మంగళవారం 26 మే 2020
Business - May 23, 2020 , 00:32:58

రేపో రేటు కుదింపుతో ఈఎంఐ తగ్గేది ఇలా..

రేపో రేటు కుదింపుతో ఈఎంఐ తగ్గేది ఇలా..

న్యూఢిల్లీ, మే 22: కరోనా కాటుతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు ఊరట కల్పించేందుకు రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను క్రమంగా తగ్గిస్తున్నది. రెపో రేటును మార్చిలో 75 బేసిస్‌ పాయింట్లు, ఏప్రిల్‌లో మరో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ.. శుక్రవారం తాజాగా ఈ రేటును మరో 40 పాయింట్లు కుదించింది. ఈ మేరకు బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌)ను తగ్గించి సదరు ప్రయోజనాన్ని నేరుగా గృహ, వాహన రుణగ్రహీతలకు అందజేస్తే నెలవారీ కిస్తీ (ఈఎంఐ) రూపంలో వారు చెల్లించే సొమ్ములో కొంత ఆదా అవుతుంది. ఉదాహరణకు ఓ ఉద్యోగి 20 ఏండ్ల కాలవ్యవధితో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) నుంచి రూ.50 లక్షల గృహ రుణాన్ని తీసుకొని ఉంటే ఇప్పటివరకు అతను 7.65 శాతం వడ్డీతో కలిపి నెలకు రూ.40,739 చొప్పున కిస్తీలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఆర్బీఐ రెపో రేటు కుదింపునకు అనుగుణంగా ఎస్బీఐ తన వడ్డీ రేటును 40 బేసిస్‌ పాయింట్లు (7.25 శాతానికి) తగ్గిస్తే ఇకపై ఆ ఉద్యోగి చెల్లించే నెలవారీ కిస్తీ రూ.39,519కి తగ్గుతుంది. తద్వారా అతనికి 1,220 రూపాయలు ఆదా అవుతాయి. బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు పొందిన కస్టమర్లకు ఈ విధంగా మరింత లబ్ధి చేకూరుతుంది.

ఆర్బీఐ పరపతి సమీక్షలో ముఖ్యాంశాలు

 • రెపో రేటు 4 శాతానికి (40 బేసిస్‌ పాయింట్లు) తగ్గింపు.
 • రివర్స్‌ రెపో రేటు 3.35 శాతానికి కుదింపు.
 • మూలధన రుణాలపై వడ్డీని ఆగస్టు 31 వరకు వాయిదా వేసేందుకు బ్యాంకులకు అనుమతి.
 • ఎగ్జిమ్‌ బ్యాంకుకు రూ.15 వేల కోట్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌.
 • ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గరిష్ఠ పరిమితి ఏడాది నుంచి 15 నెలలకు పెంపు.
 • కీలక వడ్డీరేట్లను తగ్గించడం మూడు నెలల్లో ఇది మూడోసారి.
 • టర్మ్‌లోన్‌ ఇన్‌స్టాల్‌మెంట్లపై మారటోరియం మరో మూడు నెలలు (ఈ ఏడాది ఆగస్టు 31 వరకు) పొడిగింపు.
 • మార్కెట్లు, మార్కెట్‌ భాగస్వాముల పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలు.
 • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు ప్రతికూలం. ద్వితీయార్థంలో స్వల్పంగా పుంజుకునే అవకాశం.
 • దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 60 శాతం వాటా కలిగిన రాష్ర్టాలు రెడ్‌/ఆరెంజ్‌ జోన్లలో ఉన్నాయి.
 • ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 920 కోట్ల డాలర్లు పెరిగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు. 
 • ఈ నెల 15 నాటికి 48,700 కోట్ల డాలర్లకు చేరిక.


logo