతపు విలీనాలతో దేశ బ్యాంకింగ్‌ రంగాన్ని నాశనం చేసిందని నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. 


logo